Devi Sri: డీఎస్పీపై మళ్లీ విమర్శలు..
ABN , Publish Date - Jun 11 , 2025 | 06:14 PM
టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ వివాదాల్లో ఇరుక్కుంటున్నాడు. ఒకప్పుడు వరుస సినిమాలతో తెలుగు ఆడియెన్స్ ను ఉర్రూతలూగించిన అతడు.. ఇప్పుడు ఫ్యాన్స్ ను ఉసురూమనిపిస్తున్నాడు. కారణమేదైనా చేజేతులా కెరీర్ ను స్పాయిల్ చేసుకుంటున్నాడని అభిమానులు ఫీల్ అవుతున్నారు.
దేవిశ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) టాలీవుడ్లో స్టార్ మ్యూజిక్ కంపోజర్! కానీ ఈ మ్యూజిక్ డైరెక్టర్ మ్యాజిక్ ఇటీవల మిస్ అవుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా అతగాడు డెడ్‌లైన్ కల్లా పని పూర్తి చేయడం లేదనే విమర్శలు ఎదుర్కొంటున్నాడు. తన గత చిత్రం 'పుష్ప 2' (Pushpa 2) సినిమాకు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కోసం డీఎస్పీని తప్పించి, శామ్ సి.ఎస్.ను (Sam CS ) తీసుకోవడం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. డీఎస్పీ ఇచ్చే బీజీఎం అంచనాలను అందుకోలేదని టీమ్ భావించింది. అలాగే మ్యూజిక్ అవుట్ ఫుట్ విషయంలో లేట్ చేశాడనే అరోపణలు ఎదుర్కొన్నాడు. తాజాగా డీఎస్పీపై మళ్లీ అలాంటి విమర్శలే వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం దేవిశ్రీ 'కుబేర' (Kubera ) సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. తాజా రిపోర్ట్స్ ప్రకారం ఈ సినిమాకు సంబంధించి ఇంకా రెండు పాటలు పెండింగ్‌లో ఉన్నాయట. సినిమా రిలీజ్‌కు రెండు వారాలు మాత్రమే సమయం ఉండగా... ఇంకా ఆలస్యం చేయడం పట్ల డీఎస్పీ పై నెగెటివిటీ ఎక్కువైపోతోంది. వాస్తవానికి దేవిశ్రీ ప్రసాద్ అభిమానులు గత కొన్ని సంవత్సరాలుగా అతని పనితీరుపై అసంతృప్తితో ఉన్నారు. డీఎస్పీ సంగీతంలో ఒకప్పటి మ్యాజిక్ కనిపించడం లేదని ఫీలవుతున్నారు. అదృష్టవశాత్తు, 'పుష్ప' (Pushpa ) వంటి సినిమాలు అతన్ని మళ్లీ స్పాట్లైట్లోకి తీసుకొచ్చాయి. డీఎస్పీ చేతిలో ప్రస్తుతం ప్రాజెక్ట్‌లు తక్కువగా ఉన్నప్పటికీ ఆలస్యం చేయడం వెనుక కారణమేంటో అంతుబట్టడం లేదు.
2022లో దేవిశ్రీ ప్రసాద్ 8 సినిమాలు చేశాడు. కానీ ఆ తర్వాత సంవత్సరం కేవలం 'వాల్తేర్ వీరయ్య' (Waltair Veerayya) ఒక్కటే రిలీజైంది. 2024లో రెండు తమిళ సినిమాలు, తెలుగులో 'పుష్ప 2' వచ్చాయి. ఈ ఏడాది ఇప్పటివరకు 'తండేల్ (Thandel)' ఒక్కటే రిలీజైంది. రాబోయే ప్రాజెక్ట్‌లలో 'కుబేర' (Kubera) 'జూనియర్' (Junior) చిత్రాలు ఉన్నాయి. వీటితో పాటు, 'ఉస్తాద్ భగత్ సింగ్', 'కొక్కొరొక్కో', మోహన్ లాల్ 'వృషభ' చిత్రాలు చేస్తున్నాడు. మరి కొన్ని ప్రాజెక్ట్‌ల కోసం అతని పేరు పరిశీలనలో ఉంది. మిగిలిన వారితో పోల్చితే తక్కువ ప్రాజెక్ట్స్ చేస్తున్న డీఎస్పీ వాటిని కూడా సమయానికి డెలివరీ చేయలేకపోతున్నాడు. ఈ కారణంగానే అతని చుట్టూ నెగెటివ్ బజ్ క్రియేట్ అవుతోంది. మొత్తం మీద డీఎస్పీనే ఇన్ పుట్ ఇచ్చే విషయంలో లేట్ చేస్తున్నాడా లేదా మరేదైనా కారణం ఉందా అనేది తెలియడం లేదు. కానీ.. కావాల్సినంత కాంట్రవర్సీలో మాత్రం ఈ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ చిక్కుకుకుపోతున్నాడు. మరి ఈ విమర్శలకు దేవిశ్రీ ప్రసాద్ ఎలా చెక్ పెడతాడో చూడాలి.