Dhee Re Release: హిట్ సినిమా రీ రిలీజ్ తో హైప్ పెంచబోతున్న విష్ణు

ABN , Publish Date - Jun 02 , 2025 | 03:29 PM

కలక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు(Manchu Mohan Babu) నటవారసుడిగా ఇండస్ట్రీకి అడుగుపెట్టిన విష్ణు కెరీర్ లో భారీ హిట్ అంటూ ఏదైనా ఉంది అంటే అది ఢీ(Dhee) అనే చెప్పాలి.

Dhee Movie Re Release

ప్రస్తుతం ఇండస్ట్రీలో  రీ రిలీజ్ ట్రెండ్ కొనసాగుతున్న విషయం తెల్సిందే. కొత్త సినిమాల కన్నా రీ రిలీజ్ సినిమాలకే ఎక్కువ హైప్ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే కొత్త సినిమాలను.. రీ రిలీజ్ సినిమాలు డామినేట్ చేస్తున్నాయి. ఒకప్పుడు కల్ట్ క్లాసిక్ గా నిలిచిన సినిమాలను 4k ప్రింట్ తో థియేటర్ లో రిలీజ్ చేయడం మొదలుపెట్టారు మేకర్స్. మొదట్లో అవి కేవలం సరదాకి, ఫ్యాన్స్ కోసం మాత్రమే అనుకున్నారు. కానీ, ఉన్నకొద్దీ ఇదొక వ్యాపారంగా మారిపోయింది. 

అభిమానుల్లో ఉన్న ఉత్సాహాన్ని మేకర్స్ క్యాష్ చేసుకుంటున్నారు. ఈ రీ రిలీజ్ ల వలన కొత్త సినిమా రిలీజ్ లు కూడా ఇబ్బందిలో పడుతున్నాయి. ఇక ఇదంతా పక్కన పెడితే.. తన హిట్ సినిమాను రీ రిలీజ్ చేసి.. తన కొత్త సినిమాకు హైప్ పెంచాలని ట్రై చేస్తున్నాడు మంచు వారసుడు మంచు విష్ణు(Manchu Vishnu).  కలక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు(Manchu Mohan Babu) నటవారసుడిగా ఇండస్ట్రీకి అడుగుపెట్టిన విష్ణు కెరీర్ లో భారీ హిట్ అంటూ ఏదైనా ఉంది అంటే అది ఢీ(Dhee) అనే చెప్పాలి. శ్రీను వైట్ల(Srinu Vaitla) దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జెనీలియా(Genelia) హీరోయిన్ గా  నటించగా శ్రీహరి(Srihari) కీలకపాత్రలో నటించాడు. 

2007 లో రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. శ్రీను వైట్ల కథ, సునీల్- బ్రహ్మానందం కామెడీ, శ్రీహరి నటన, చక్రి మ్యూజిక్.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఎన్నిసార్లు చూసినా అస్సలు బోర్ కొట్టని సినిమాల్లో ఢీ మొదటి వరసలో ఉంటుంది అని చెప్పొచ్చు. విష్ణు కెరీర్ లో మొదటి హిట్ .. ఇంచుమించు చివరి హిట్ కూడా ఇదే అని చెప్పొచ్చు. ఇక ఈ సినిమా మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్దమవుతుంది.

ఎప్పుడో  ఢీ కి సీక్వెల్ రాబోతుందని మేకర్స్ ప్రకటించారు. కానీ, అది పట్టాలెక్కలేదు. ఇక ఇప్పుడు ఢీ రీ రిలీజ్(Dhee Re Release) కు రెడీ అయ్యింది. జూన్ 6 న ఢీ రీరిలీజ్ కానుందని మంచు విష్ణు అధికారికంగా ఎక్స్ లో చెప్పుకొచ్చాడు. జాయిన్ ది పార్టీ అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చాడు. జూన్ 6 నే ఢీని రీ రిలీజ్ చేయడానికి ప్రత్యేకమైన కారణం ఉందా.. ? అనేది తెలియలేదు కానీ, కన్నప్ప(Kannappa) సినిమాపై హైప్ పెంచడానికి విష్ణు ఇలా ప్లాన్ చేసి ఉండొచ్చు అనే  మాటలు వినిపిస్తున్నాయి. కన్నప్ప జూన్ 27 న రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇక ఈలోపు ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్ లతో పాటు ఢీ కూడా రీ రిలీజ్ చేస్తే సోషల్ మీడియాలో హైప్ పెరుగుతుంది అని చెప్పొచ్చు.  మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎలా అలరిస్తుందో చూడాలి. 

Updated Date - Jun 02 , 2025 | 03:54 PM