Jayasudha: ఆ వివక్ష ఇప్పటికీ ఉంది.. 100 కోట్లు తీసుకునే హీరోయిన్ ఉందా.. 

ABN , Publish Date - Sep 21 , 2025 | 10:51 AM

ఐదున్నర దశాబ్దాలుగా తెలుగువారిని తన నటనతో ఆకట్టుకుంటున్న సహజ నటి జయసుధ. ఆమె తొలిసారి హీరోయిన్‌గా నటించిన ‘లక్ష్మణరేఖ’ విడుదలయి 50 ఏళ్లు అయిన సందర్భంగా తన నటనా ప్రస్థానాన్ని ‘నవ్య’తో పంచుకున్నారు.

ఐదున్నర దశాబ్దాలుగా తెలుగువారిని తన నటనతో ఆకట్టుకుంటున్న సహజ నటి జయసుధ. ఆమె తొలిసారి హీరోయిన్‌గా నటించిన ‘లక్ష్మణరేఖ’ విడుదలయి 50 ఏళ్లు అయిన సందర్భంగా తన నటనా ప్రస్థానాన్ని ‘నవ్య’తో పంచుకున్నారు...

54 ఏళ్లు ఎక్కడా విరామం లేకుండా నటించటం ఒక రికార్డు. వెనక్కి తిరిగి చూస్తే ఎలా అనిపిస్తోంది?

‘ఇంత త్వరగా కాలం గడిచిపోయిందా?’ అనిపిస్తోంది. మీరు అన్నది నిజమే. 54 ఏళ్లుగా విరామం లేకుండా నటిస్తూనే ఉన్నా. మా పెద్ద అబ్బాయి కడుపులో ఉన్నప్పుడు- ఏడో నెలలో కూడా నటించా. వాడు పుట్టిన మూడో నెల నుంచి నటించటం మొదలుపెట్టా! ఒక విధంగా చెప్పాలంటే నేను మెటర్నిటీ లీవ్‌ కూడా పూర్తిగా తీసుకోలేదు. ఒక విధంగా ఇది నా అదృష్టం అనుకోవాలి.

హీరోయిన్‌ అవుతానని అనుకున్నారా?

నాకు చిన్నప్పటి నుంచి ఆటలంటే ఆసక్తి ఉండేది. క్రికెట్‌ ఆడేదాన్ని. క్రికెటర్‌ అవ్వాలనేది నా కోరిక. మా ఆంటీ విజయనిర్మల సినిమాల్లోకి వచ్చి స్థిరపడ్డారు. నాకు 12 ఏళ్లు ఉన్నప్పుడు- ‘పండంటి కాపురం’ సినిమాలో ఒక పాత్ర ఉంది. సుజాత (పూర్వాశ్రమంలో నా పేరు) చేస్తే బావుంటుంది’ అని మా నాన్నగారు నిడదవోలు రమేష్ గారిని ఆమె అడిగారు. అది నాకు ఇష్టం లేదు. కానీ ‘సొంత ప్రొడక్షనే కదా... చేస్తే ఏం పోతుంది’ అని అందరూ అభిప్రాయపడ్డారు. అలా నా సినిమా ప్రస్థానం మొదలైంది. ఆ తర్వాత మూడేళ్లకు ‘లక్షణ రేఖ’లో హీరోయిన్‌గా అవకాశం వచ్చింది. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. నాకు మొదటి నుంచి కెమెరా అంటే బెరుకు లేదు. నటన సహజంగానే వచ్చింది. మొదటి కొన్ని సినిమాల్లో నాకు భాషా సమస్య ఉండేది. నేను పుట్టి పెరిగింది చెన్నైలో కాబట్టి కొంత తమిళ యాస ఉండేది. తెలుగు చదవటం రాదు. అంతేకాదు, నాకు డైలాగ్స్‌ బట్టీపట్టడం రాదు. దాసరిగారు రెండు, మూడు పేజీల డైలాగ్స్‌ రాసేవారు. వాటిని విని చెప్పేసేదాన్ని. అయినా నా డబ్బింగ్‌ నేనే చెప్పుకొనేదాన్ని. అయితే గ్రాంథిక భాషలో ఉండే డైలాగ్స్‌ విషయంలో ఇబ్బంది ఉండేది. ఎన్టీఆర్‌గారు డైరక్ట్‌ చేసిన ‘శ్రీ తిరుపతి వేంకటేశ్వర కల్యాణం’ సినిమాలో ఆ ఇబ్బంది వచ్చింది. ఎన్టీఆర్‌గారు- ‘లక్ష్మీదేవి ఫ్రెంచి మాట్లాడుతున్నట్టు ఉంది’ అని సరదాగా అనేవారు. డబ్బింగ్‌ చెప్పటానికి ఎక్కువ రోజులు సమయం లేదు. దాంతో ఆ సినిమాలో నా పాత్రకు డబ్బింగ్‌ చెప్పించారు. నాకు వేరేవాళ్లు డబ్బింగ్‌ చెప్పిన సినిమా అదొక్కటే.

