Global Star: చెర్రీపై నెట్ ఫ్లిక్స్ డాక్యూ ఫీచర్

ABN, Publish Date - May 13 , 2025 | 03:28 PM

ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పై డాక్యుమెంటరీ ఫిల్మ్ ను తీస్తున్నట్టు సమాచారం. అతి త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వస్తుందని అంటున్నారు.

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌ కు ఇప్పుడు సర్వత్రా విశేష ఆదరణ లభిస్తోంది. ఈ యేడాది ప్రారంభంలో వచ్చిన చెర్రీ 'గేమ్ ఛేంజర్' నిరాశ పర్చినా... అతని చుట్టూ మాత్రం బోలెడన్ని పాజిటివ్ ఇష్యూస్ జరుగుతున్నాయి. ఇటీవలే లండన్ లోని తుస్సాద్స్ మ్యూజియంలో రామ్ చరణ్‌ మైనపు ప్రతిమను ఆవిష్కరించారు. అతనితో పాటు ఎప్పుడూ చేతిలో ఉండే పెట్ డాగ్ రైమ్ ప్రతిమ కూడా అందులో ఉండటం విశేషం. అలానే లండన్ లో రాయల్ ఆల్బర్ట్ హాల్ లో ట్రిపుల్ ఆర్ లైవ్ ఆర్కెస్ట్రా కార్యక్రమంలో జూ. ఎన్టీఆర్, రాజమౌళితో కలిసి రామ్ చరణ్ పాల్గొన్నాడు. అక్కడ వారికి లభించిన స్పందన అంతా ఇంతా కాదు. ఇలా ఇంటా బయట కూడా రామ్ చరణ్‌ కు చక్కని గుర్తింపు లభిస్తోంది. ఇదే సమయంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న 'పెద్ది' చిత్రంలో రామ్ చరణ్‌ నటిస్తున్నాడు. అతనికి జోడీగా ఈ సినిమాలో జాన్వీ కపూర్ చేస్తోంది. సానా బుచ్చి బాబు దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాకు ఎ.ఆర్. రెహమాన్ సంగీతం సమకూర్చుతున్నాడు.


ఇదిలా ఉంటే... రామ్ చరణ్‌ కు అంతర్జాతీయ స్థాయిలో లభిస్తున్న గుర్తింపును దృష్టిలో పెట్టుకుని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఓ డాక్యుమెంటరీని ప్లాన్ చేసిందట. దీనికి సంబంధించిన టీమ్ ఆరు నెలల పాటు ఈ ప్రాజెక్ట్ పై ఉంటుందట. రామ్ చరణ్‌ కెరీర్, ఫ్యాన్స్ కు అతనితో ఉన్న అనుబంధం, అంతర్జాతీయ స్థాయిలో లభిస్తున్న గౌరవం వీటన్నింటినీ ఈ డాక్యుమెంటరీలో పొందు పర్చబోతున్నారట. ఇటీవల ఇదే తరహాలో రాజమౌళిపై నెట్ ఫ్లిక్స్ సంస్థ డాక్యు - ఫీచర్ ను రూపొందించింది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. ఈ డాక్యుమెంటరీలో చెర్రీ జీవిత గమనంతో పాటు అతని కెరీర్, సినిమా రంగానికి అతని కంట్రిబ్యూషన్ కూడా ఉంటుందట. మొత్తానికి ఇది రామ్ చరణ్‌ అభిమానులకు శుభవార్త అనే చెప్పాలి.

Also Read: Tollywood in Trouble: థియేటర్ల మనుగడ ముఖ్యమా.. పారితోషికం ముఖ్యమా?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - May 13 , 2025 | 03:28 PM