Hari Hara Veera Mallu: వీరమల్లుకు క్రిష్‌ విషెస్...

ABN , Publish Date - Jul 22 , 2025 | 09:53 AM

చిత్రసీమలో నాన్ కాంట్రవర్షియల్ డైరెక్టర్ గా క్రిష్ కు పేరుంది. గతంలో ఆయన కంగనా రనౌత్ నిర్మించిన 'మణికర్ణిక' చిత్రం నుండి మధ్యలోనే తప్పుకున్నారు. అలానే పవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు' మూవీ నుండి కూడా ఆయన అర్థంతరంగా వైదొలగారు. అయినా... ఈ సినిమా విడుదల వేళ చిత్రబృందానికి క్రిష్ విషెస్ తెలిపారు.

Krish About Pawan Kalyan

'హరి హర వీరమల్లు' (Harihara Veeramallu) అనేది ప్రముఖ దర్శకుడు క్రిష్‌ (Krish) బ్రెయిన్ చైల్డ్. సీనియర్ నిర్మాత ఎ.ఎం. రత్నం (A.M. Ratnam) కు సినిమా చేస్తానని మాట ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) రకరకాల కథలు విన్నారు. కొన్ని రీమేక్స్ మీద దృష్టి పెట్టారు. చివరకు క్రిష్ చెప్పిన హరిహర వీరమల్లు కు కథకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అప్పటి నుండి సినిమా సెట్స్ పైకి వెళ్ళే వరకూ క్రిష్‌ ఎంతో హోమ్ వర్క్ చేశారు. ఆర్ట్ డైరెక్టర్ తోట తరణి (Thota Tarani) తో పాటు సినిమాటోగ్రాఫర్ జ్ఞానశేఖర్ తో పాటు చర్చోపచర్చలు జరిపారు. ఈ కథ 17వ శతాబ్దానికి చెందిన ఓ యోధుడిది కావడంతో ఆ సమయానికి సంబంధించిన యుద్ధ విద్యలలో పవన్ కళ్యాణ్‌ సైతం శిక్షణ తీసుకున్నారు. భారీ అంచనాలతో మొదలైన 'హరిహర వీరమల్లు' నిర్మాణం ఊహించని విధంగా ఆలస్యమైంది. మధ్యలో కరోనా మహమ్మారి సైతం రెండు సార్లు వచ్చి వెళ్ళిపోయింది.


వేరే ప్రాజెక్ట్ లతో పాటు వ్యక్తిగత కారణంగా ఈ ప్రాజెక్ట్ నుండి క్రిష్‌ తప్పుకోవడంతో దీనిని పూర్తి చేసే బాధ్యతను ఎ. ఎం. రత్నం తనయుడు జ్యోతికృష్ణ (Jyothi Krishna) భుజానికి ఎత్తుకున్నాడు. ఈ సినిమాను క్రిష్ అంగీకారంతోనే జ్యోతికృష్ణకు అప్పగించామని అప్పట్లోనే రత్నం ప్రకటించారు. కానీ క్రిష్ మాత్రం దీని గురించి ఇప్పటి వరకూ పెదవి విప్పలేదు. ఆయన తనంతగా తాను బయటకు వెళ్ళారా? లేక వెళ్ళాల్సిన పరిస్థితులు ఉత్పన్నమయ్యాయా? అనే విషయంలో క్లారిటీ లేదు. ఇంతవరకూ జరిగిన ఫిల్మ్ పబ్లిసిటీలో జ్యోతికృష్ణ పేరుతో పాటు క్రిష్ పేరునూ దర్శకుడిగా ఉదహరిస్తూనే ఉన్నారు. సోమవారం ఉదయం జరిగిన 'హరిహర వీరమల్లు' ప్రెస్ మీట్ లోనూ, అదే రోజు సాయంత్రం జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లోను నిర్మాత రత్నంతో పాటు పవన్ కళ్యాణ్‌ సైతం క్రిష్‌ సేవలను పొగిడారు. ఈ సినిమా రూపకల్పనలో క్రిష్‌ కృషి ఎంతో ఉందని చెప్పారు.


ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం క్రిష్‌ సోషల్ మీడియా వేదికగా తన మనసులోని భావాలను పంచుకుంటూ, ఈ నెల 24, గురువారం జనం ముందుకు రాబోతున్న 'హరిహర వీరమల్లు' సినిమా బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఇద్దరు లెజెండ్స్ కారణంగా ఇవాళ 'హరిహర వీరమల్లు' అనే సినిమా జనం ముందుకొస్తోందని చెప్పారు. పవన్ కళ్యాణ్ లోని ఫైర్ ను ఏ కెమెరా కాప్చర్ చేయలేదని కితాబిస్తూ... ఈ సినిమాకు వెన్నెముక, ఆత్మ పవన్ కళ్యాణే అన్నారు. అలానే సినిమా రంగంలో సుదీర్ఘ అనుభవం కలిసిన ఎ. ఎం. రత్నం వల్లనే 'హరిహర వీరమల్లు' ఇంత గ్రాండియర్ గా రూపుదిద్దుకుందని తెలిపారు. ఈ సినిమా తన మనసుకు ఎంతో దగ్గరైనదని అంటూ, ఓ దర్శకుడిగానే కాకుండా మరచిపోయిన చరిత్రను అన్వేషించి ప్రేక్షకుల ముందు ఉంచాలనుకున్న వ్యక్తిగా ఎంతో ఆనంద పడుతున్నానని చెప్పారు. 'హరి హర వీరమల్లు' విడుదల వేళ క్రిష్‌ తెలిపిన ఈ సందేశం పవన్ అభిమానులలో నూతనోత్తేజాన్ని నింపడం ఖాయం. ఇదిలా ఉంటే ప్రస్తుతం క్రిష్‌ 'ఘాటీ' అనే చిత్రాన్ని అనుష్క నాయికగా తెరకెక్కిస్తున్నారు. అది కూడా అతి త్వరలోనే జనం ముందుకు రానుంది.

Also Read: Ronth OTT: స‌డ‌న్‌గా.. ఓటీటీకి వ‌చ్చేసిన పోలీస్ థ్రిల్ల‌ర్‌! క్లైమాక్స్ మైండ్ బ్లాకే

Also Read: Avatar 3: అవ‌తార్‌3 బిగ్ అప్డేట్.. సినీ ల‌వ‌ర్స్‌కు పండ‌గే

Updated Date - Jul 22 , 2025 | 09:53 AM