Champion: క్లైమాక్స్.. 18 రోజులు షూట్ చేశాం
ABN , Publish Date - Dec 27 , 2025 | 07:22 AM
రోషన్, అనస్వర రాజన్ జంటగా తెరకెక్కించిన చిత్రం ‘ఛాంపియన్’ విజయవంతంగా రన్ అవుతుంది. ఈ సందర్భంగా మేకర్స్ శుక్రవారం సక్సెస్ మీట్ నిర్వహించారు.
రోషన్ (Roshan), అనస్వర రాజన్ (Anaswara Rajan) జంటగా ప్రదీప్ అద్వైతం (Pradeep Advaitham) తెరకెక్కించిన చిత్రం ‘ఛాంపియన్’ (Champion). జీ స్టూడియోస్ (Zee Studios) సమర్పణలో స్వప్న సినిమాస్ (Swapna Cinema), ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ (Anandi Arts), కాన్సెప్ట్ ఫిల్మ్స్ (Concept Films) సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. సినిమా ఇటీవలే విడుదలైన సందర్భంగా చిత్ర బృందం శుక్రవారం సక్సెస్‌మీట్ నిర్వహించింది.
ఈ కార్యక్రమంలో చిత్ర కథానాయకుడు రోషన్ మాట్లాడుతూ ‘ఈ చిత్రం నాకు చాలా ప్రత్యేకమైంది. కళ్యాణ్ చక్రవర్తి గారితో కలసి నటించడం గౌరవంగా భావిస్తున్నా. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా. ఇది ఫ్యామిలీ మూవీ. కుటుంబ సభ్యులందరూ కలసి చూడాలని కోరుతున్నా. గొప్ప విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు’ అని అన్నారు.
హీరోయిన్ అనస్వర రాజన్ మాట్లాడుతూ ‘తెలుగులో నాకిది మొదటి చిత్రం. థియేటర్‌లో ప్రేక్షకుల స్పందన చూస్తున్నప్పుడు చాలా ఆనందంగా అనిపించింది’ అని చెప్పారు. దర్శకుడు ప్రదీప్ అద్వైతం మాట్లాడుతూ ‘ఇది మన నేల చరిత్ర. అందరూ ఈ సినిమాకు కుటుంబంతో కలసి వెళ్లండి. కచ్చితంగా పిల్లలతో కలసి చూడాల్సిన చిత్రమిది’ అని అన్నారు.
నిర్మాత స్వప్న దత్ (Swapna Dutt) మాట్లాడుతూ ‘వైజయంతి మూవీస్‌కి 50 ఏళ్లు, స్వప్న సినిమాస్ మొదలై కూడా 25 ఏళ్లు అవుతోంది. ప్రతిసారి ఒక ఛాలెంజింగ్ కథను ఎంచుకొని సినిమా తీస్తున్నాం. డబ్బు కన్నా సంతృప్తి ముఖ్యం. అందుకే సంతృప్తినిచ్చే సినిమాలనే చేస్తున్నాం. ‘ఛాంపియన్’. సినిమాను ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులకు రుణపడి ఉంటాం’ అని అన్నారు.