Kota Srinivasarao: ఆ స్టార్ చేయాల్సిన పిసినారి లక్ష్మీపతి పాత్ర కోటాను ఎలా వరించింది..
ABN , Publish Date - Jul 13 , 2025 | 04:24 PM
ఏదైనా రాసి పెట్టి ఉంటే ఎన్ని అడ్డంకులు ఎదురైనా కచ్చితంగా జరుగుతుంది అని పెద్దలు చెప్తారు. ఇది అందరికీ వర్తిస్తుంది. అన్ని విషయాల్లో కూడా వర్తిస్తుంది. పండే ప్రతి బియ్యపు గింజ మీద తినేవాడి పేరు రాసి ఉన్నట్టే.. సినిమాలో కనిపించే ప్రతి పాత్రపై కూడా నటించేవారి పేరు రాసి ఉంటుంది.
Kota Srinivasarao: ఏదైనా రాసి పెట్టి ఉంటే ఎన్ని అడ్డంకులు ఎదురైనా కచ్చితంగా జరుగుతుంది అని పెద్దలు చెప్తారు. ఇది అందరికీ వర్తిస్తుంది. అన్ని విషయాల్లో కూడా వర్తిస్తుంది. పండే ప్రతి బియ్యపు గింజ మీద తినేవాడి పేరు రాసి ఉన్నట్టే.. సినిమాలో కనిపించే ప్రతి పాత్రపై కూడా నటించేవారి పేరు రాసి ఉంటుంది. అలా రాసి ఉంది కాబట్టే తెలుగు ఇండస్ట్రీ బతికి ఉన్నన్నినాళ్లు లక్ష్మీపతి బతికే ఉంటాడు. ఎవరీ లక్ష్మీపతి అని అంటారా.. ? పిసినారి లక్ష్మీపతి తెలియదా.. ? అరగుండు వెధవను పక్కన పెట్టుకొని వాడితో అడ్డమైన పనులు చేయించుకొని పావలా కూడా ఇవ్వని లక్ష్మీపతి. అహ నా పెళ్ళంట (Aha Naa Pellanta) సినిమాలో జంధ్యాల ఏరికోరి ఎంచుకున్న లక్ష్మీపతి.. కోటా శ్రీనివాసరావు (Kota Srinivasarao).
కోటా కెరీర్ లో ఎన్ని పాత్రలు చేసినా కూడా ఇండస్ట్రీకి ఆయన ఎవరో తెలిసింది మాత్రం ఈ లక్ష్మీపతి పాత్రవలనే. అసలు ఎవరు ఆయన్ను ఇలాంటి పాత్రలో ఊహించుకోలేదు. కానీ, జంధ్యాల ఆ సాహసం చేశారు. రామానాయుడు వద్దు అని పట్టుబట్టినా కూడా ఆయన మాటను తోసిపుచ్చి ఈ పాత్రలో కేవలం కోటానే బావుంటాడని చెప్పి మరీ ఈ సినిమాను తెరకెక్కించాడట. మొదట ఈ పాత్ర కోసం రామానాయుడు అప్పటి స్టార్ నటుడు రావు గోపాలరావును అనుకున్నారట. కానీ, ఆ పాత్ర తన కోసం రాసిపెట్టి ఉందని, అందుకే పిసినారి లక్ష్మీపతి పాత్ర తన వద్దకు వచ్చిందని కోటా ఒకసారి చెప్పుకొచ్చారు.
' మండలాధీశుడు సినిమా తరువాత ఒకరోజు చెన్నై విమానాశ్రయంలో కూర్చున్నాను. అప్పటికే రామానాయుడు గారు వచ్చి కూర్చున్నారు. ఇటు రావయ్యా అని అన్నారు. ఆరోజుల్లో నాలాంటి నటుడు ఆయన ముందు కూర్చొని మాట్లాడడమే గొప్ప విషయం. ఆయన పిలిచారని వెళ్లి కూర్చున్నాను. నేను జంధ్యాలతో ఒక సినిమా చేస్తున్నాను. ఈరోజే ఫైనల్ అయ్యింది. అందులో ఒక పాత్ర ఉంది. ఆ క్యారెక్టర్ కనుక బాగా పండితే మంచిగా ఆడుతుంది. లేకపోతే ఏవరేజ్ గా ఆడుతుంది. నేనేమో ఆ పాత్రకి రావు గోపాలరావును తీసుకుందామంటున్నా.. జంధ్యాల ఏమో నువ్వే కావాలని పట్టుబడుతున్నాడు. నేను సరే అన్నా.. నీవొక 20 రోజులు డేట్స్ కావాలి అని అన్నారు. తప్పకుండా సార్ అని చెప్పి షూట్ ఫినిష్ చేశా. ఆ సినిమా నాకు మంచి పేరు తీసుకొచ్చి పెట్టింది' అని కోటా చెప్పుకొచ్చారు.
నిజం చెప్పాలంటే.. ఆ పాత్రలో కోటాను తప్ప ఇంకొకరిని ఊహించలేము అంటే అతిశయోక్తి కాదు. చిరిగినా జుబ్బా.. ఒక అద్దం పగిలిన కళ్ళజోడు.. వెకిలి నవ్వు.. డబ్బు మీద ఆశ.. అసలు పిసినారి అనే పదానికి బ్రాండ్ అంబాసిడర్ అంటే లక్ష్మీపతి అని చెప్పొచ్చు అనేలా కనిపించాడు. కోడికి దారం కట్టి ఉత్తి అన్నం తినడం, ఒంటికి పేపర్లు చుట్టుకొని పడుకోవడం.. అబ్బో ఇలా ఒకటేమిటి ఇప్పటికీ పిసినారి అని ఎవరినైనా చెప్పాలన్నా.. చూపించాలన్నా.. వీడొక పిసినారి లక్ష్మీపతి అని చెప్పుకొస్తారు. ఎంత రాసిపెట్టి ఉంటే ఈ పాత్ర కోటాకు దక్కిందో కదా..