Jani Master: డాన్సర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షురాలిగా జానీ మాస్టర్‌ భార్య

ABN , Publish Date - Dec 09 , 2025 | 03:23 PM

తెలుగు సినిమా, టీవీ డాన్సర్స్‌ అసోసియేషన్‌ (TFTDDA)అధ్యక్షురాలిగా జానీ మాస్టర్‌ భార్య సుమలత అలియాస్‌ అయేషా ఘన విజయం సాధించారు.


తెలుగు సినిమా, టీవీ డాన్సర్స్‌ అసోసియేషన్‌ (TFTDDA)అధ్యక్షురాలిగా జానీ మాస్టర్‌ భార్య సుమలత అలియాస్‌ అయేషా ఘన విజయం సాధించారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో తన ప్రత్యర్థి జోసెఫ్‌ ప్రకాష్‌ మాస్టర్‌పై ఆమె 29 ఓట్ల మెజారిటీతో గెలిచి అధ్యక్ష పదవిని సొంతం చేసుకున్నారు. అసోసియేషన్‌లో 510 ఓట్లు ఉండగా, 439 ఓట్లు పోల్‌ అయ్యాయి. సుమలతకు 228 ఓట్లు వచ్చాయి.  జోసెఫ్‌ ప్రకాష్‌ మాస్టర్‌కు 199 మంది ఓటు పడ్డాయి. మరో అభ్యర్థి చంద్రశేఖర్‌కు 11 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో ఎన్నికల్లో సుమలత విజయం సాధించినట్లు ప్రకటించారు.  ఇంతకుముందు జానీ మాస్టర్‌ అధ్యక్షుడిగా పని చేశారు. ఇప్పుడు ఆయన భార్య అధ్యక్షురాలు కాబోతున్నారు. ఈసారి జానీ మాస్టర్‌ పోటీ చేస్తారని వార్తలొచ్చాయి. కానీ భార్యను రంగంలోకి దింపారు. విజయం తర్వాత జానీ.. సుమలతను ఆలింగనం చేసుకుని ఆనందం వ్యక్తం చేస్తున్న వీడియోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.  ఈ సందర్భంగా డాన్స్ యూనియన్ ఫౌండర్ ముక్కు రాజు విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.  

అధ్యక్ష పదవికి జానీ మాస్టర్‌ భార్య ఎంపిక కావడం సినీ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. సుమలత ఒంటరిగా బరిలో దిగారు. జోసెఫ్‌ అసోసియేషన్‌లోని సీనియర్లు, ప్రముఖ డాన్స్‌ మాస్టర్లు జోసెఫ్‌ కు బహిరంగంగానే మద్దతుగా నిలిచారు. అందులో శేఖర్‌ మాస్టర్‌, భాను మాస్టర్‌, రఘు మాస్టర్‌ వంటి పలువురు ఉన్నారు. జానీ మాస్టర్‌పై ఆరోపణలు చేసిన స్రష్టి వర్మ కూడా జోసెఫ్‌కు మద్దతు పలికింది. కానీ ఒంటరిగా బరిలో దిగిన సుమలత.. గ్రౌండ్‌ లెవెల్‌లో వచ్చిన సపోర్ట్‌తో విజయం సాదించి అధ్యక్ష పదవిని కైవసం చేసుకున్నారు. ఎలాంటి మద్దతు లేకుండా సుమలత సాధించిన విజయం అసోసియేషన్‌లో కొత్త మార్పునకు సంకేతమని కొందరు కొరియోగ్రాఫర్లు అంటున్నారు. నెటిజన్లు అలాగే కామెంట్స్‌ పెడుతున్నారు. సింపుల్‌గా క్యాంపెయిన్‌ చేసిన సుమలత.. తన స్పష్టమైన మాటలతో ఆకట్టుకున్నారని, అందుకే గెలుపొందారని చెబుతున్నారు. ఈ విజయంతో జానీ మాస్టర్‌ కెరీర్‌ మళ్లీ మలుపు తిరగబోతుందని ప్రచారం జరుగుతోంది. లైంగిక ఆరోపణలతో జైలుకు వెళ్లొచ్చిన జానీ ఇటీవల సెకెండ్‌ ఇన్నింగ్స్‌ స్టార్ట్‌ చేశారు. ఇటీవల ‘పెద్ది’ సినిమాలో ‘చికిరి చికిరి’ సాంగ్‌కు కొరియోగ్రఫీ చేసి ఆకట్టుకున్నారు. 

Updated Date - Dec 09 , 2025 | 03:26 PM