Tollywood Movies: ఓరీనీ.. క్రిస్మస్ కి కూడా ఇన్ని సినిమాలా.. కష్టమే

ABN , Publish Date - Dec 17 , 2025 | 09:49 PM

ఈ సారి క్రిస్మస్ కు సినిమా సందడి భలేగా ఉంది. ఈ మధ్యకాలంలో క్రిస్మస్ కు ఇంత సందడి సాగడం ఇదే మొదటిసారి అనుకోవచ్చు.

Tollywood Movies

Tollywood Moviews: ఈ సారి క్రిస్మస్ కు సినిమా సందడి భలేగా ఉంది. ఈ మధ్యకాలంలో క్రిస్మస్ కు ఇంత సందడి సాగడం ఇదే మొదటిసారి అనుకోవచ్చు. డిసెంబర్ 25వ తేదీన ఎనిమిది చిత్రాలు ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతున్నాయి. వాస్తవానికి ఇందులో కొన్ని సినిమాలు డిసెంబర్ 12న రావలసి ఉంది... అయితే 'అఖండ-2 (Akhanda 2)' మూవీ అనుకున్న సమయానికి రిలీజ్ కాక డిసెంబర్ 12న విడుదలయింది. దాంతో కొన్ని సినిమాలు క్రిస్మస్ నే ఎంచుకున్నాయి. ఏవో 'మోగ్లీ (Mowgli)', 'డ్రైవ్' వంటి చిత్రాలు అనుకున్న సమయానికే వచ్చినా, మిగిలినవి డిసెంబర్ 19న, డిసెంబర్ 25న వస్తున్నాయి. ఇదిలా ఉంటే. శ్రీకాంత్ తనయుడు రోషన్ మేకా నటించిన 'ఛాంపియన్ (Champion)', ఆది సాయికుమార్ హీరోగా రూపొందిన 'శంబాల (Shambhala)', శివాజీ 'దండోరా (Dhandoraa)' సినిమాలు మొదటి నుండీ ఇదే డేట్ కు ఫిక్స్ అయ్యాయి. ఇప్పుడు వీటితో పాటు 'ఈషా, బ్యాడ్ గళ్స్' వస్తున్నాయి. అలానే డిసెంబర్ 26న 'వానర' రాబోతోంది. నటుడు నందు ఇటు 'దండోరా'లోనూ, అటు 'వానర'లోనూ కీలక పాత్రలు పోషించడం విశేషం.

స్ట్రెయిట్ తెలుగు మూవీస్ తో పాటు కొన్ని అనువాద చిత్రాలు సైతం క్రిస్మస్ కు రిలీజ్ అవుతున్నాయి. వాటిలో కార్తి హీరోగా రూపొందిన 'అన్నగారు వస్తారు' ఒకరోజు ముందే డిసెంబర్ 24న వస్తుందని అంటున్నారు. అలానే కన్నడ హీరో కిచ్చా సుదీప్ నటించిన 'మార్క్', మోహన్ లాల్ కథానాయకునిగా రూపొందిన 'వృషభ' 25న వస్తున్నాయి. ఈ అనువాద చిత్రాల్లో మోహన్ లాల్ 'వృషభ'ను తెలుగునాట గీతా ఆర్ట్స్ సంస్థ రిలీజ్ చేస్తోంది. అందువల్ల 'వృషభ'కు మంచి క్రేజ్ లభిస్తోంది. ఇక కార్తి 'అన్నగారు వస్తారు' కూడా ఆసక్తి కలిగిస్తోంది.

ఇన్ని చిత్రాలు ఒకటే రోజు వస్తోంటే - థియేటర్స్ సమస్య తలెత్తుతుందని అంటున్నారు. అయితే జనాన్ని అలరించే అంశాలున్న చిత్రాలకు విజయం లభిస్తుందనీ చెబుతున్నారు. హారర్ మూవీ 'ఈషా'కు మంచి బజ్ ఉంది... అలాగే సాయికుమార్ తనయుడు ఆది నటించిన 'శంబాల' పైనా కొందరు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. రోషన్ మేకా 'ఛాంపియన్' కూడా ఆకట్టుకొనే కథాంశంతో రూపొందిందనీ వినిపిస్తోంది. శివాజీ కీలక పాత్ర పోషించిన 'దండోరా'లోనూ విషయముందని తెలుస్తోంది. ఇలా చిన్న సినిమాలైనా వీటన్నిటిలోనూ ఏదో ఓ ప్రత్యేకత ఉందని ట్రేడ్ టాక్... మరి ఈ స్ట్రెయిట్ మూవీస్ లో ఏ సినిమా పైచేయిగా సాగుతుందో చూడాలి.

Updated Date - Dec 17 , 2025 | 09:49 PM