CM Revanth Reddy: సినిమా టికెట్ ధరలు పెంచితే.. కార్మికులకు ఎం ఒరిగింది? సీఎం హాట్ కామెంట్స్
ABN , Publish Date - Oct 28 , 2025 | 07:43 PM
హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ సినీ పరిశ్రమకు కేంద్రంగా తీర్చిదిద్దాలని తన సంకల్పమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ప్రకటించారు.
హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ సినీ పరిశ్రమకు కేంద్రంగా తీర్చిదిద్దాలని తన సంకల్పమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ప్రకటించారు. సినీ కార్మికుల సమాఖ్య ఆధ్వర్యంలో యూసుఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో జరిగిన సన్మాన సభలో సీఎం పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐటీ, ఫార్మా రంగాలు ఎలా అభివృద్ధి చెందాయో, ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా అలాగే ఎదగాలని నా ఆశయం. మీ అందరి సహకారంతో హాలీవుడ్ సినిమాలను హైదరాబాద్ లో షూట్ అయ్యేలా చేసే బాధ్యత నాది అని అన్నారు.
సినీ టికెట్ ధరల పెంపు, సినీ కార్మికుల అంశంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కార్మికుల సంక్షేమం పట్ల తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. సినీ కార్మికుల కష్టాలు నాకు బాగా తెలుసు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత గద్దర్ పేరుతో సినీ అవార్డులు ప్రారంభించాం అన్నారు. “కార్మికులు బాగుంటేనే దర్శకులు, నిర్మాతలు బాగుంటారు. కార్మికుల వెల్ఫేర్ కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా రూ.10 కోట్ల వెల్ఫేర్ ఫండ్‌గా డిపాజిట్ చేస్తుందని రేవంత్ స్పష్టం చేశారు.
అలాగే సినిమా టికెట్ ధరలు పెంచాలంటే అందులో కార్మికులకు వాటా ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. “టికెట్ ధరలు పెంచితే హీరోలకు, నిర్మాతలకు లాభం వస్తుంది. కానీ కార్మికులకు ఏమి ఒరిగింది? పెంచిన టికెట్ ధరలో 20 శాతం సినీ కార్మికులకు ఇవ్వాలి. అప్పుడే ప్రభుత్వం జీవో ఇస్తుంది,” అని స్పష్టమైన షరతు విధించారు. అలాగే, సినీ కార్మికుల పిల్లలకు నర్సరీ నుంచి ఇంటర్ వరకు ఉచిత విద్య, రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం, భవిష్యత్తులో ఇళ్ల స్థలాల కేటాయింపు కూడా చేస్తాం’’ అని ఆయన తెలిపారు.
అదే విధంగా, “మీ శ్రమతో సంపాదించే ప్రతి రూపాయిలో మీకు వాటా ఉండాలి. ఎంత పెద్ద నిర్మాత అయినా సరే, కార్మికుల వెల్ఫేర్ ఫండ్‌లో డబ్బు జమ చేస్తేనే రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేస్తుంది,” అని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. సినీ పరిశ్రమలో కార్మికుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని, ప్రతి ఒక్కరూ ఈ నిబంధనను పాటించాల్సిందేనని ఆయన హెచ్చరించారు.
ఇకపై భారత్ ఫ్యూచర్ సిటీలో సినిమా రంగానికి ప్రత్యేక ప్రాధాన్యత కల్పిస్తాం అని సీఎం తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్మాత, ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.