Dil Raju - OG: నైజాంలో 'ఓజి' తోపు.. లాభాల్లో దిల్ రాజు
ABN , Publish Date - Oct 13 , 2025 | 07:46 PM
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను 'నైజామ్ కా బాద్ షా' అని కీర్తించారు ప్రముఖ నిర్మాత దిల్ రాజు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను (Pawan Kalyan) 'నైజామ్ కా బాద్ షా' అని కీర్తించారు ప్రముఖ నిర్మాత దిల్ రాజు( DIl Raju). 'ఓజీ' చిత్రాన్ని నైజామ్ ఏరియాలో పంపిణీ చేశారు దిల్ రాజు... ఈ సినిమా మిగిలిన ప్రాంతాల కన్నా మిన్నగా హైదరాబాద్ లో మంచి వసూళ్ళు చూసింది... ఈ సినిమా బ్రేక్ ఈవెన్ దాటి లాభాల బాట పట్టిందని దిల్ రాజు తెలిపారు. ఆదివారం రాత్రి 'ఓజీ' (OG)స్పెషల్ స్క్రీనింగ్ కు దిల్ రాజు హాజరయ్యారు... అక్కడే ఫ్యాన్స్ ను ఉత్సాహపరుస్తూ దిల్ రాజు 'నైజామ్ కా బాద్ షా పవన్ కళ్యాణ్' అని అన్నారు. ఫ్యాన్స్ కు కావలసింది 'ఓజీ'లో ఉందని, అందువల్లే 'ఓజీ' తమకు లాభాలు చూపిందని దిల్ రాజు చెప్పారు. ఆయన మాటలు అభిమానులకు మరింత ఉత్సాహం పెంచింది. త్వరలోనే పవన్ కళ్యాణ్ తో మరో సినిమా తీయడానికి ప్లాన్ చేస్తున్నామనీ దిల్ రాజు తెలిపారు. (Pawan Kalyan Nizam Ka Badshah)
పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన అనేక చిత్రాలను నైజామ్ ఏరియాలో పంపిణీ చేసి విజయపథంలో నడిపించారు దిల్ రాజు... పవన్ కళ్యాణ్ సినిమాలతో ఏ నాటి నుంచో అనుబంధం ఉన్న దిల్ రాజు, మొదటిసారి ఆయన హీరోగా నిర్మించిన చిత్రం 'వకీల్ సాబ్'... హిందీ చిత్రం 'పింక్' ఆధారంగా తెరకెక్కిన 'వకీల్ సాబ్' తెలుగులోనూ ఆదరణ పొందింది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో పవన్ డిఫరెంట్ గా కనిపించారని అభిమానులు ఆనందించారు... ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో దిల్ రాజు మరో సినిమా తీయనున్నారని తెలియగానే ఫ్యాన్స్ ఆనందిస్తున్నారు... మరో విశేషమేంటంటే ఈ చిత్రానికి వరుస విజయాలతో సాగుతోన్న అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తారని తెలుస్తోంది.
ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా 'మన శంకరవరప్రసాద్ గారు' తెరకెక్కుతోంది. ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సంక్రాంతి కానుకగా 'మన శంకరవరప్రసాద్ గారు' రానుంది. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ తో దిల్ రాజు నిర్మించబోయే చిత్రానికి కూడా అనిల్ రావిపూడి డైరెక్టర్ అన్న విషయం తెలిసి ఫ్యాన్స్ మరింతగా ఆనందిస్తున్నారు. హరీశ్ శంకర్ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' వచ్చే యేడాది విడుదల కానుంది. ఈ సినిమా తరువాత పవన్ ఏ మూవీలో నటిస్తారో ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. పైగా ఏపీ ఉపముఖ్యమంత్రి హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ సినిమాలకు కూడా కొంత సమయాన్ని కేటాయిస్తానన్నారు. ఆయన ఎప్పుడు డేట్స్ ఇస్తే అప్పుడు పవన్ కొత్త సినిమాలు మొదలవుతాయి. మరి అనిల్ రావిపూడి డైరెక్షన్ లో దిల్ రాజు నిర్మించబోయే చిత్రం ఎప్పుడు పట్టాలెక్కుతుందో చూడాలి...