Upendra: చిరంజీవి గారి.. సినిమా డైరెక్ట్ చేయాలనేది నా కల
ABN , Publish Date - Nov 26 , 2025 | 07:59 AM
రామ్ హీరోగా నటించిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ ఈ గురువారం సినిమా విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఉపేంద్ర పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
రామ్ (Ram Pothineni), భాగ్య శ్రీ భోర్సే (Bhagyasri Borse) జంటగా నటించిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ (Andhra King Thaluka) చిత్రంలో ఉపేంద్ర (Upendra) కీలకపాత్ర పోషించారు. పి. మహేశ్‌బాబు (Mahesh babu) దర్శకత్వం వహించిన చిత్రమిది. ఈ గురువారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఉపేంద్ర మీడియాతో సినిమా విశేషాలను పంచుకున్నారు.
‘ఆంధ్ర కింగ్ తాలూకా’ చిత్రంలో భాగమైనందుకు చాలా ఆనందంగా ఉంది. అద్భుతమైన ఎమోషన్స్ ఉన్న సినిమా ఇది. ఒక స్టార్ హీరోకూ, అతన్ని ఆరాధించే అభిమానికి మధ్య జరిగే కథ ఇది. నేనొక ప్రేక్షకుడిగా కథ విన్నాను. హీరోకూ, అభిమానికి మధ్య ఉండే ఎమోషన్ చాలా గొప్పది. దాన్ని ఈ సినిమాలో దర్శకుడు మహేశ్‌బాబు చాలా అద్భుతంగా, కొత్తగా చూపించారు. ఈ సినిమా ప్రేక్షకులను అలరించడం ఖాయం.
రామ్ గొప్ప నటుడు. ఆయన నటన ఈ సినిమాకు ప్రత్యేకాకర్షణ. ఒక స్టార్ అయి ఉండికూడా ఒక సామాన్య అభిమానిలో ఉండే అమాయకత్వాన్ని ఆయన అభినయించిన తీరు అద్భుతం. భాగ్యశ్రీ బోర్సే, రామ్ మధ్య వచ్చే రెట్రో లవ్ స్టోరీ హృదయాలకు హత్తుకుంటుంది. మంచి నిర్మాణ విలువలతో మైత్రీ మూవీస్ నిర్మించింది. ఇంత మంచి ఎమోషనల్ చిత్రాన్ని నిర్మించినందుకు వారికి అభినందనలు తెలిపారు.
ఇక.. ‘నేను సినిమాల్లోకి రాకముందు చిరంజీవి (Chiranjeevi) గారి సినిమాలను ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేవాణ్ణి. ఆ అనుభూతి చాలా గొప్పది. చిరంజీవి గారి సినిమాని డైరెక్ట్ చేయాలనేది నా కల. త్వరలో ఆ కల తీరుతుందనే నమ్మకం ఉంది’ అని కన్నడ హీరో ఉపేంద్ర అన్నారు’.