Gemini Suresh: 18 ఏళ్ళ కల.. హీరోగా జెమిని సురేష్
ABN , Publish Date - Aug 21 , 2025 | 03:43 PM
జెమిని సురేష్(Gemini Suresh), అఖిల నాయర్ జంటగా 'ఆత్మ కథ' చిత్రం గురువారం హైదరాబాద్లో మొదలైంది.
జెమిని సురేష్(Gemini Suresh), అఖిల నాయర్ (Akhila Nair) జంటగా 'ఆత్మ కథ' (Athma katha) చిత్రం గురువారం హైదరాబాద్లో మొదలైంది. వారాహి ఎంటర్టైన్మెంట్ ప్రైవేటు లిమిటెడ్ బ్యానర్ పై శ్రీనివాస్ గుండ్రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. సోమేశ్వరరావు నిర్మాత. పూజా కార్యక్రమాల అనంతరం నిర్మాతల మండలి సెక్రటరీ ప్రసన్న కుమార్, జెమిని కిరణ్ స్క్రిప్ట్ ను దర్శకుడిని అందించారు. జెమిని సురేష్ తల్లి సుబ్బలక్ష్మి క్లాప్ కొట్టారు. జెమిని సురేష్ మాట్లాడుతూ 'హీరోగా ఇది నా తొలి చిత్రం. నా 18 సంవత్సరాల కల నెరవేరబోతోంది. ఒక మంచి కథతో ప్రేక్షకులు ముందుకు రావాలి అని అనుకున్నాను. ఒక మంచి కథతో నాకు శ్రీనివాస్ గారు ఆత్మకథ చిత్రంతో అవకాశం ఇచ్చారు. ఈ సినిమా పూజ కార్యక్రమానికి నాకు దేవుడు ఇలాంటి వ్యక్తి జెమిని కిరణ్ గారు వచ్చి ఆశీర్వదించినందుకు ఎంతో సంతోషంగా ఉంది. నా తొలి చిత్రానికి మా అమ్మ చేతిలో మీదగా క్లాప్ కొట్టడం అనేది మరింత సంతోషకరం' అన్నారు.
దర్శకులు శ్రీనివాస్ గుండ్రెడ్డి మాట్లాడుతూ 'నేను ఇప్పటికే ఒక హిందీ సినిమాకు, నాలుగు కన్నడ చిత్రాలకి అలాగే ఒక తెలుగు చిత్రానికి దర్శకత్వం వహించాను. కథని హీరోగా అనుకుని ఆత్మకథ అనే చిత్రాన్ని రచించాను. ఈ సినిమాకి జెమిని సురేష్, సమ్మటి గాంధీ రెండు స్తంభాలు వంటి వారు. నన్ను నమ్మి ముందుకు వచ్చిన ప్రొడ్యూసర్ గారికి నా ధన్యవాదాలు అనుకుంటున్నాను' అన్నారు.