22222.jpg


మొదట్లో ప్రతి ఏడాది పది, పన్నెండు సినిమాలు చేసేవారు. కష్టమయ్యేదా?

మొదటి నాలుగేళ్లు చాలా కష్టపడ్డా! రోజుకు ఐదు షిప్ట్‌లు చేసేదాన్ని. ఉదయం మూడున్నరకు వెళ్లి నిద్రపోయి, ఉదయం ఆరింటికి షూటింగ్‌కి బయలుదేరి వెళ్లిపోయేదాన్ని. విపరీతమైన నిద్ర వచ్చేది. అప్పుడప్పుడు నిద్ర రాకుండా అమ్మ పొగలు కక్కుతున్న కాఫీ కప్పు నాముందు ఉంచేది. కాఫీ వాసన చూసిన తర్వాత నిద్ర కొద్దిగా పోయేది. ‘ఆక్రందన’, ‘పక్కింటి అమ్మాయి’, ‘యుగంధర్‌’ సినిమాలైతే కేవలం సాయంత్రం 6-9 కాల్‌షీట్‌లో పనిచేసి పూర్తిచేశా. ఆ తర్వాత నాన్నతో అంత కష్టపడనని చెప్పాను. కొద్దికాలానికి... సాయంత్రం 6 గంటల తరువాత పనిచేయనని చెప్పేశాను!

చిన్నతనంలోనే పెద్ద వయసున్న పాత్రలు వేశారు కదా... ఎలా అనిపించేది?

‘జ్యోతి’, ‘గోపాలరావుగారి అమ్మాయి’, ‘పక్కింటి అమ్మాయి’, ‘ఆమె కథ’- ఇలా అన్నీ టైటిల్‌ రోల్స్‌ చేసేదాన్ని. ఈ సినిమాలన్నీ హీరోయిన్‌ ప్రధానమైనవే! అన్నీ నాకు ముప్ఫై ఏళ్లలోపు వచ్చినవే! వాటి గురించి నేను పెద్దగా ఆలోచించలేదు. నేను చేసిన 350 సినిమాల్లో ఓ పది, ఇరవై నాకు ఇష్టం లేకుండా చేసినవి ఉండచ్చు. స్ర్కిప్ట్‌లు అన్నీ నేనే వినేదాన్ని. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. షూటింగ్‌లో ఉన్నప్పుడు పాత్రలో ఉంటాను. అయిపోయిన వెంటనే మామూలు ప్రపంచంలోకి వచ్చేస్తాను. ఇది నాకు చాలా సహజంగా జరిగిపోతుంది. అందువల్ల మానసికంగా పెద్ద ఇబ్బంది అనిపించేది కాదు.


2-navya.jpg
ఇంత కష్టపడుతున్నాను కదా... ‘సినిమాలు మానేద్దామా!’ అని ఎప్పుడూ అనిపించలేదా?

