Game Changer: ‘గేమ్ చేంజర్’ టికెట్ల ధరల పెంపు అంశాన్ని.. ‘పుష్ప 2’కి లింక్ పెట్టిన హైకోర్టు.. ఫ్యాన్స్‌లో ఉత్కంఠ
ABN , Publish Date - Jan 09 , 2025 | 05:59 PM
ఏపీలో ‘గేమ్ చేంజర్’కు అక్కడి ప్రభుత్వం అన్ని రకాలుగా సాయం అందిస్తూ జీవోని విడుదల చేసింది. తెలంగాణలోనూ బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వలేదు కానీ.. టికెట్ల ధర పెంచుకోవచ్చంటూ కొన్ని నిబంధనలతో తెలంగాణ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఈ జీవోపై తెలంగాణ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేస్తూ విచారణ చేపట్టినట్లుగా సమాచారం.
ఈ సంక్రాంతికి వస్తున్న సినిమాలలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ చేంజర్’ సినిమా భారీ బడ్జెట్‌తో నిర్మితమైంది. దీంతో ఈ సినిమాకు ఏపీలో టికెట్ల ధరలు, బెనిఫిట్ షోలకు అనుమతి వచ్చినా, తెలంగాణలో మాత్రం కన్ఫ్యూజన్ కొనసాగుతూనే ఉంది. బుధవారం రాత్రి తెలంగాణ ప్రభుత్వం ఈ సినిమాకు టికెట్ల ధరలను పెంచుకునేందుకు వెసులుబాటును కల్పిస్తూ ఓ జీవో విడుదల చేసింది. కానీ ఈ జీవోపై హైకోర్టు అసంతృప్తిని వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. అందుకే తెలంగాణ గేమ్ చేంజర్ సినిమా టికెట్ ధరల పెంపుపై హైకోర్టులో విచారణ జరగనుందని తెలుస్తోంది. దీంతో ఫ్యాన్స్‌లో ఉత్కంఠ మొదలైంది. టికెట్ల ధరలు పెంచుకునే వెసులుబాటుని ప్రభుత్వం కల్పించిందనే న్యూస్ వచ్చిన కాసేపటికే.. ఇలాంటి వార్త రావడంతో అటు ఫ్యాన్స్, ఇటు చిత్రయూనిట్ కూడా గందరగోళంలో పడిపోయారు.
వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. తెల్లవారు జామున అదనపు షోలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై హైకోర్టు అసంతృప్తిని వ్యక్తం చేసిందని, అదనపు షోలు, షో టైమింగ్స్, ప్రేక్షకుల రద్దీ నియంత్రణకు సంబంధించి శుక్రవారం ఆదేశాలు ఇస్తామని, టికెట్ ధరల పెంపు అంశాన్ని ‘పుష్ప-2’ కేసుతో పాటుగా విచారణ జరుపుతామని తెలుపుతూ.. తదుపరి విచారణ శుక్రవారానికి న్యాయస్థానం వాయిదా వేసినట్లుగా తెలుస్తోంది. వాస్తవానికి ‘పుష్ప 2’ సంధ్య థియేటర్ ఘటన తర్వాత టికెట్ల ధర పెంచడం కానీ, బెనిఫిట్ షోలు ఉండవని సీఎం రేవంత్ రెడ్డి ఖరాఖండీగా చెప్పినా.. భారీ బడ్జెట్ సినిమా కావడంతో పాటు, FDC ఛైర్మన్ వినతి మేరకు టికెట్ల ధరలను పెంచుకునే వెసులుబాటుని ప్రభుత్వం కల్పించింది.
‘గేమ్ చేంజర్’ నిమిత్తం తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన జీవోలో ఏముందంటే.. ‘గేమ్ చేంజర్’ సినిమాకు జనవరి 10వ తేదీ ఒక్కరోజు ఉదయం 4 గంటల నుంచి 6 షోలకు అనుమతిని ఇచ్చిన ప్రభుత్వం, జనవరి 11 నుంచి జనవరి 19వ తేదీ వరకు 9 రోజుల పాటు 5 షోలకు అనుమతి ఇచ్చింది. జనవరి 10 తేదీన నిర్వహించే 6 షోలకు టికెట్ల ధరలను పెంచుకునే వెసులుబాటును కల్పించింది. ఆ ఒక్క రోజు మల్టీప్టెక్స్ థియేటర్లలో రూ. 150, సింగిల్ స్ర్కీన్ థియేటర్లలో రూ. 100 పెంచుకునేందుకు అనుమతి జారీ చేసింది. జనవరి 11 నుండి జనవరి 19 వరకు 9 రోజుల పాటు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ. 50, మల్టీఫ్లెక్స్ థియేటర్లలో రూ. 100 రూపాయలు పెంచుకునేలా వెసులు బాటుని కల్పించిన ప్రభుత్వం.. ఎటువంటి బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వలేదు. ఈ సినిమా ప్రదర్శితమయ్యే థియేటర్లలో నార్కోటిక్, డ్రగ్స్ మరియు సైబర్ క్రైమ్ వంటి వాటిపై అవగాహన కల్పించే ప్రయత్నాలు చేయాలని ఆర్డర్స్ జారీ చేసింది.