December Movies: అఖండ నుంచి అవతార్ వరకూ.. డిసెంబర్ అంతా దబిడి దిబిడే
ABN , Publish Date - Dec 01 , 2025 | 07:26 AM
ఈ డిసెంబర్ నెలలో బాక్సాఫీసు దగ్గర సినిమాల జాతరే ఉండనుంది. ‘అఖండ 2’ నుండి జేమ్స్ కామెరాన్ విజువల్ వండర్ ‘అవతార్ 3’ వరకూ భారీ చిత్రాలు క్యూ కడుతున్నాయి.
ప్రతి ఏటా సంక్రాంతి వస్తుందంటే చాలు, సినిమా ప్రేమికులకు పండగే. కానీ ఈ సారి డిసెంబర్ మాత్రం మామూలుగా లేదు. బాక్సాఫీసు రికార్డులు బద్దలుకొట్టేందుకు పాన్ ఇండియా స్టార్ల నుంచి హాలీవుడ్ (Hollywood) దిగ్గజాల వరకూ అందరూ క్యూ కట్టారు. నందమూరి బాలకృష్ణ (Balakrishna) ‘అఖండ 2’ (Akhanda2) గర్జనతో మొదలై, జేమ్స్ కామెరాన్ (James Cameron) సృష్టించబోయే విజువల్ వండర్ అవతార్ (Avatar3) వరకూ.. ఈ ఏడాది ముగింపు బాక్సాఫీసు దగ్గర అదిరే వేడి పుట్టించనుంది.
మొదటి వారమే.. మాస్ జాతర
డిసెంబర్ నెల ఆరంభమే అదిరిపోయే రేంజ్‌లో ఉండబోతోంది. ‘అఖండ’లో అఘోరాగా విశ్వరూపం చూపారు బాలకృష్ణ. ఆ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కిన ‘అఖండ 2’ డిసెంబర్ 5న థియేటర్లలో విడుదలకు దిగుతోంది. అదే రోజు బాలీవుడ్ హీరో రణ్‌వీర్‌సింగ్ ‘ధురంధర్’ (Dhurandhar), మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన ‘కలంకావల్’ చిత్రాలు విడుదలవుతున్నాయి. రెండో వారంలో ‘అన్నగారు వస్తారు’ అంటూ కార్తీ సందడి చేయనున్నారు. దీంతోపాటు ‘మోగ్లీ, సైక్ సిద్ధార్థ్’ చిత్రాలు కూడా డిసెంబర్ 12నే విడుదలవుతున్నాయి.
ఇక.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న తేదీ డిసెంబర్ 19. జేమ్స్ కామెరాన్ తెరకెక్కించిన దృశ్యకావ్యం ‘అవతార్ 3’ వెండితెరపై అద్భుతాలు సృష్టించేందుకు సిద్ధంగా ఉంది. దీనికి ఒక రోజు ముందు ప్రదీప్ రంగనాథన్ నటించిన ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ చిత్రం విడుదలవుతోంది.

క్రిస్మస్ కిటకిట:
సంక్రాంతిని తలపించేలా క్రిస్మస్ రోజునా బాక్సాఫీసు దగ్గర పలు చిత్రాలు వరుస కడుతున్నాయి. డిసెంబర్ 25న ఏకంగా ఏడు సినిమాలు విడుదలవుతున్నాయి. మోహన్‌లాల్ ‘వృషభ’, హాలీవుడ్ మూవీ ‘అనకొండ’, గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన యూత్‌ఫుల్ డ్రామా ‘యుఫోరియా’, రోషన్ మేకా హీరోగా నటించిన క్రీడా నేపథ్య చిత్రం ‘ఛాంపియన్’తో పాటు ‘శంభల, దండోరా, పతంగ్’ చిత్రాలు ఒకే రోజు ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. డిసెంబర్ బరిలో నిలిచిన చిత్రాలు డజనుకు పైగానే ఉన్నాయి. మరి వీటిలో ఎన్ని చిత్రాలను విజయం వరిస్తుందో వేచి చూడాలి.