Dil Raju: పోలీసు శాఖతో దిల్ రాజు భేటీ.. అందుకేనా
ABN , Publish Date - Jan 03 , 2025 | 05:55 PM
Dil Raju: సంధ్య థియేటర్ తొక్కిసలాట వివాదం కారణంగా తెలంగాణ ప్రభుత్వం బెనిఫిట్ షోలను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అగ్ర నిర్మాత దిల్ రాజు.. ప్రభుత్వాధినేతలను వరుసగా మీట్ కావడం ఆసక్తికరంగా మారుతుంది. సంక్రాంతికి బడా సినిమాల రిలీజ్ నేపథ్యంలో..
టాలీవుడ్ అగ్ర నిర్మాత, తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టీఎఫ్‌డీసీ) ఛైర్మన్ దిల్ రాజు శుక్రవారం తెలంగాణ హోం శాఖ స్పెషల్ సెక్రటరీ ఐపీఎస్ అధికారి రవి గుప్తాను కలిశారు. ఈ సమావేశంలో ఇండస్ట్రీ డెవలప్మెంట్ కోసం తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ప్రోగ్రామ్స్ గురించి మాట్లాడినట్లు తెలిసింది. అలాగే థియేటర్ల లైసెన్స్‌ల పునరుద్ధరణ పక్రియ సులువుగా అయ్యేవిధంగా చర్యలు చేపట్టాలని కోరారు.
మరోవైపు సంధ్య థియేటర్ తొక్కిసలాట వివాదం కారణంగా తెలంగాణ ప్రభుత్వం బెనిఫిట్ షోలను రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే సంక్రాంతికి మూడు పెద్ద సినిమాలు 'గేమ్ ఛేంజర్', 'డాకు మహారాజ్', 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఇందులో రెండు సినిమాలకి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే టికెట్ రేట్ల పెంపు, బెనిఫిట్ షోల అనుమతి, భద్రతా చర్యలు తదితర అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం. దిల్ రాజుతో పాటు తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు సునీల్ నారంగ్, పలువురు ఎగ్జిబిటర్లు హాజరయ్యారు.