మూడేళ్ల తర్వాత మానేద్దామనుకున్నాను. నాన్న- ‘నీకు చదువురాలేదు. క్రికెటర్‌ అవ్వాలనుకుంటే పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. లేకపోతే పెళ్లి చేసుకోవాలి. నటిస్తే తప్పేముంది?’ అన్నారు. ఆంటీ కూడా ‘మొదలైంది కాబట్టి కొనసాగిద్దాం’ అన్నారు. కుటుంబంలో ఉన్నవారందరూ నేను నటిస్తేనే బెటర్‌ అనుకున్నారు. పెళ్లి అయిన తర్వాత మానేద్దామనుకున్నా. కానీ నితిన్‌కి కూడా సినిమాలు మాత్రమే తెలుసు. ఆయన డైరెక్టర్‌గా మారితే మానేద్దామనుకున్నా. అది కుదరలేదు. 60 ఏళ్లు వచ్చిన తర్వాత మానేద్దామనుకున్నా. కానీ నాకు 59 ఏళ్లు ఉన్నప్పుడు నితిన్‌ చనిపోయారు. అదొక షాక్‌! ఆ సమయంలో ‘శతమానం భవతి’ సినిమా షూటింగ్‌ పూర్తయింది. ఆ సినిమా ప్రమోషన్స్‌కు వెళ్లాల్సి వచ్చింది. అలాగే అయిపోతోంది. నాకు ఒక సముద్రం ఒడ్డున ఇల్లు కట్టుకొని, ఉదయాన్నే వాక్‌కు వెళ్తూ, మధ్యాహ్నం లైబ్రరీకి వెళ్తూ జీవించాలని ఉంటుంది. అప్పుడప్పుడు ‘నా జీవితం ఇలా ముందే రాసి ఉందేమో?’ అనుకుంటాను.

ఇండస్ట్రీ పురుష ఆధిపత్యంలోనే ఉంటుంది కదా... ఇంత కాలం ఎలా ఉండ గలిగారు?

భానుమతిగారు బలమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. సావిత్రిగారు తన వ్యక్తిగత జీవితాన్ని సరిగ్గా నడుపుకోలేకపోయారు. వాణిశ్రీగారు, జమునగారు.. వీరందరూ ఒకప్పుడు ఇండస్ట్రీని శాసించినవారే! తమ టర్మ్స్‌లో జీవించినవారే! నా దగ్గరకు వచ్చేసరికి - కథలు,  స్క్రిప్ట్స్  విషయంలో నేను ఎప్పుడూ రాజీ పడేదాన్ని కాదు. మా సమయంలో హీరోయిన్‌ ఆధారిత సినిమాలు అనేకం వచ్చేవి. హీరోలు కూడా అలాంటి పాత్రలు అంగీకరించేవారు. నేను, జయప్రద, శ్రీదేవి- మేము ముగ్గురం చాలాకాలం తెలుగు సినీ రంగాన్ని ఏలాం. ఆ తర్వాత జయప్రద, శ్రీదేవి బాలీవుడ్‌కు వెళ్లిపోవటంతో వారి రోల్స్‌ను కూడా నేనే చేసేదాన్ని. అయితే హీరో, హీరోయిన్‌లను చూసే విధానంలో అప్పుడు తేడా ఉంది. అది ఇప్పటికీ కొనసాగుతోంది. హీరో ఆరాధన కొనసాగుతూనే ఉంటుంది. 150 మంది పనిచేస్తూ ఉంటే 20 మంది మాత్రమే మహిళలు ఉంటారు. ఇప్పుడు మరింతగా పెరిగిపోయింది. ఇప్పుడు హీరోయిన్‌... హీరోకు తోకలాగ ఉంటోంది. రూ.100 కోట్లు తీసుకునే హీరోయిన్లు ఎవ్వరు లేరు కదా!


