Actress Lakshmi: తనలో నటిని తృప్తి పరుచుకునే పాత్రలంటే ప్రత్యేక శ్రద్ధ
ABN , Publish Date - Dec 13 , 2025 | 12:35 PM
సీనియర్ నటి లక్ష్మి పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆమెకు దక్షిణాది నటీనటులు శుభాకాంక్షలు చెబుతున్నారు.
సీనియర్ నటి లక్ష్మి పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆమెకు దక్షిణాది నటీనటులు శుభాకాంక్షలు చెబుతున్నారు. లక్ష్మీ సినిమా రంగానికి చెందిన వై.వి.రావు, వై.రుక్మిణిల పుత్రిక. తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో 1952, డిసెంబరు 13న మద్రాసులో జన్మించారు. ఆమె అసలు పేరు వెంకట మహాలక్ష్మి ఎర్రగుడిపాటి. 16 ఏళ్ల వయసులోనే వెండితెరకు పరిచయమయ్యారు. ఈమె తొలి సినిమా 1968 లో విడుదలైన తమిళ సినిమా ‘జీవనాంశమ్’. 1970వ దశకంలో తారగా వెలుగొందిన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలతో పాటు హిందీ చిత్రాల్లో నటించి మెప్పించారు. 1975లో విజయవంతమైన హిందీ చిత్రం జూలీలో ప్రధాన, పాత్ర పోషించిన నటిగా పేరొందారు. ఆ సినిమాలో తన నటనకు ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ నటి అవార్డు అందుకున్నది. మలయాళంలో విజయవంతమైన చట్టకారి (1974) చిత్రాన్ని హిందీలో జూలీ (1975) అనే పేరుతో, తెలుగులో ‘మిస్ జూలీ ప్రేమకథ’ (1975)గా రీమేక్ చేశారు. జూలీ చిత్రానికి ఫిల్మ్‌ఫేర్ అవార్డుతో పాటు బెంగాళీ సినీ పాత్రికేయ సంఘం యొక్క ‘సంవత్సరపు ఉత్కృష్ట నటన’ పురస్కారాన్ని అందుకున్నది. దక్షిణాది చిత్రాలపైనే దృష్టిపెట్టింది. 1977లో విడుదలైన తమిళ సినిమా ‘శిలా నేరంగలిల్ శిలా మణితారగళ్’లో నటనకు జాతీయ ఉత్తమనటి పురస్కారాన్ని అందుకున్నారు. ఆ పురస్కారం అందుకున్న దక్షిణాదికి చెందిన తొలి నటి అయ్యింది లక్ష్మీ. ఎన్నో చిత్రాల్లో ఉత్తమ నటన కనబరచి ఎన్నో అవార్డులు అందుకున్నారు. ప్రస్తుతం సినిమాలే కాకుండా పాత్రకు ప్రాధాన్యం ఉన్న వెబ్ సిరీస్‌లలోనూ ఆమె నటిస్తున్నారు.
లక్ష్మీ మార్క్ పాత్రలు...
తనలో నటిని తృప్తి పరుచుకునే పాత్రల పట్ల నటి లక్ష్మికి ప్రత్యేక శ్రద్థ. అటువంటి సినిమాలకి ఆమె తన పారితోషికం కూడా తగ్గించుకుంటున్న ఆమే కొన్ని ఇంటర్వ్యూలో చెప్పారు. 1973లో ఆమె కథానాయికగా నటించిన తమిళ చిత్రం ‘దిక్కట్ర పార్వతి’. ఈ చిత్రానికి సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు. పేదల జీవితాలను మద్యపాన వ్యసనం ఎలా చిన్నాభిన్నం చేస్తుందన్న ఇతివృత్తంతో ఓ కథ రాశారు ప్రసిద్ద రాజకీయవేత్త. జాతీయ నాయకుడు రచయిత ‘రాజాజీ’గా అందరికీ తెలిసిన చక్రవర్తి రాజగోపాలాచారి. తమిళంలో రాసిన ఆ ‘దిక్కట్ర ్క్ష?