Dil Raju: దిల్‌ రాజు బాధలో ఉంటే.. ఏడేళ్ల మనవడు ఏమన్నాడో తెలుసా..

ABN , Publish Date - Jan 06 , 2025 | 11:58 AM

సంక్రాంతి సినిమాలకు సంబంధించి టికెట్‌ ధరలు పెంచి, బెనిఫిట్‌ షోలకు వెసులుబాటు కల్పించిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి నిర్మాత దిల్‌ రాజు ధన్యవాదాలు చెప్పారు.

సంక్రాంతి సినిమాలకు సంబంధించి టికెట్‌ ధరలు (Ticket Reates Hike) పెంచి, బెనిఫిట్‌ షోలకు వెసులుబాటు కల్పించిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి నిర్మాత దిల్‌ రాజు ధన్యవాదాలు చెప్పారు. సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ "రాజమహేంద్రవరం లో జరిగిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను సక్సెస్‌ చేసిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు. చెప్పారు. ‘‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer) ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ గ్రాండ్‌గా జరగడానికి ప్రధాన కారణం ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌. మేము అడగగానే ఆయన ముఖ్య అతిథిగా ఈవెంట్‌కు హాజరయ్యారు. నా జీవితంలో గొప్ప ఈవెంట్‌ అది. మెగా అభిమానులు, జనసేన కార్యకర్తలు అందరూ ముందు నిలబడి అద్భుతంగా కార్యక్రమం చేశారు. సంక్రాంతి సినిమాలకు సంబంధించి టికెట్‌ ధరల పెంపు, బెనిఫిట్‌ షోలకు ఏపీలో వెసులుబాటు కల్పించినందుకు సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ (Pawan kalyan) , సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేశ్‌కు ధన్యవాదాలు. తెలుగు చిత్రాలకు అన్ని ప్రాంతాల్లో క్రేజ్‌, రేంజ్‌ పెరుగుతోంది. పాన్‌ ఇండియా రిలీజ్‌ కాబట్టి ఎంతో ఒత్తిడితో పనిచేస్తున్నా. రెండు, మూడు రోజుల్లో పనులే పూర్తి చేసి కంటెంట్‌ను అన్ని ప్రాంతాలకు పంపించాలి. ఇదొక ప్రత్యేకమైన చిత్రం. 2021 ఆగస్టులో మొదలైంది. దాదాపు మూడున్నరేళ్ల ప్రయాణం. తప్పనిసరిగా హిట్‌ కొడతాం. (Ram charan)

నన్ను నేను విశ్లేషించుకున్నా
‘వకీల్‌ సాబ్‌’ చిత్రాన్ని 2020 మేలో విడుదల చేయాలని భావించా. కానీ లాక్‌డైన్‌ కారణంగా 2021 మేలో విడుదల చేశాం. చాలా సంవత్సరాల గ్యాప్‌ తర్వాత పవన్‌ కల్యాణ్‌ నటిస్తోన్న చిత్రం. ఆయనకు నేను వీరాభిమానిని కావడం. ఇలా ఎంతో స్పెషల్‌గా ఆ సినిమాను రూపొందించాం. బ్లాక్‌బస్టర్‌ అవుతుందని భావించా. తీరా చూస్తే సినిమా విడుదలైన నాలుగు రోజులకే మళ్లీ కొవిడ్‌ వచ్చింది. థియేటర్లు మూసేశారు. ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయాననే బాధతో సినిమా విడుదలైన వారానికే యూఎస్‌ వెళ్లిపోయా. ఆ తర్వాత ‘వారిసు’ తీశా. తమిళంలో తీయడం వల్ల అది తమిళ చిత్రమైంది. ఇక్కడ అనుకున్నంత ఆదరణ దక్కలేదు. ఆ రాష్ట్రంలో మంచిగా లాభాలు పొందా. ‘బలగం’ తీశా. ఎన్నో ప్రశంసలు అందుకున్నా. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా చేయడం వల ఇక్కడ వంద మార్కులు వస్తే మిగిలిన చోట్ల 70 మార్కులే పడ్డాయి. యూనివర్సల్‌గా విజయం అందుకోలేకపోయా. అలా మూడున్నరేళ్ల ప్రయాణంలో నన్ను నేను విశ్లేషించుకున్నా. అదే సమయంలో ‘ఫ్యామిలీస్టార్‌’ విడుదలైంది. ఇది కూడా ఓ మాదిరిగా ఆడింది. నా ఏడేళ్ల మనవడు ఫోన్‌ చేసి.. ‘‘తాత.. నువ్వు బాధలో ఉన్నావని తెలుసు. నీ చేతిలో గేమ్‌ ఛేంజర్‌ ఉంది. తప్పకుండా హిట్‌ కొడతావు’’ అన్నాడు. వాడి మాటలు నన్ను భావోద్వేగానికి గురి చేశాయి. చుట్టుపక్కల వాళ్లు కూడా నా గురించి అలాగే మాట్లాడుకోవడం నా వరకూ వచ్చింది. సినిమాల విషయంలో నా జడ్జిమెంట్‌ పోయిందని చాలామంది అనుకున్నారు. వాళ్ల మాటలకు ఎంతో భయపడ్డా’’ అని దిల్‌ రాజు అన్నారు.

తెలంగాణలో టికెట్‌ రేట్లు..:

పరిశ్రమకు ఎప్పుడూ సపోర్టుగా  ఉంటానని తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి మాకు చెప్పారు. కానీ  అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండమని సూచించారు. ఫార్మా, ఐటీ, సినిమా తెలంగాణ రాష్ట్రానికి ఎంతో ముఖ్యమని ఇటీవల జరిగిన మీటింగ్లో  అన్నారు. ఒక నిర్మాతగా త్వరలోనే ఆయన్ని కలిసి టికెట్‌ రేట్ల గురించి మాట్లాడతాను. తుది నిర్ణయం ప్రభుత్వానిదే. ఎలాంటి సమాధానం వచ్చినా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను.

Updated Date - Jan 06 , 2025 | 12:28 PM