Sandeep Raj: నేనే దురదృష్టవంతుడిని.. మోగ్లీ వాయిదాపై డైరెక్టర్ ఆవేదన
ABN , Publish Date - Dec 09 , 2025 | 03:08 PM
అఖండ 2 (Akhanda 2) సినిమా వాయిదా.. ఎన్నో చిన్న సినిమాలకు ఆటంకంగా మారింది. డిసెంబర్ 5 న అఖండ 2 వస్తుంది అనుకోని.. బాలయ్యతో పోటీ ఎందుకు అని.. కొన్ని చిన్న సినిమాలు డిసెంబర్ 12 న రిలీజ్ చేసుకోవడానికి సిద్ధమయ్యాయి.
Sandeep Raj: అఖండ 2 (Akhanda 2) సినిమా వాయిదా.. ఎన్నో చిన్న సినిమాలకు ఆటంకంగా మారింది. డిసెంబర్ 5 న అఖండ 2 వస్తుంది అనుకొని.. బాలయ్యతో పోటీ ఎందుకు అని.. కొన్ని చిన్న సినిమాలు డిసెంబర్ 12 న రిలీజ్ చేసుకోవడానికి సిద్ధమయ్యాయి. అందులో చెప్పుకోతగ్గవి అంటే రోషన్ కనకాల 'మోగ్లీ' (Mogwli), నందు 'సైక్ సిద్దార్థ్',త్రిగుణ్ 'ఈషా', కార్తీ 'అన్నగారు వస్తారు' సినిమాలు ఉన్నాయి. మిగిలినవి అంతగా చెప్పుకోదగ్గవి కాకపోయినా, 12వ తేదీన రావడానికి సిద్ధమయ్యాయి. అఖండ-2 వంటి క్రేజీ ప్రాజెక్ట్ ఇప్పుడు అదే డేట్ ను లాక్ చేసుకోవడంతో ఇవన్నీ వాయిదా బాట పట్టాయి.
ముఖ్యంగా 'మోగ్లీ' సినిమాపై 'అఖండ 2' సినిమా ప్రభావం చాలా గట్టిగా ఉంది. మొదటి నుంచి 'మోగ్లీ'పై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. అందుకు తగ్గట్లుగానే టీజర్, ట్రైలర్ కూడా అభిమానులను అలరించింది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుందని మేకర్స్ ప్రమోషన్స్ కూడా భారీగానే ప్లాన్ చేశారు. ఒకపక్క రోషన్.. బుల్లితెరను మొత్తం కవర్ చేస్తుంటే.. బండి సరోజ్ వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాపై హైప్ క్రియేట్ చేస్తున్నాడు. ఇక ఇంత ప్రమోషన్స్ చేసుకున్నా వారికి ఫలితం మాత్రం దక్కడం లేదు. అదే రోజు 'అఖండ 2' వస్తుందని.. 'మోగ్లీ'ని వాయిదా వేసినట్లు తెలుస్తోంది.
ఇక 'మోగ్లీ' వాయిదాపై డైరెక్టర్ సందీప్ రాజ్ తన ఆవేదన వ్యక్తం చేశాడు. ఇదంతా తన దురదృష్టమని, సిల్వర్ స్క్రీన్ పై తన పేరు చూసుకొనే అదృష్టం లేదు అని చెప్పుకొచ్చాడు. 'కలర్ ఫోటో' సినిమా కూడా థియేటర్ లో రిలీజ్ కాలేకపోయిందని, ఈ రెండు సినిమాలకు నేను డైరెక్టర్ కాకపోయి ఉంటే వేరేలా ఉండేదని వాపోయాడు. 'బహుశా కలర్ ఫోటో, మోగ్లీ చిత్రాలకు నేను కాకుండా వేరొక దర్శకుడు ఉంటే బావుండేది. ఈ సినిమాలను తమ వృత్తి కోసం ఏదైనా చేయగల కొంతమంది ఉత్సాహవంతులు నిర్మించారు.
ఈ రెండు సినిమాలకు సంబంధించిన ఉమ్మడి అంశాలు ఏంటంటే ప్రతిదీ బాగానే జరుగుతున్నట్లు అనిపించినప్పుడు, వాటి విడుదలలో దురదృష్టం ఎదురైంది. రెండోది నేను. బహుశా నేను దురదృష్టవంతుడిని కావచ్చు. నేను కూడా అలా భావించడం ప్రారంభించాను. సందీప్ రాజ్ దర్శకత్వం వహించినది అనే టైటిల్‌ను పెద్ద తెరపై చూడాలనే నా కల రోజురోజుకూ కష్టతరం అవుతోంది. సిల్వర్‌స్క్రీన్ నన్ను ద్వేషిస్తుందని నేను అనుకుంటున్నాను. రోషన్, సరోజ్ గారు, సాక్షి, హర్ష, డి.ఓ.పీ. మారుతి, భైరవ.. అంకితభావంతో ఉన్న చాలా మంది వ్యక్తుల అభిరుచి, చెమట, రక్తంతో 'మోగ్లీ'ని నిర్మించారు. కనీసం వారి కోసమైనా 'మోగ్లీ'కి అంతా మంచి జరగాలని నేను నిజంగా ఆశిస్తున్నాను' అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.