Fish Venkat: ఆర్టిస్ట్‌ పోతే కనీస స్పందన లేదు.. ఇదేనా పరిశ్రమ కట్టడి

ABN , Publish Date - Jul 20 , 2025 | 04:38 PM

కిడ్నీ ఫెయిల్యూర్‌ సమస్యతో కొంతకాలంగా బాధ పడుతున్న ఫిష్‌ వెంకట్‌ను సినీ ఇండస్ట్రీ సరిగ్గా పట్టించుకోలేదని విమర్శలు వినిపిస్తున్నాయి.


టాలీవుడ్‌లో ఎన్నో చిత్రాల్లో కమెడియన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా నటించి, నవ్వించిన నటుడు ఫిష్‌ వెంకట్‌ (Fish Venkat). కొంతకాలంగా మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్న ఆయన శుక్రవారం రాత్రి కన్నుమూశారు. శనివారం మారేడుపల్లిలోని హిందూ స్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. వెంకట్‌ కడసారి చూపుకోసం పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు తరలి వచ్చారు.

అయితే కిడ్నీ ఫెయిల్యూర్‌ సమస్యతో కొంతకాలంగా బాధ పడుతున్న ఫిష్‌ వెంకట్‌ను సినీ ఇండస్ట్రీ సరిగ్గా పట్టించుకోలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్‌ నటించిన ఆది చిత్రంలో ‘తొడకొట్టు చిన్నా దద్దరిల్లిపోవాలా’ అనే డైలాగ్‌తో పాపులర్‌ అయ్యి అక్కడి నుంచి వరుసగా వందకు పైగా చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకున్న నటుడు మరణిస్తే కనీసం నివాళి కూడా అర్పించలేదని నెటిజన్లు ఫైర్‌ అవుతున్నారు. విలన్‌ గ్యాంగ్‌లో కీలకంగా ఉంటూ ‘అన్నా.. అన్నా’ అంటూ తనదైన శైలి కామెడీతో అలరించిన వెంకట్‌ మరణవార్త తెలిసినా కనీసం సోషల్‌ మీడియా వేదికగా అయినా నివాళి అర్పించలేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. సుమారు వందకు పైగా సినిమాల్లో నటించిన చనిపోతే సినీ పెద్దలు, అతనితో పని చేసిన హీరోలు దర్శక నిర్మాతలు కనీసం స్పందించలేదని,. ఇదేనా ఇండస్ట్రీలో ఉన్న కట్టడి అని మండిపడుతున్నారు నెటిజన్లు.

అయితే కొందరు మాత్రం ఫిష్‌ వెంకట్‌ కుటుంబాన్ని పరామర్శించారు. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ట్విట్టర్‌ వేదికగా నివాళి తెలిపింది. విశ్వక్‌సేన్‌, మానినేని కృష్ణ వంటి హీరోలు వెంకట్‌ కుటుంబానికి ఆర్థిక సాయం అందించారు. ‘గబ్బర్‌ సింగ్‌’ గ్యాంగ్‌ కూడా వెంకట్‌ కుటుంబానికి అండగా నిలిచారు. దగ్గరుండి అంత్యక్రియలు నిర్వహించారు. రచ్చరవి, నటుడు కరాటే కళ్యాణి తదితరులు మాత్రమే ఫిష్‌ వెంకట్‌ చివరి చూపు కోసం వెళ్లారు. మంచు మనోజ్‌ తన టీమ్‌ను నటుడి కుటుంబ సభ్యుల దగ్గరకు పంపించారు. వీడియో కాల్‌ ద్వారా ఫిష్‌ వెంకట్‌ కుటుంబ సభ్యులను పరామర్శించారు.  

Updated Date - Jul 20 , 2025 | 04:40 PM