Dimple Hayathi: చిక్కుల్లో హీరోయిన్ డింపుల్ హయతీ.. ఫిలింనగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు!
ABN , Publish Date - Oct 01 , 2025 | 10:11 AM
టాలీవుడ్ హీరోయిన్ డింపుల్ హయతీపై ఫిలింనగర్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదైంది. పనిమనిషిపై దూషణలు, జీతం ఇవ్వకుండా బలవంతంగా పనులు చేయించినట్టు ఆరోపణలు.
టాలీవుడ్ హీరోయిన్ డింపుల్ హయతీ (Dimple Hayathi) మళ్లీ ఒక పెద్ద వివాదంలో చిక్కుకుంది. సినిమాల కంటే ఎక్కువగా సోషల్ మీడియాలో హాట్ ఫోటోషూట్స్ తో ఆకట్టుకునే డింపుల్ పేరు ఇప్పుడు ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసుతో హాట్ టాపిక్‌గా మారింది. పనిమనిషి ఇచ్చిన ఫిర్యాదు మేరకు, డింపుల్ తనపై తీవ్రంగా దూషించడమే కాకుండా దాడి కూడా చేసిందని ఆరోపణలు వచ్చాయి. నా చెప్పుల విలువ కాదు నీ బ్రతుకు అంటూ తక్కువ చేసి మాట్లాడిందని బాధితురాలు పోలీసులకు తెలిపింది. దీంతో డింపుల్ హయతీతో పాటు ఆమె భర్తపై కూడా క్రిమినల్ కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
కుక్కల సంరక్షణ కోసం పిలిపించి..
అయితే.. ఇక్కడే మరో కోణం బయటకు వచ్చింది. డింపుల్ భర్త ఒడిశా నుంచి ఇద్దరు యువతులను పెంపుడు కుక్కల సంరక్షణ కోసం పిలిపించుకున్నారనే సమాచారం ఉంది. కానీ వారికి ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా బలవంతంగా పనులు చేయించి, చివరికి ఇంటి నుండి బయటకు పంపేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాదు, వారిని తీవ్రంగా అవమానించారన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. “మీ ప్రాణం నా చెప్పులకు కూడా సరిపోదు.. మా దగ్గర లాయర్లు ఉన్నారు, మీ వల్ల ఏమీ చేయలేరు” అంటూ బెదిరించాడని ఆ యువతులు ఆరోపించారు. ఈ వీడియోలు బయటకు రావడంతో కేసు చుట్టూ మరింత సెన్సేషన్ క్రియేట్ అయ్యింది.
ఇదిలాఉంటే.. ఈ వివాదంలో మరో ఆసక్తికర అంశం ఏంటంటే వీడియోలో ఫిర్యాదు చేసిన మహిళ, డింపుల్ భర్త అని పలుమార్లు సంబోధించటం. అయితే ఇప్పటివరకు డింపుల్ పెళ్లి అయ్యిందనే విషయం చాలా మందికి తెలియదు. దీంతో ఆయన నిజంగానే భర్తనా? లేక మేనేజర్, లేక సిబ్బందిలో ఎవరైనా అన్న అనుమానాలు తెరపైకి వచ్చాయి.
గతంలో కూడా..
గతంలో కూడా డింపుల్ తన అపార్ట్‌మెంట్ పార్కింగ్ ఇష్యూలో డీసీపీ రాహుల్ హెగ్డేతో గొడవపడి కేసులు ఎదుర్కొంది. అలాగే హెల్త్ ఇష్యూల కారణంగా ఏడాదికిపైగా సినిమాల దూరమైంది. తిరిగి ఫుల్ ఫోకస్‌తో సినిమాల్లోకి రానుందనగా ఇలాంటి కేసులు రావడం, ఆమె కెరీర్, ఇమేజ్‌పై ప్రతికూల ప్రభావం చూపుతాయా అన్నది ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద చర్చగా మారింది.