2025- First Half Review: సక్సెస్ రేటు... కేవలం 5 శాతం...

ABN , Publish Date - Jun 30 , 2025 | 06:43 PM

అప్పుడే ఆరు నెలలు గడచిపోయాయి... 2025లో తెలుగు సినిమా పట్టుమని పది హిట్స్ కూడా చూడలేకపోయింది... 2025 ఫస్టాఫ్ లో మన సినిమా ఏ తీరున సాగిందో చూద్దాం.

ఈ యేడాది మొదటి ఆరు నెలల్లో మొత్తం 155 సినిమాలు వెలుగు చూశాయి... వాటిలో 108 స్ట్రెయిట్ తెలుగు మూవీస్ కాగా, 47 డబ్బింగ్ సినిమాలు ఉన్నాయి... వీటిలో వంద కోట్లు చూసిన సినిమాలుగా "డాకూ మహారాజ్,(Daaku Maharaj ) గేమ్ చేంజర్,(Game Changer) సంక్రాంతికి వస్తున్నాం,(Sankranthiki Vasthunam ) తండేల్ (Thandel), హిట్ 3, (Hit3)కుబేర (Kubera)" నిలిచాయి..."కోర్టు (Court ), మ్యాడ్ స్క్వేర్ (Mad Square), సింగిల్ (Single)" చిత్రాలు మంచి ఆదరణ చూశాయి... అనువాదాల్లో 'తుడరుమ్' (Thudarum)పరవాలేదనిపించింది. జనవరి నెలలో 15 స్ట్రెయిట్ - 8 డబ్బింగ్ మూవీస్ వచ్చాయి... ఫిబ్రవరి లో 17 స్ట్రెయిట్ - ఆరు అనువాదాలు వెలుగు చూశాయి... మార్చిలో 24 తెలుగు సినిమాలతో పాటు, 7 డబ్బింగ్ పిక్చర్స్ , ఏప్రిల్ లో 25 స్ట్రెయిట్ మూవీస్ తో పాటు మూడు అనువాదాలు జనం ముందు నిలిచాయి... మే నెలలో 17 నేరుగా వచ్చిన చిత్రాలు, 12 డబ్బింగ్ సినిమాలు రాగా, జూన్ లో 10 స్ట్రెయిట్, 11 డబ్బింగ్ ప్రేక్షకులను పలకరించాయి... సక్సెస్ రేటు పరిశీలిస్తే ఐదు శాతమే కనిపిస్తోంది.


ఈ సారి వంద కోట్ల సినిమాలు కేవలం ఆరు మాత్రమే ఉన్నా వాటిలో 'గేమ్ చేంజర్' వంద కోట్లకు పైగా పోగేసినా, పరాజయం పాలయిందనే చెప్పాలి... ఇక పెట్టుబడి కంటే మిన్నగా సాధించిన చిత్రంగా 'సంక్రాంతికి వస్తున్నాం' నిలచింది... ఈ సినిమా కేవలం యాభై కోట్లతో రూపొందగా, బాక్సాఫీస్ వద్ద 300 కోట్లు కొల్లగొట్టింది... ఇదిలా ఉంటే ఈ యేడాది డైరెక్టుగా హండ్రెడ్ డేస్ చూసిన సినిమాలుగా 'డాకూ మహారాజ్' చిలకలూరి పేటలోనూ, 'సంక్రాంతికి వస్తున్నాం' నంద్యాలలోనూ శతదినోత్సవాలు జరుపుకున్నాయి... 'డాకూ మహారాజ్' కొన్ని ఏరియాల్లో లాభసాటిగా సాగలేదని నిర్మాతనే ప్రకటించారు... అయితే ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో ఏ తెలుగు సినిమా చూడని టీఆర్పీ చూడడం విశేషంగా మారింది... మరో విశేషమేంటంటే చిలకలూరి పేటలో 'డాకూ మహారాజ్' ఇప్పటికీ ప్రదర్శితమవుతోంది... మరి రన్నింగ్ పరంగా అన్నిటికన్నా మిన్నగా సాగుతున్న ఈ చిత్రాన్ని కొందరు హిట్ గా పరిగణించడం లేదు... అయితే ఈ సినిమా 150 కోట్లు సాధించిందని ట్రేడ్ సర్కిల్స్ లో కొందరు చెబుతున్నారు...

ఏ చిత్రసీమనైనా కాపాడేది చిన్న సినిమాలే అని గతంలో దాసరి నారాయణరావు వంటివారు చెబుతూ ఉండేవారు... ఈ యేడాది చిన్న సినిమాల్లో "కోర్టు, మ్యాడ్ స్క్వేర్, సింగిల్" మంచి వసూళ్ళే చూశాయి... ఈ సారి తండ్రీకొడుకులు నాగార్జున, నాగచైతన్య తమ కెరీర్ లో ఫస్ట్ హండ్రెడ్ క్రోర్స్ చూడడం విశేషం... నాన్న నాగ్ కంటే ముందుగానే నాగచైతన్య 'తండేల్'తో వందకోట్ల క్లబ్ లో చేరగా, ధనుష్ తో కలసి నాగ్ నటించిన 'కుబేర' కూడా నూరు కోట్లు పోగేసింది... ప్రభాస్ స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చిన మంచు విష్ణు 'కన్నప్ప' మూడు రోజులు పూర్తి చేసుకుంది... ఈ సినిమా ఏ మేరకు వసూళ్ళను సాధిస్తుందో తెలియాలంటే మరో నాలుగు రోజులు గడవాలి... ఏది ఏమైనా 2025 ప్రథమార్ధం కేవలం ఐదు శాతం సక్సెస్ రేటునే సొంతం చేసుకోవడం గమనార్హం! రాబోయే ఆరు నెలల్లోనైనా తెలుగు సినిమా సక్సెస్ రేటు పెరుగుతుందేమో చూద్దాం...

Updated Date - Jun 30 , 2025 | 06:44 PM