Peddi: పెద్దికి.. అడ్డు ప‌డుతున్న ఇండిగో! షూటింగ్ వాయిదా

ABN , Publish Date - Dec 08 , 2025 | 05:10 PM

ఇండిగో ఇటీవల ఎదుర్కొంటున్న ఆపరేషనల్ సంక్షోభం దేశవ్యాప్తంగా ప్రయాణికులకు భారీ ఇబ్బందులు తెచ్చిపెడుతున్న సంగ‌తి తెలిసిందే.

Ram Charan

దేశంలో అతిపెద్ద ఎయిర్‌లైన్ ఇండిగో (INDIGO) ఇటీవల ఎదుర్కొంటున్న ఆపరేషనల్ సంక్షోభం దేశవ్యాప్తంగా ప్రయాణికులకు భారీ ఇబ్బందులు తెచ్చిపెడుతున్న సంగ‌తి తెలిసిందే. సిబ్బంది కొరత, నిర్వహణ లోపాలు తీవ్ర స్థాయికి చేరడంతో వరుసగా ఫ్లైట్లు రద్దు అవుతూనే ఉన్నాయి. వంద‌ల‌కు వంద‌ల విమానాలు నిత్యం ట్రిప్స్ ర‌ద్దు చేస్తూ, ఆల‌స్యం చూస్తూ ప్ర‌యాణికుల స‌హ‌నానికి ప‌రీక్ష‌ పెడుతున్నాయి. దీంతో వేలాది మంది ప్రయాణికులు ఎయిర్‌పోర్టుల్లోనే ప‌డిగాపులు కాస్తూతీవ్ర స‌మ‌స్య‌లు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు ఈ ప్రభావం సినీ ఇండస్ట్రీ వరకు చేరింది.

తాజాగా అందుతున్న‌ సమాచారం ప్రకారం.. బుచ్చిబాబు (Buchi Babu Sana) ద‌ర్శ‌క‌త్వంలో రామ్ చరణ్ (Ram Charan) నటిస్తోన్న భారీ ప్రాజెక్ట్ ‘పెద్ది’ (Peddi) షూటింగ్ సైతం ఈ విమానాల రద్దు సమస్యకు గురైంది. డిసెంబర్ 5 నుంచి ఢిల్లీలో ప్లాన్ చేసిన కీలక యాక్షన్ సీన్‌ల చిత్రీకరణను అకస్మాత్తుగా వాయిదా వేసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇండిగో విమానాల సంఖ్య ఉన్న‌ఫ‌లంగా తగ్గిపోవడంతో యూనిట్ సభ్యులు ఢిల్లీకి చేరటం కష్టమయ్యిందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమా భారీ బడ్జెట్‌తో వృద్ధి సినిమాస్ నిర్మిస్తోంది. వచ్చే ఏడాది సమ్మర్‌కు గ్రాండ్ రిలీజ్ ప్లాన్ చేస్తుండగా షూటింగ్‌ను వేగంగా పూర్తిచేయాలని టీమ్ ప్రయత్నిస్తోంది. అయితే తాజా అంతరాయం వలన షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు తప్పనిసరి అయినట్లు తెలుస్తోంది. ‘పెద్ది’తో పాటు మరికొన్ని చిత్రాల షూటింగ్‌లు కూడా ఇదే కారణంతో వాయిదా పడ్డాయని స‌మాచారం. మ‌రి ఆ ఆల‌స్యం వ‌ల్ల జ‌రిగే ప‌రిణామాలు సినిమాల‌ విడుద‌ల తేదీల‌పై ఉమాత్రం ప‌డుతుంద‌నేది తెలియాలి.

ఉత్తరాంధ్ర నేపథ్యంతో రూరల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ పూర్తిగా మాస్ లుక్‌లో కనిపించబోతున్నారు. ఆయన సరసన జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్‌గా నటిస్తోంది. కన్నడ నటుడు శివరాజ్‌కుమార్ కీ రోల్‌లో కనిపించనున్నాడు. జగపతి బాబు, మిర్జాపూర్ ఫేం దివ్యేందు శర్మ ఇత‌ర పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టైటిల్ గ్లింప్స్, చికిరి చికిరి పాట‌ అభిమానుల్లో పెద్ద హైప్ క్రియేట్ చేయ‌డ‌మే కాక సినిమాపై అంచ‌నాల‌ను రెండింత‌లు రెట్టింపు చేశాయి.

Updated Date - Dec 08 , 2025 | 05:11 PM