Hit 5: బాలయ్య కిట్ లో మరో హిట్...
ABN , Publish Date - May 16 , 2025 | 07:37 PM
నటసింహ నందమూరి బాలకృష్ణ కు, నేచురల్ స్టార్ నానికి మధ్య ఓ అనుబంధం ఉంది. అప్పట్లో బాలయ్య సినిమా హిట్టయితే నాని ముందుగా విషెస్ చెప్పేవారు. ఆ అనుబంధంతోనే ఇప్పుడు ఓ క్రేజీ ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతోందట.
నటసింహ నందమూరి బాలకృష్ణ (Balakrishna)కు, నేచురల్ స్టార్ నాని (Naani)కి మధ్య ఓ అనుబంధం ఉంది. అప్పట్లో బాలయ్య సినిమా హిట్టయితే నాని ముందుగా విషెస్ చెప్పేవారు. అది చూసి అభిమానమేమో అనుకొనేవారు. ఇక నానికి మంచి పేరు తెచ్చిన 'రైడ్' సినిమాలో బాలయ్య 'మంగమ్మగారి మనవడు'లోని "దంచవే మేనత్త కూతురా..." సాంగ్ రీమిక్స్ లో నాని చిందేశాడు. అలా బాలయ్య ఫ్యాన్స్ మనసూ గెలుచుకున్నాడు. ఆ తరువాత నాని స్టార్ అయ్యాక 'కృష్ణగాడి వీరప్రేమగాథ' సినిమాలో నాని బాలయ్య అభిమానిగా నటించాడు. అందులో నాని చేయిపై 'జై బాలయ్యా' అన్న టాటూ కూడా కనిపిస్తుంది. ఆ సినిమా మొదటి ఆట అంత మంచి టాక్ సంపాదించలేదు. కానీ, బి,సి సెంటర్స్ లో 'కృష్ణగాడి వీరప్రేమగాథ' దుమ్ముదులిపేసింది. ఆ తరువాతే పెద్ద సెంటర్స్ లో కూడా ఊపందుకుంది. ఇవన్నీ అయ్యాక 'ఆహా'లో బాలకృష్ణ నిర్వహించే 'అన్ స్టాపబుల్' ప్రోగ్రామ్ లో కూడా నాని పాల్గొని సందడి చేశారు. ఇంతలా బాలయ్యతో అనుబంధం ఉన్న నాని నిర్మించిన 'హిట్' సిరీస్ ఒకదానిని మించి మరోటి హిట్టయింది. 'హిట్ ఫ్రాంచైజీ'లో బాలయ్య నటించనున్నాడని విశేషంగా వినిపిస్తోంది.
హిట్ ఫ్రాంచైజీలో తరువాత వచ్చే సినిమాలో హీరో ఎవరన్నది రివీల్ చేయడం ఓ విశేషం! అడివి శేషు 'హిట్ 2'లో క్లయిమాక్స్ లో నాని కనిపించాడు. 'హిట్ 3'లో నానియే హీరోగా నటించాడు. ఇక 'హిట్ 3' ఎండింగ్ లో కార్తి కనిపించాడు. అంటే రాబోయే 'హిట్ 4'లో కార్తి హీరో అని తేలిపోయింది. అంతా బాగానే ఉంది. ఇప్పుడు 'హిట్ 4' చివరలో ఏ హీరో కనిపించి 'హిట్ 5'లో కథానాయకుడవుతాడో అన్న ఆసక్తి నెలకొంది. ఇక్కడే బాలయ్యతో నానికి ఉన్న అనుబంధం పనిచేసిందని అంటున్నారు సినీజనం. 'హిట్ 4' చివరలో బాలయ్య కనిపిస్తారని, తరువాత రాబోయే 'హిట్ 5'లో ఆయనే హీరోగా నటించనున్నారని టాలీవుడ్ లో టముకు సాగుతోంది.
'హిట్ 5'లో నటించడానికి బాలయ్య కూడా అంగీకరించారని టాలీవుడ్ టాక్. అంతేకాదు 'హిట్ 5'లో బాలయ్య మెయిన్ హీరో కాగా, నాని, కార్తి కూడా కనిపిస్తారని వినికిడి. ఇదిలా ఉంటే 'హిట్ 5' తరువాత కూడా మరో రెండు సినిమాలు ఈ ఫ్రాంచైజీలో ఉంటాయని వాటిలోనూ టాప్ హీరోస్ మెయిన్ లీడ్స్ లో కనిపిస్తారని సమాచారం. డైరెక్టర్ శైలేష్ కొలను క్యాంప్ నుండే వినిపిస్తున్న మాట ఏంటంటే 'హిట్ 7' దాకా ఫ్రాంచైజీ సాగుతుందట! మరి 'హిట్ 5'లో బాలయ్య మెయిన్ లీడ్ లో కనిపిస్తే, రాబోయే 'హిట్ 6', 'హిట్ 7'లో నటించే టాప్ స్టార్స్ ఎవరబ్బా అన్న ఆసక్తి కూడా సాగుతోంది. ఇదే జరిగితే ఇండియన్ స్క్రీన్ పై ఏడు భాగాలుగా వచ్చిన ఫ్రాంచైజీగా 'హిట్' ఓ రికార్డ్ సృష్టించనుంది. ఇంతకూ 'హిట్ 5'లో బాలయ్య నటిస్తున్నాడంటారా? అన్న అనుమానాలూ కొందరిలో కలుగుతున్నాయి. ఏమవుతుందో చూద్దాం.