CM Revanth Reddy: స్క్రిప్ట్ తో రండి.. సినిమా చేసుకొని వెళ్ళండి
ABN , Publish Date - Dec 09 , 2025 | 08:09 PM
ఫ్యూచర్ సిటీలో స్టూడియోలను ఏర్పాటు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్ని రకాల సహాయ సహకారాలు ఉంటాయని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తెలిపారు.
CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీలో స్టూడియోలను ఏర్పాటు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్ని రకాల సహాయ సహకారాలు ఉంటాయని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తెలిపారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ (Telangana Rising Global Summit) ల రేవంత్ రెడ్డితో టాలీవుడ్, బాలీవుడ్ సినీ ప్రముఖులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, అల్లు అరవింద్, సురేష్ బాబు, దిల్ రాజు, నటులు జెనీలియా, అక్కినేని అమల, పలువురు టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు పాల్గొన్నారు.
ఇక ఈ సమ్మిట్ లో రేవంత్ రెడ్డి.. చిత్ర పరిశ్రమకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. స్క్రిప్ట్ తో వస్తే సినిమా పూర్తి చేసుకుని వెళ్ళేలా రాష్ట్ర ప్రభుత్వం సినీ ఇండస్ట్రీని ప్రోత్సహించేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. నిర్మాత ఎవరు.. ఏ భాషకు చెందినవారు అనేది అవసరం లేదని, మంచి కథతో వస్తే.. ఇక్కడే సినిమా మొత్తం పూర్తి చేసుకొని వెళ్లేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో సినీ ఇండస్ట్రీ అభివృద్ధికి కావాల్సిన అన్నిరకాల సౌకర్యాలను కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపిన సీఎం ఫ్యూచర్ సిటీలో స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని చెప్పుకొచ్చారు.
24 క్రాఫ్ట్స్ లో సినిమా ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా స్థానికులను ట్రైన్ చేసే అంశాన్ని పరిశీలించామని, ఫ్యూచర్ సిటీలో స్టూడియోలను ఏర్పాటు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్ని రకాల సహాయ సహకారాలు ఉంటాయని చెప్పుకొచ్చారు. తెలంగాణ అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగం కావాలని, ఫ్యూచర్ సిటీలో స్టూడియోలు నిర్మిస్తే.. నీరు, కరెంట్, భూములు లాంటి విషయాల్లో రాయితీలు ఇస్తామని తెలిపారు. ఇక ఈ సమ్మిట్ లో చిరంజీవి కూడా పాల్గొన్నారు. కానీ, అందరితో పాటు కాకుండా కాస్త ముందుగా వెళ్లి రేవంత్ రెడ్డిని కలిసి వెళ్లిపోయినట్లు సమాచారం.