 

22-navya.jpg

నేను కొన్ని గ్లామరస్‌ పాత్రలు చేశాను. నన్ను, కమల్‌హాసన్‌ను- నీతూసింగ్‌, రిషీకపూర్‌లతో పోల్చేవారు. వాళ్లు ధరించిన మాదిరి కాస్ట్యూమ్స్‌ను మేం వేసుకొనేవాళ్లం. ఇక నా దృష్టిలో గ్లామర్‌ అంటే జీనత్‌ అమన్‌. ఆమె ఫిగర్‌ అలాంటిది. ఆమెకు ఎలాంటి దుస్తులు వేసినా వల్గర్‌గా ఉండేది కాదు. ఇక స్విమ్మింగ్ డ్రెస్ లాంటివి నేను చాలా తక్కువ సినిమాల్లో ధరించా. ‘యుగంధర్‌’ (హిందీలో ‘డాన్‌’) సినిమాలో వేసుకోవాల్సి వచ్చింది. తెలుగులో నేను చేసిన పాత్రను హిందీలో జీనత్‌ అమన్‌ చేసింది. అలాంటి దుస్తులు ధరించాలన్నా నేను పెద్దగా ఇబ్బంది పడేదాన్ని కాదు. ఎందుకంటే చిన్నప్పుడు నేను స్విమ్మర్‌ను. స్విమ్మింగ్‌ చేసేటప్పుడు చీర కట్టుకోరు కదా! సినిమాలో కూడా అంతే! ఇక డైలాగ్స్‌, కాస్ట్యూమ్స్‌ విషయంలో ఇబ్బంది ఉంటే డైరక్టర్‌లకు చెప్పకుండా మాతో నటించే హీరోలకు చెప్పేవాళ్లం. వారు వెళ్లి మా పేరు చెప్పకుండా - ‘ఈ దుస్తులు బాగుంటాయా?’,‘ఈ డైలాగ్‌ బావుందా?’’ అని డైరక్టర్‌లను అడిగేవారు. డైలాగ్స్‌లో ఏదైనా తేడా ఉంటే అందరికన్నా ముందే ఏఎన్నార్‌ పసిగట్టేసేవారు.


Jaya.jpgచిన్నప్పుడు మా ఇంట్లో బీటిల్స్‌ లాంటి ఇంగ్లీషు పాటలు మాత్రమే వినేవాళ్లం. నాన్నా ఇంగ్లీషు సినిమాలు చూసేవారు. అమ్మ హిందీ సినిమాలు మాత్రమే చూసేవారు.

నాకు చీరలంటే చాలా ఇష్టం. చీరల ఎగ్జిబిషన్‌లు నడుపుతూ ఉంటా. అమ్మాయిలకు చీర కన్నా అందమైన కాస్ట్యూమ్‌ మరేదీ ఉండదు. నా చిన్నతనంలో చాలా వేగంగా చీర కట్టేసుకొనేదాన్ని. కానీ ఈ మధ్యకాలంలో చీరకట్టుకోవటం మానేశాను. ఫ్యాంట్‌, షర్ట్‌లు చాలా సౌలభ్యంగా అనిపిస్తున్నాయి.

ఆ రోజుల్లో సోషల్‌ మీడియాలేదు కాబట్టి బతికిపోయేవాళ్లం. ఎల్లో జర్నలిజం ఉండేది కానీ ఏవైనా రూమర్స్‌ రాస్తే వెళ్లికొట్టేవారు. ఆ సమయంలో కాగడాశర్మ అనే ఆయన చాలా ఫేమస్‌. ఆయన ఇలాంటివి రాసేవారు. అయినా అవేవీ నా దగ్గరకు వచ్చేవి కావు. ఒకసారి ఏదో ఫంక్షన్‌లో ఒక వ్యక్తి వచ్చి నా పక్కన కూర్చున్నారు. ఆయన ఎవరో నాకు తెలియదు. ‘నేను కాగడాశర్మని...’ అని పరిచయం చేసుకున్నారు. నేను అప్రయత్నంగా - ‘మీరేనా... ఎందుకండీ... అందరి గురించి అంత బ్యాడ్‌గా రాస్తారు...’ అన్నాను! ‘అలా రాయకపోతే ఎవరు చదువుతారమ్మా’ అన్నాడాయన. ఇండస్ట్రీలో ఉన్న హెయిర్‌డ్రెస్సర్స్‌, మేకప్ మెన్స్, అసిస్టెంట్లు.. ఇలా చుట్టూ ఉన్న వారంతా గ్యాసిప్‌ మాట్లాడుకుంటూ ఉండేవారు.

Updated Date - Sep 21 , 2025 | 12:35 PM