Arya3: అల్లు అర్జున్, సుకుమార్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. ‘ఆర్య-3’ టైటిల్ రిజిస్టర్
ABN , Publish Date - May 20 , 2025 | 09:53 PM
పుష్కర కాలం క్రితం అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన అర్య, అర్య2 చిత్రాలు సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు.
పుష్కర కాలం క్రితం అల్లు అర్జున్ (Allu Arjun), సుకుమార్ (Sukumar) కాంబినేషన్‌లో వచ్చిన అర్య, అర్య2 చిత్రాలు సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఒకదాన్ని మించి మరోటి డిఫరెంట్ స్క్రీన్ ప్లే, పాటలతో, స్టోరీతో యూత్‌కు మరుపురాని జ్ఞాపకంగా మలిచారు. ఆపై ఈ సిరీస్‌లో మూడో చిత్రం వస్తుందని భావించినా అవి ముందట పడలేదు. ఆ తర్వాత అల్లు అర్జున్ జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడం, సుకుమార్ సైతం అదే స్థాయిలో పేరు తెచ్చుకుని సౌత్‌లో వన్ ఆఫ్ ది టాప్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నాడు. ఈ నేపథ్యంలో ఉన్నఫలంగా ఆర్య3 (Aarya3) సినిమా విషయంలో ఓ ఆసక్తికర ఆప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతుంది.
ఇదిలాఉంటే వీరి కాంబినేషన్‌లో ఆర్య 3 ఉంటుందని సుకుమార్ (Sukumar) గతంలో మాట వరుసకు అన్నప్పటికీ అవి చేతల వరకు రాకపోవంతో ఆ సినిమా గురించి అంతా మరిచిపోయారు. తీరా ఇప్పుడు తాజాగా దిల్ రాజు (Dil Raju) శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ ఆర్య3 టైటిల్‌ను రిజిస్టర్ చేయించడం ఇప్పుడు సర్వత్రా హాట్ టాపిక్‌గా మారింది. సడన్‌గా ఈ ఆర్య3 (Aarya3) విషయం బయటకు రావడంతో అంతా టాలీవుడ్‌లో ఏం జరుగుతోంది అంటూ మాట్లాడుకుంటున్నారు.
దర్శకుడు, హీరో పాన్ ఇండియా ఇమేజ్ కలిగి ఉండి ఇప్పుడు ఈ టైటిల్‌తో తిరిగి ప్రేమ కథ చేస్తారా లేక విజయ్ దేవర కొండ, అశిష్ రెడ్డిలలో ఇద్దరితో ఎవరితోనైనా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారా అనే వార్తలు తెగ ప్రచారం అవుతున్నాయి. మరోవైపు ఇతరులెవరైనా ఈ టైటిల్ తీసుకోక మునుపే ముందు జాగ్రత్తగా దిల్ రాజు బ్యానర్ ఈ టైటిల్ రిజిస్టర్ చేసి తన వద్ద పెట్టుకుందా అనేది తెలియాల్సి ఉంది. అసలు విషయం తెలియడానికి మరి కొద్ది రోజులు సమయం పట్టూ అవకాశం ఉంది.