Kingdom:‘కింగ్డమ్’.. థియేటర్లకు రక్షణ కల్పించండి! హైకోర్టులో పిటిషన్
ABN , Publish Date - Aug 07 , 2025 | 07:51 PM
‘కింగ్డమ్’ చిత్రం ప్రదర్శించే థియేటర్లకు భద్రత కల్పించాలని డిస్ట్రిబ్యూషన్ కంపెనీ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేసింది.
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), భాగ్యశ్రీ బోర్సే (Bhagyasri Borse) కాంబినేషన్‌లో గౌతమ్ తిన్ననూరి (Goutham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘కింగ్డమ్’ (Kingdom) చిత్రం ప్రదర్శించే థియేటర్లకు భద్రత కల్పించాలని డిస్ట్రిబ్యూషన్ కంపెనీ మద్రాస్ హైకోర్టు (Madras High Court)లో పిటిషన్ వేసింది. ఈ చిత్రంలో అనేక సన్నివేశాలు శ్రీలంక ఈలం తమిళుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయంటూ నామ్ తమిళర్ కట్చి (Naam Tamilar Katchi) కార్యకర్తలు ఈ చిత్రం ప్రదర్శించే థియేటర్ల వద్ద ఆందోళన చేస్తున్నారు. అలాగే, ఈ చిత్ర ప్రదర్శన నిలిపివేయాలని ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగో కూడా డిమాండ్ చేశారు. దీంతో రామనాథపురం ప్రాంతాల్లో ఈ సినిమా ప్రదర్శించే థియేటర్ల వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఈ నేపథ్యంలో ఈ సినిమాను తమిళంలో పంపిణీ చేసిన ఎస్ఎస్ఐ ప్రొడక్షన్స్ బుధవారం మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి, ‘కింగ్డమ్’ చిత్రం ప్రదర్శించే థియేటర్లకు పోలీస్ భద్రత కల్పించాలని కోరింది. ఈ పిటిషన్ న్యాయమూర్తి టి.భరత్ చక్రవర్తి ముందు విచారణకు రాగా, పోలీ్‌సలు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించారు. సెన్సార్ పూర్తయి విడుదలైన చిత్ర ప్రదర్శన అడ్డుకునే హక్కు లేదనీ, చిత్రంలోని సన్నివేశాలు మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉంటే ప్రజాస్వామ్య పద్దతిలో తమ నిరసనలు తెలుపుతూ ఆ చిత్రానికి వ్యతిరేకంగా ప్రచారం చేసుకోవచ్చని న్యాయమూర్తి అభిప్రాయ పడ్డారు.