Gaddar Film Awards: ఉత్తమ చిత్రానికి రూ. 10 లక్షలు
ABN , Publish Date - Jun 14 , 2025 | 05:55 AM
గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవానికి హైదరాబాద్లోని హైటెక్స్ వేదిక సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. శనివారం సాయంత్రం అంగరంగ వైభవంగా ఈ వేడుకను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్దమైంది.
ప్రత్యేక అవార్డుకు రూ. 10 లక్షల నగదు బహుమతి
ఉత్తమ ద్వితీయ, తృతీయ చిత్రాలకు రూ. 7, 5 లక్షలు
ఉత్తమ నటుడికి, ఉత్తమ నటికి చెరో రూ. 5 లక్షలు
నేడు గద్దర్ ఫిల్మ్ అవార్డుల వేడుక
గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవానికి హైదరాబాద్లోని హైటెక్స్ వేదిక సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. శనివారం సాయంత్రం అంగరంగ వైభవంగా ఈ వేడుకను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్దమైంది. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఈ అవార్డుల విజేతలకు అందజేసే నగదు బహుమతిని భారీగా పెంచింది. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు సహా పలువురు చిత్ర ప్రముఖులు పాల్గొననున్నారు. కాగా, గద్దర్ ఫిల్మ్ అవార్డుల జాబితాను ఇటీవలె ప్రకటించారు. 2014 నుంచి 2023 వరకు ప్రతి ఉత్తమ చిత్రానికి హీరో, హీరోయిన్, దర్శకుడు, నిర్మాతలకు కలిపి నాలుగు అవార్డులను ప్రదానం చేస్తారు. ఇలా ప్రతి ఏడాదికి మూడు ఉత్తమ చిత్రాలకు అందజేస్తారు. 2024వ సంవత్సరానికి ప్రకటించిన అన్ని అవార్డులను కూడా బహూకరిస్తారు. వీటితోపాటు 2024వ సంవత్సరం నుంచి రఘుపతి వెంకయ్య, బీఎన్ రెడ్డి, ఎన్టీఆర్, పైడి జైరాజ్, కాంతారావు, చక్రపాణి పేర్లతో ప్రత్యేక అవార్డులను కూడా రాష్ట్ర ప్రభుత్వం అందజేయనుంది. ఈ ఆరు ప్రత్యేక అవార్డుల్లో ఒక్కో అవార్డుకు రూ.పది లక్షల చొప్పున, మూడు ఉత్తమ చిత్రాలకు వరుసగా రూ. 10, 7, 5 లక్షల చొప్పున అందజేయనుంది. అదేవిధంగా ఉత్తమ నటుడు, ఉత్తమ నటికి రూ.5 లక్షల చొప్పున అందజేయనున్నారు. 14 సంవత్సరాల విరామం తర్వాత సినిమా నటీనటులను, సాంకేతిక నిపుణుల ప్రతిభను ప్రోత్సహించే సంప్రదాయానికి తెలంగాణ ప్రభుత్వం తిరిగి శ్రీకారం చుట్టడం పట్ల అవార్డుల గ్రహీతలు, సినిమా అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, విజేతలకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. తెలంగాణ కళారంగంలో వేగుచుక్కలాంటి గద్దర్ పేరిట వివిధ విభాగాల్లో సినిమా కళాకారులకు అవార్డులు అందించడం గర్వకారణమని ఆయన పేర్కొన్నారు.