Jani Master Reentry: మళ్లీ ఫామ్ లోకి జానీ మాస్టర్.. ఆ సినిమాతో తెలుగులో రీఎంట్రీ

ABN , Publish Date - Jul 15 , 2025 | 05:30 PM

ఈ ఏడాదిలో జరిగిన పెద్ద వివాదాల్లో జానీ మాస్టర్ (Jani Master) వివాదం ఒకటి. డ్యాన్సర్ శ్రేష్టి వర్మ, జానీ మాస్టర్ పై కేసు పెట్టడం ఎంత సెన్సేషన్ సృష్టించిందో అందరికీ తెలిసిన విషయమే.

Jani Master

Jani Master Reentry: ఈ ఏడాదిలో జరిగిన పెద్ద వివాదాల్లో జానీ మాస్టర్ (Jani Master) వివాదం ఒకటి. డ్యాన్సర్ శ్రేష్టి వర్మ, జానీ మాస్టర్ పై కేసు పెట్టడం ఎంత సెన్సేషన్ సృష్టించిందో అందరికీ తెలిసిన విషయమే. జానీ మాస్టర్ తనను పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తున్నాడని, మతం మార్చుకోవాలని బలవంతం చేస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలన సృష్టించింది. ఆ ఫిర్యాదుతో జానీ మాస్టర్ ను పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో ఉంచారు. ప్రస్తుతం బెయిల్ మీద బయటకు వచ్చిన జానీ మాస్టర్ ఆ వివాదం చేసిన గాయం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకోవడం మొదలుపెట్టాడు.


ఆ వివాదంలో తప్పు ఒప్పులు ఎవరివి అనేది ఇప్పటివరకు తెలియలేదు కానీ, ఇండస్ట్రీలో ఆయనకు మాత్రం చాలా నష్టం వాటిల్లింది అని చెప్పొచ్చు. ఒకపక్క పేరు పోయింది.. ఇంకోపక్క అవకాశాలు కూడా పోగొట్టుకొని జానీ మాస్టర్ చాలా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నాడు. అయితే కాలం అన్నిటిని మార్చేస్తుంది. ఇప్పుడిప్పుడే జానీ మాస్టర్ కొత్త కొత్త అవకాశాలను అందిపుచ్చుకొని తన టాలెంట్ తో మరోసారి పైకి ఎదగాలని ప్రయత్నాలు సాగిస్తున్నాడు. బెయిల్ నుంచి బయటకు వచ్చాక హిందీ, కన్నడ భాషల్లో అవకాశాలను అందుకొని ముందుకు కొనసాగుతున్నాడు.


ఇక ఇప్పుడు తెలుగులో ఒక స్టార్ హీరో సినిమాతో రీఎంట్రీ ఇస్తున్నాడు. మాస్ మహారాజా రవితేజ, శ్రీలీల జంటగా నటిస్తున్న చిత్రం మాస్ జాతర. భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను నాగవంశీ నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమాలోని ఒక మాస్ సాంగ్ కు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నాడు. నిన్ననే ఈ సాంగ్ షూట్ పూర్తి అయ్యినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్నీ జానీ మాస్టర్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు.


సాంగ్ షూట్ పూర్తి అయ్యాక శ్రీలీల.. జానీ మాస్టర్ కు థాంక్స్ చెప్తూ బొకేను పంపించింది. దీంతో శ్రీలీలకు జానీ మాస్టర్ థాంక్స్ చెప్పుకొచ్చాడు. ' థాంక్యూ శ్రీలీల గారు. మీరో కలిసి పనిచేయడం ఎంతో అద్భుతం. మాస్ జాతరలో మీరు, రవితేజ గారు కలిసి చేసిన మాస్ స్టెప్స్ చూడడానికి మేము అందరం ఎదురుచూస్తున్నాం' అంటూ కొన్ని వర్కింగ్ స్టిల్స్ ను షేర్ చేశాడు. ఇందులో శ్రీలీల లంగాఓణిలో కనిపించింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో జానీ మాస్టర్ మంచి విజయాన్ని అందుకొని మరిన్ని అవకాశాలను అందుకుంటాడేమో చూడాలి.

Updated Date - Jul 15 , 2025 | 05:30 PM