Chitrapuri Colony: చిత్రపురి @ రూ.43.78కోట్లు.. వారి నుంచి వడ్డీతో సహా వసూలు చేయాల్సిందే
ABN , Publish Date - Dec 05 , 2025 | 07:07 AM
చిత్రపురి కాలనీలో 2005–2020 మధ్య జరిగిన అవకతవకలపై విచారణ పూర్తయింది. 15 మంది మాజీ – ప్రస్తుత కమిటీ సభ్యులు బాధ్యులు అని నివేదిక స్పష్టం చేసింది.
సినీ కార్మికుల కలల సౌధమైన చిత్రపురి కాలనీ (Chitrapuri Colony) లో అక్రమాల డొంకపై విచారణకు తెరపడింది. రెండేళ్ల క్రితం చిత్ర పురి కాలనీలో చోటుచేసుకున్న అక్రమాలను 'ఆంధ్రజ్యోతి' వెలుగులోకి తీసుకురాగా, ఆ తర్వాత అధికారుల విచారణలో నిజాలు ఒక్కొక్కటిగా విగ్గు తేలాయి.
సినీ కార్మికులకు న్యాయం చేయడమే లక్ష్యంగా కో-ఆపరేటివ్ ట్రిబ్యునల్ ఆదేశాలతో అధికార యంత్రాలకు చర్యలకు దిగింది. 2005 నుంచి 2020 వరకు చిత్రపురి కాలనీ హౌసింగ్ సొసైటీలో అవకతవకలపై కమిటీ విచారణ జరిపింది. గోల్కొండ కో-ఆపరేటివ్ డిప్యూటీ రిజిస్ట్రార్ వారం రోజులు క్రితం రాష్ట్ర ప్రభుత్వా నికి 20 పేజీలతో కూడిన నివేదికను అందజేశారు.
అక్రమాలకు సంబంధించి నివేదికలో అప్పటి చిత్రపురి కాలనీ హౌసింగ్ సొసైటీ కమిటీకి చెందిన 15 మందిని బాధ్యులుగా చేర్చారు. పాత, ప్రస్తుత కమిటీ సభ్యుల పాత్ర ఉందంటూ నివేదికలో కమిటీ పేర్కొంది. ఆ కమిటీ బాధ్యుల నుంచి రూ. 43.78 కోట్లను రికవరీ చేయాలని, 18 శాతంతో వడ్డీ కూడా వసూలు చేయాలని నివేదికలో స్పష్టం చేసింది.
అప్పటి చిత్రపురి హౌసింగ్ సొసైటీ కమిటీలోని కొమర వెంకటేష్, ఎం. వినోద్ బాల, పీఎస్ కృష్ణమోహన్ రెడ్డి, పరుచూరి వెంకటేశ్వరరావు, తమ్మారెడ్డి భరద్వాజ్, కాదంబరి కిరణ్, అనిల్ కుమార్ వల్లభనేని, కె.రాజేశ్వర్ రెడ్డి, దేవినేని బ్రహ్మా నందరావు, చండ్ర మధు, ఉదయ్ భాస్కర్, కొల్లి రామకృష్ణ తదితరులు బాధ్యులుగా నివేదికలో పేర్కొన్నారు.