Kiran Abbavaram: ‘కె.ర్యాంప్‌’ థియేట‌ర్‌లో ఒక్కొక్కడికి బుర్రపాడు.. గుడ్డలు జారుడే

ABN , Publish Date - Oct 17 , 2025 | 07:34 AM

ఈ దీపావళి పండుగ ‘కె.ర్యాంప్‌’(K-Ramp) తో మరింత సరదాగా ఉంటుంది. ఇకపై నా అభిమానులు గర్వపడేలా సినిమాలు చేస్తా’ అని హీరో కిరణ్‌ అబ్బవరం అన్నారు.

Kiran Abbavaram

‘ఈ సినిమా చేయాలని అనుకున్నప్పుడే దీపావళికి విడుదల చేయాలని నిర్ణయించుకున్నాం. ఖచ్చితంగా కుటుంబ సభ్యులందరూ కలసి చూసే చిత్రం అవుతుందని నమ్మాం. మేము అనుకున్న దానికంటే సినిమా బాగా వచ్చింది. నన్నూ, మా చిత్ర బృందాన్ని నమ్మండి. ఈ దీపావళి పండుగ ‘కె.ర్యాంప్‌’(K-Ramp) తో మరింత సరదాగా ఉంటుంది. ఇకపై నా అభిమానులు గర్వపడేలా సినిమాలు చేస్తా’ అని హీరో కిరణ్‌ అబ్బవరం (Kiran Abbavaram) అన్నారు.

ఆయన హీరోగా జైన్స్‌ నాని తెరకెక్కించిన చిత్రమిది. యుక్తి తరేజా (Yukti Thareja) కథానాయిక. హాస్య మూవీస్‌, రుద్రాంశ్‌ సెల్యులాయిడ్‌ బేనర్లపై రాజేశ్‌ దండా, శివ బొమ్మక్‌ నిర్మించారు. ఈ నెల 18న విడుదలవుతోన్న సందర్భంగా గురువారం చిత్రబృందం ప్రీ రిలీజ్‌ వేడుకను నిర్వహించింది. ఈ సంద‌ర్భంగా ఇంకా ఆయ‌న మాట్లాడుతూ.. మాపై న‌మ్మ‌కంతో రండి క‌డుపుబ్బా న‌వ్వించి తీరుతాం అని థియేట‌ర్‌లో ఒక్కొక్కడికి బుర్రపాడు.. గుడ్డలు జారుడే అనేలా సినిమా ఉంటుంద‌న్నారు. టికెట్ డ‌బ్బులు వేస్ట్ అయ్యాయ‌నే మాట రానివ్వ‌మ‌ని అన్నారు.

జైన్స్‌ నాని మాట్లాడుతూ ‘సినిమా క్లైమాక్స్‌లో ఒక చిన్న ట్విస్ట్‌ ఉంటుంది. మంచి సందేశం కూడా ఉంటుంది. అన్ని వాణిజ్య హంగులతో తెరకెక్కించాం. కిరణ్‌ అబ్బవరం పాత్రచిత్రణ సరికొత్తగా ఉంటుంది. ఇంతకు ముందెన్నడూ చేయని పాత్రను ఈ చిత్రంలో పోషించారు. ప్రచార చిత్రాలతోనే ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడ్డాయి. సినిమా కూడా అదే స్థాయిలో ఉంటుంది’ అని చెప్పారు.

రాజేశ్‌ దండా మాట్లాడుతూ ‘ఈ సినిమాను 47 రోజుల్లో పూర్తి చేశాం. కేరళలో ఆహ్లాదకరమైన వాతావరణంలో చిత్రీకరణ చేశాం. సెట్‌లో ప్రతి రోజూ నవ్వుకున్నాం. సెట్‌లో నవ్వించిన ఏ సినిమా కూడా సక్సెస్‌ విషయంలో గురి తప్పలేదు. ‘కె- ర్యాంప్‌’ కూడా మంచి విజయాన్ని అందుకుంటుంది’ అని ఆకాంక్షించారు.

సీనియర్‌ నటుడు వీకే నరేశ్‌ మాట్లాడుతూ ‘ఈ సినిమా చూసిన తర్వాత అందరూ మహేశ్‌ బాబు, అల్లు అర్జున్‌, నాని తర్వాత కిరణ్‌ పేరే చెబుతారు. చేతన్‌ భరద్వాజ్‌ మంచి సంగీతం అందించారు. భవిష్యత్తులో జైన్స్‌ నాని పెద్ద దర్శకుడు అవుతాడు’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకులు విజయ్‌ కనకమేడల, వీఐ ఆనంద్‌, రామ్‌ అబ్బరాజు, సుబ్బు, నటుడు సాయికుమార్‌, హీరోయిన్లు విమలా రామన్‌, కామ్నా జెఠ్మలానీ, సంగీత దర్శకుడు చేతన్‌ భరద్వాజ్‌ పాల్గొన్నారు.

Updated Date - Oct 17 , 2025 | 07:47 AM