Ravindra Bharathi: రవీంద్రభారతిలో.. ఆ హాలీవుడ్ సినిమా ప్రదర్శన! ఎంట్రీ ఫ్రీ
ABN , Publish Date - Aug 15 , 2025 | 11:26 AM
ఈ వీకెండ్ సినిమాను లవర్స్‌కు మరోసారి ఒక ప్రత్యేకమైన అనుభూతి అందించేందుకు రవీంద్రభారతి రెడీ అయింది.
ఈ వీకెండ్ సినిమాను లవర్స్‌కు మరోసారి ఒక ప్రత్యేకమైన అనుభూతిని అందించేందుకు రవీంద్రభారతి (Ravindra Bharathi) రెడీ అయింది. తెలంగాణ భాషా, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సినీవారం (Cinivaram) మరియు సండే సినిమా (Sunday Cinema) సిరీస్‌లో భాగంగా ఈ శని, ఆదివారాల్లో పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్ (Paidi Jairaj Preview Theatre) వేదికగా రెండు విభిన్నమైన కార్యక్రమాలు జరుగనున్నాయి. అందులో ఒకటి స్ఫూర్తినిచ్చే చర్చ, మరొకటి మనసును కదిలించే హాలీవుడ్ క్లాసిక్ ప్రదర్శన. సినిమా కార్యక్రమాలు, చర్యలు, సినిమాలు అంటే ఇష్ట పడే వారు ఎవరైనా వీటికి హజరు కావొచ్చు. ఎలాంటి రుసుములు చెల్లించాల్సిన అవసరం లేదు. అందరికీ ప్రవేశం ఉచితం.
ఈ ప్రోగ్రాంలో భాగంగా.. ఇటీవల గ్యాంగ్‌స్టర్ అనే చిత్రానికి యాక్షన్ కొరియోగ్రాఫర్‌గా గద్దర్ సినీ పురస్కారం అందుకున్న చంద్రశేఖర్ రాథోడ్ ఈ వారపు టాక్ @ సినివారం ముఖాముఖి అతిథిగా రానున్నాడు. ఈ సందర్భంగా ఆయన తన సినీ ప్రయాణం, యాక్షన్ మాస్టరీ వెనుక ఉన్న స్టోరి, ‘గ్యాంగ్‌స్టర్’ మూవీ రూపకల్పనలో ఎదురైన సవాళ్లు, అలాగే సినిమా నిర్మాణంపై తన ఆలోచనలను ప్రేక్షకులతో పంచుకోనున్నారు. ఈ కార్యక్రమం శనివారం, ఆగస్టు 16 సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్, 2వ అంతస్తులో జరుగనుంది.
ఇక సండే సినిమాలో భాగంగా ప్రఖ్యాత హాలీవుడ్ అగ్ర దర్శక, నటుడు క్లింట్ ఈస్ట్‌వుడ్ (Clint Eastwood) 2009లో రూపొందించిన ఇన్విక్టస్ (Invictus) అనే సినిమాను ప్రదర్శించనున్నారు. రెండు గంటల 15 నిమిషాల నిడివితో ఇంగ్లీష్ స్పోర్ట్స్ డాక్యూ డ్రామాగా తెరకెక్కించిన ఈ చిత్రం క్రీడల ద్వారా దేశాన్ని ఐక్యం చేసిన ఓ రియల్ స్టోరి ఆధారంగా నిర్మించారు. ఈ మూవీ కూడా పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్, 2వ అంతస్తులో ఆగస్టు 17న ఆదివారం సాయంత్రం 6 గంటల అనంతరం ప్రదర్శించనున్నారు. ఆసక్తి ఉన్నవారు వెళ్లవచ్చు. ఎంట్రీ ఉచితం.