ర్వతి (దిక్కులేని పార్వతి)’ కథను చదివిన సింగీతం శ్రీనివాసరావు, ఆ కథను సినిమాగా తీస్తే ప్రజలకు కనువిప్పు గా ఉంటుందని భావించారు. సినిమాలంటే ఇష్టపడని రాజాజీని కలిసి, కన్విన్స్ చేసి ఒప్పించారట సింగీతం. అది ఒక మంచి సినిమా అవుతుందనే నమ్మకం తో కథకు సినిమా హక్కులు ఉచితంగా ఇవ్వడానికి కూడా రాజాజీ ముందు కొచ్చారంటే, సింగీతం ఆయనని ఎలా ఇంప్రెస్ చేశారో అర్థం చేసుకోవచ్చు. నామ మాత్రంగా కేవలం ఒక్క రూపాయి తీసుకొని హక్కులు రాసి ఇచ్చారట రాజాజీ. బ్లాక్ అండ్ వైట్‌లో నూరు నిమిషాల వ్యవధి గల ఈ చిత్రాన్ని ఎం.లక్ష్మీకాంత్ రెడ్డి, హెచ్.వి. సంజీవ రెడ్డి నిర్మించారు. ప్రఖ్యాత వీణ విద్వాన్ చిట్టిబాబు సంగీతాన్ని, ప్రముఖ ఛాయ గ్రహకుడు రవి వర్మ కెమెరా పని పట్టుకున్నారు. ఈ చిత్రానికి 1973లో ఉత్తమ తమిళ చిత్రంగా రాష్ట్రపతి రజత పథకం లభించింది. నెగెటివ్ హక్కుల్ని తమిళనాడు ప్రభుత్వమే కొని, చిత్రాన్ని వాడవాడలా ప్రదర్శించడానికి ఏర్పాటు చేయడం విశేషంగా చెప్పుకుంటారు. అందులో కథానాయిక పార్వతిగా లక్ష్మి అసాధారణ నటనని ప్రదర్శించింది. మనిషిని మరణ భయం ఎందుకు వెన్నాడుతోంది? దాన్నెలా అధిగమించాలి? అనే లోతైన ఆధ్యాత్మికాంశాన్ని తాండవాల రూపంలో ‘సింబాలిక్’ గా చెబుతూ ఓ కథను రూపొందించారు దర్శక నిర్మాత డా. ఎ. రఘురామిరెడ్డి. 1987లో ‘ఆనందతాండవం’ పేరుతో వెలువడిన ఈ విభిన్న తరమా చిత్రంలో లక్ష్మి డాక్టర్ పాత్రను పోషించారు. మోహన్ శర్మ, సత్యనారాయణ, జె.వి.సోమయాజులు, దీప ముఖ్య పాత్రలు పోషించారు. ఈ తరహా చిత్రాలలో నటించడం వల్ల ఆర్టిస్టులుగా మాకు మేథోమథనం జరిగి, మంచి ఆత్మ సంతృప్తి కలుగుతుంది. అందుకే అటువంటి చిత్రాలలో నటించే అవకాశాలు వచ్చినప్పుడు వదులుకోను అని లక్ష్మీ పలు ఇంటర్వ్యూలో చెప్పారు. కన్నడ, తమిళ ప్రేక్షకులకు దర్శకురాలిగా కూడా పరిచయమయ్యారు లక్ష్మి. హాస్య ప్రధానమైన చిత్రం ‘మక్కళసైన్య’గా కన్నడం, అదే చిత్రాన్ని ‘మళలై పట్టాళ’ తమిళంలోనూ దర్శకత్వం వహించారు. ఆ చిత్రం తెలుగులో మురళీమోహన్ సరిత ప్రధాన పాత్రలతో ‘రామదండు’గా వచ్చింది.
లక్ష్మి వ్యక్తిగత జీవితం అనేక వివాదాలమయం. ముక్కుసూటితనం, ధీరగుణం ఉన్న ఏ స్ర్తీ జీవితంలో అయినా సవాళ్లు, ఎదురుదెబ్బలు సహజమే. స్ర్తీ తన స్వేచ్ఛ కోసం, సమానమైన హక్కుల కోసం తపనపడే ఆమె జీవితాన్ని సుడిగుండంలో నెట్టడానికి ప్రపంచమంతా చూస్తుంది. ఆ సుడిగుండాన్ని ఎదురీది గెలిచి నిలిచే లక్ష్మి వంటి వారు చాలా అరుదు. ఆమె తన వ్యక్తిగత విషయాలను మీడియాతో పంచుకోవడానికి ఇష్టపడరు. కానీ, ఆమె పాల్గొనే టీవి టాక్ షోల వల్ల, ఆ షోలలో ఏ విషయాన్ని అయినా కుండబద్దలు కొట్టినట్లుగా మాట్లాడే ఆమె తీరు వల్ల ఆమె జీవితంలో ఆటుపోట్లు, ఆమె ఆలోచనలు బైటకి తెలుస్తుంటాయి. వృత్తి ప్రవృత్తులలో కూడా కథానాయిక అయిన ఆమె గురించి అందుకే అభిమానుల మనసులు పలవరిస్తుంటాయి.