Ghantasala Biopic: సంగీత దిగ్గజం బయోపిక్... మరోసారి వాయిదా
ABN , Publish Date - Dec 12 , 2025 | 12:24 PM
ఘంటసాల వెంకటేశ్వరరావు బయోపిక్ 'ఘంటసాల ది గ్రేట్' మరోసారి వాయిదా పడింది. జనవరి 2న ఈ సినిమా విడుదల చేయబోతున్నామని మేకర్స్ తెలిపారు.
తెలుగు సినిమా తొలితరం నేపథ్య గాయకులలో ఒకరైన ఘంటసాల వెంకటేశ్వరరావు (Ghantasala Venkateswara Rao) బయోపిక్ కు ఇంకా కష్టాలు తీరలేదు. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకుని, తొలికాపీని సిద్థం చేసుకుందీ సినిమా. పలు మార్లు ఈ సినిమాను పలువురు సినీ, రాజకీయ ప్రముఖులకు స్పెషల్ షోస్ ను వేశారు. చూసిన వారంతా బాగుందని అన్నారు. అయితే విడుదల విషయంలో అడుగు ముందుకు పడటం లేదు. నిజానికి ఈ యేడాది ఫిబ్రవరిలోనే 'ఘంటసాల ది గ్రేట్' మూవీని ఒక్కో జిల్లాలో రెండు రోజుల చొప్పున విడుదల చేసి ప్రదర్శించాలని మేకర్స్ భావించారు. కానీ ఆ ఆలోచన కార్యరూపం దాల్చలేదు. దాంతో డిసెంబర్ 12న థియేటర్ లలో దీనిని విడుదల చేయడానికి ప్రముఖ పంపిణీ దారులైన శోభారాణి ముందుకొచ్చారు. అంతా ఈసారి 'ఘంటసాల ది గ్రేట్' విడుదల అవుతుందని భావించారు. నిజానికి 'అఖండ 2' (Akhanda 2) సినిమా కారణంగా డిసెంబర్ 12న విడుదల కావాల్సిన చాలా సినిమాలు వేరే డేట్స్ కు వెళ్ళిపోయాయి. అయితే... తమ సినిమా అనివార్య కారణాల వల్ల డిసెంబర్ 12న రావడం లేదని, జనవరి 2న దీనిని విడుదల చేస్తున్నామని మేకర్స్ తెలిపారు.
సిహెచ్ రామారావు స్వీయ దర్శకత్వంలో నిర్మించిన 'ఘంటసాల ది గ్రేట్' లో టైటిల్ రోల్ ను ప్రముఖ గాయకుడు కృష్ణ చైతన్య (Krishna Chaitanya) పోషించాడు. ఘంటసాల భార్య సావిత్రమ్మ పాత్రను కృష్ణ చైతన్య శ్రీమతి మృదుల (Mrudula) పోషించారు. చిన్నప్పటి ఘంటసాలగా 'తులసీ' ఫేమ్ అతులిత నటించారు. ఇతర ప్రధాన పాత్రలను సుమన్, సుబ్బరాయు శర్మ, జె. కె. భారవి, సుమన్ శెట్టి, అనంత్, సాయి కిరణ్, అశోక్ కుమార్, గుండు సుదర్శన్, జయవాణీ తదితరులు పోషించారు. ఈ సినిమాకు సాలూరి వాసురావు స్వర రచన చేశారు.