Ram Charan: ఆర్చరీ ప్రీమియర్ లీగ్.. APL ప్రారంభించిన రామ్‌చరణ్
ABN , Publish Date - Oct 03 , 2025 | 10:09 AM
ఆర్చరీ ప్రీమియర్ లీగ్ న్యూఢిల్లీలోని యమునా స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఘనంగా ప్రారంభించారు. రామ్ చరణ్ దంపతులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఇటీవల మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌కు మరో ప్రత్యేక గౌరవం దక్కిన విషయం తెలిసిందే. భారతదేశంలో తొలిసారిగా జరగనున్న ఆర్చరీ ప్రీమియర్ లీగ్ (Archery Premier League – APL 2025)కి ఆయనను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమిస్తూ జాతీయ ఆర్చరీ అసోసియేషన్ (AAI) అధికారికంగా ప్రకటించింది. అయితే ఈ టోర్నమెంట్ అక్టోబర్ 2 న గాంధీ జయంతి, దసరా ఉత్సవాలను పురస్కరించుకుని న్యూఢిల్లీలోని యమునా స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఘనంగా ప్రారంభించారు. రామ్ చరణ్ దంపతులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ.. ఈ లీగ్‌ను ‘ఐకానిక్ స్పోర్ట్’గా పేర్కొన్నారు. ఇందులో భాగం కావడం నాకు గర్వంగా ఉందని, ఇది భారత ఆర్చర్లకు అంతర్జాతీయ వేదికగా మాత్రమే కాకుండా, ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందడానికి అవకాశాన్ని కల్పిస్తుందని తెలిపారు. భవిష్యత్ ఆర్చర్లు, యువతకు స్ఫూర్తిగా నిలవడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఆయన పేర్కొన్నారు. “ఆర్చరీ మన చరిత్రలో, సంస్కృతిలో భాగం అని రామాయణం, మహా భారతం వంటి ఇతిహాసాల్లో ఆర్చరీ ప్రాముఖ్యత ఉందని అన్నారు. ఈ క్రీడతో నా జీవితం ముడిపడి ఉందని, నేను RRR సినిమాలో సీతారామరాజు పాత్రలో ఆర్చరీ కీలకం అని అన్నారు. , భారతీయ క్రీడా ప్రియులందరినీ ఈ ఐకానిక్ స్పోర్ట్‌ను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు.
AAI అధ్యక్షుడు అర్జున్ ముండా మాట్లాడుతూ.. ఈ లీగ్ దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లోనూ దాగి ఉన్న ప్రతిభను వెలికితీసే వేదికగా ఉంటుందని అన్నారు. రామ్ చరణ్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండటం వల్ల యువత ఆర్చరీ పట్ల మరింత ఆకర్షితులు అవుతారని, దేశంలో ఆర్చరీకి ఇది ఒక కొత్త అధ్యాయమని చెప్పారు. ఈ ఫ్రాంచైజీ ఆధారిత లీగ్‌లో దేశీయ పురుష, మహిళా కాంపౌండ్, రికర్వ్ ఆర్చర్లు మరియు వివిధ దేశాల నుంచి 12 అంతర్జాతీయ ఆర్చర్లు పాల్గొంటారు. మొత్తం ఆరు ఫ్రాంచైజీల నుంచి 36 మంది భారత టాప్ ఆర్చర్లు పోటీ పడతారన్నారు. ప్రత్యేక ఫార్మాట్‌లో, రికర్వ్ మరియు కాంపౌండ్ ఆర్చర్లు ఫ్లడ్‌లైట్స్ కింద పోటీ నిర్వహిస్తామని, ఇది మన ప్రేక్షకులకు ప్రత్యేకమైన, ప్రొఫెషనల్ లీగ్ అనుభవాన్ని ఇస్తుంది అన్నారు. ఈ పోటీలు ఈనెల 12 వరకు జరుగుతాయని స్పష్టం చేశారు.