CPI Narayana: బిగ్‌బాస్ షో.. ఓ ఖరీదైన వ్యభిచారం! బ్యాన్ చేయాల్సిందే
ABN, Publish Date - May 05 , 2025 | 04:03 PM
చాలాకాలంగా బిగ్‌బాస్ పై తీవ్ర స్థాయిలో విమర్శనాస్త్రాలు ఎక్కు పెడుతున్న సీపీఐ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ మరోసారి బిగ్‌బాస్, తాజాగా హైదరాబాద్ వేదికగా జరుగనున్న అందాల పోటీలపై ద్వజమెత్తారు.
చాలాకాలంగా బిగ్‌బాస్ (Bigg Boss Telugu)పై తీవ్ర స్థాయిలో విమర్శనాస్త్రాలు ఎక్కు పెడుతున్న సీపీఐ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ (CPI Narayana) మరోసారి బిగ్‌బబాస్, తాజాగా హైదరాబాద్ వేదికగా జరుగనున్న అందాల పోటీలపై ద్వజమెత్తారు. సోమవారం తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సమాజానికి ఏ రకం గానూ ఉపయోగం లేని షో బిగ్‌బాస్ షో అంటూ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు.
ఇప్పటికే పలుమార్లు బిగ్ బాస్‌ను బ్యాన్ చేయాలని నేను పోలీసులు మొదలుకొని, జిల్లా కోర్టు వరకు అందరి చుట్టూ తిరిగినా రెండేళ్లుగా నా పిటీషన్ స్వీకరించకుండా దండం పెట్టారని, ఎట్టకేలకు హైకోర్టు స్పందించి నేను వేసిన పిటిషన్‌ను స్వీకరించింది అని అన్నారు. ఈక్రమంలో కోర్టు నాగార్జునకు, బిగ్ బాస్ నిర్వాహకులకు నోటీసులు సైతం జారీ చేసిందని తెలిపారు. ఇప్పటికైనా ఈ షో విషయంలో ప్రజలకు మేలు జరిగేలా, సదరు కార్యక్రమాలు నిర్వహించకుండా తీర్పు వస్తుందని భావిస్తున్నా అన్నారు.
బిగ్‌బాస్ అనేది ఓ హీన సంస్కృతి అని అది యువతను చెడు మార్గంలో నడిపిస్తుందని , కళారంగానికి సైతం కళంకితం చేస్తోందని దీనిని ఎలాగైనా బ్యాన్ చేయాలని అన్నారు. బిగ్‌బాస్ వ్యవహారం చూస్తే.. చీప్ వ్యభిచారం వద్దు, కాస్ట్లీ వ్యభిచారం చేయండి అన్నట్టుందని, భార్యాభర్తలు కాని వాళ్ళు ఒకే మంచం మీద పడుకోవడమేంటని దుయ్య బట్టారు. ఈ కార్యక్రమం 24 గంటలు లైవ్ పెడితే ఇంకా దారుణమైన దృశ్యాలు చూడాల్సి వచ్చేదని తెలిపారు.
కుటుంబ సాంప్రదాయాల గురించి ప్రపంచానికి భారతదేశం నేర్పిస్తుందని, బిగ్ బాస్ ని చూసి మన దేశం నేర్చుకోవాల్సిన పనిలేదని, అతి పవిత్రమైన భారతీయ సంస్కృతిని నాశనం చేయడానికి బిగ్ బాస్ వచ్చిందన్నారు. ఇక హైదరాబాదులో ఆడవారి అందాల పోటీ పెట్టడం, ఆడవాళ్ళని అందాల సరుకులుగా మార్చడమేన్నారు. పనికిమాలిన వస్తువుల అమ్మకానికి ఆడవాళ్లను ఉపయోగిస్తున్నారని, బిగ్ బాస్ ఎంత హీనమైనదో అందాల పోటీ కూడా అంతే హీనమైనదని ఇవి రెండు మహిళ జాతిని కించపరిచే కార్యక్రమాలని పేర్కొన్నారు. పైగా అందాల పోటీలతో టూరిజం డెవలప్మెంట్ అవుతుందని చెప్పడం అవమానకరంగా ఉందన్నారు.