Vallabhaneni anil : చిత్రపురి కాలనీ ల్యాండ్ మార్క్ ప్రాజెక్టు అవుతుంది.. 

ABN , Publish Date - May 13 , 2025 | 03:24 PM

తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించిన చిత్రపురి కాలనీ (Chitrapuri colony) నూతన ప్రాజెక్ట్, భవిష్యత్ కార్యాచరణ గురించి సోమవారం జరిగిన కార్యక్రమం లో సభ్యులు వెల్లడించారు.

తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించిన చిత్రపురి కాలనీ (Chitrapuri colony) నూతన ప్రాజెక్ట్, భవిష్యత్ కార్యాచరణ గురించి సోమవారం జరిగిన కార్యక్రమం లో సభ్యులు వెల్లడించారు. త్వరలోనే భూమి పూజ ఉంటుందని అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కుమార్ వెల్లడించారు. నూతన ప్రాజెక్ట్ SAPPHIRE SUITE' కు  సంబందించిన బ్రోచర్ ను విడుదల చేసారు.
వల్లభనేని అనిల్ కుమార్ మాట్లాడుతూ "1994లో మొదటిసారి చిత్రపురి కాలనీ అనే ప్రాజెక్టు మొదలైంది. ప్రభుత్వాలు మారుతున్నాయి, అసోసియేషన్‌ అధ్యక్షులు మారుతున్నారు. అనుమతుల కోసం ప్రయత్నం చేయడంలో ఎక్కడా వెనకడుగు వేయలేదు. అయితే ఫిల్మ్‌ ఛాంబర్‌ అధ్యక్షులు భరత్‌ భూషణ్‌ కలగచేసుకున్న తర్వాతే పర్మిషన్‌ వచ్చిందని చెప్పడానికి గర్విస్తున్నాము. అయితే ఇప్పుడు రూ.166 కోట్లు అప్పులో ఉన్నాం. ఇక్కడ చాలా సమస్యలున్నాయి. వాటిని బయటకు చెప్పుకోలేం. కానీ ఎవరికీ ఇబ్బంది కలగకుండా పరిశమ్రలో కార్మికులు అందరికీ ఇళ్లు అందించాలనే ప్రయత్నంలో ఉన్నాం. ఆ తరుణంలో హైడ్రా వల్ల బఫర్‌ జోన్‌లో నాలుగున్నర ఎకరాల ల్యాండ్‌ కాస్త రెండు ఎకరాలు అయింది. అందులోనే ఇళ్లు నిర్మించి అందరికీ సర్దుబాటు చేయాలి. 166 కోట్లు అప్పు తీర్చాలి. ఇంకా 50 కోట్ల వర్క్‌ పూర్తి చేయాల్సి ఉంది. ఉన్న స్థలం ఎలా ప్లాన్‌ చేస్తే అందరికీ సర్దుబాటు చేయగలం, అప్పులు తీర్చగలం, పెండింగ్‌ వర్క్‌లు ఎలా పూర్తి చేయగలం అని అందరం కూర్చుని మాట్లాడుకుని ముందుకు వెళ్తున్నాం. ఇప్పుడు కట్టబోయే ప్రాజెక్ట్‌కు షఫైర్‌ సూట్‌ పేరుతో మొదలుపెట్టాం. పెండింగ్‌లో ఉన్నవారికి మొదటి ప్రాధాన్యత. కొత్తగా అప్లై చేసుకునేవారికి సంబంధిత అసోసియేషన్‌ నుంచి దృవీకరణ పత్రాలు తీసుకొస్తే వాటిని పరిశీలించి మెంబర్‌షిప్‌ ఇవ్వడం జరుగుతుంది. 2013లో జరిగిన ఇబ్బందులకు కూడా మమ్మల్నే బాధ్యుల్ని చేస్తున్నారు. ఇకపై ఆ సమస్యలు లేకుండా ట్రాన్స్‌ఫరెన్స్‌గా పని చేస్తున్నాం. గతంలో ప్రాజెక్ట్‌ 14 ఏళ్లు పట్టింది. ఇప్పుడు ప్రాజెక్ట్‌ మాత్రం భూమి పూజ చేసినప్పటి నుంచి 40 నెలల్లో అన్ని ఎమినిటీస్‌తో పూర్తి చేసి ఇస్తాం. ఇదొక ల్యాండ్‌ మార్క్‌ ప్రాజెక్ట్‌ అవుతుంది. ఇకపై చిత్రపురిపై ఎలాంటి అపోహలు ఉండవు’’ అని అన్నారు.


ఈ సందర్భంగా సి కళ్యాణ్ మాట్లాడుతూ "చిత్రపురి కాలనీ అనేది చక్కటి ఆలోచనతో వచ్చిన ప్రయత్నం. చిత్రపురి కాలనీ కోసం మనం ఎంతగానో కష్టపడ్డాము. ఇప్పుడు వెయిటింగ్ లో ఉన్నవారికి అలాగే కొత్త వారికి కూడా ఇప్పుడు చిత్రపురి కాలనీలో సొంత ఇల్లు రాబోతున్నాయి అనే వార్త సంతోషకరం. ఈ ప్రాజెక్టు పూర్తయితే అక్కడ ఉండే ఎన్నో వేల మంది సమస్యలు పరిష్కరింపబడతాయి. ఈ సమస్యల నుండి బయటకు వచ్చేలా సహాయపడిన చదలవాడ శ్రీనివాసరావు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. సినిమా వాళ్ళ మీద ప్రేమతో ఆయన ముందుకు వచ్చి సహాయపడ్డారు. వేలానికి వెళ్లే సమయంలో ఆయన ఆర్థికంగా నిలబడి మనకు చిత్రపురి కాలనీ వచ్చేలా చేశారు. అది మనం అదృష్టంగా భావించాలి. దీనికోసం చాంబర్ లో మీటింగ్ పెట్టి అటు సపోర్ట్ చేసేవాళ్ళు లేకుండా ఇటు ప్రశ్నించే వాళ్ళు కూడా అందరం కూర్చుని మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమం కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు" అన్నారు.

నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ "అమరావతి, చిత్రపురి కాలనీ సుమారుగా ఒకేసారి మొదలయ్యాయి. మరో మూడు సంవత్సరాలలో పూర్తవుతాయి. దీనికి ముఖ్య కారణమైన అనిల్, దామోదర్, ప్రసన్న, అజయ్  ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. వారు ఎంతో కష్టపడ్డాడు కాబట్టి వాడి తర్వాత మేము వారికి సహాయంగా నిలబడ్డాము. ఇండస్ట్రీ పెద్దలంతా ఒక తాటిపై నిలబడి ఈరోజు ఈ ప్రాజెక్టును ఇంతకు ముందుకు తీసుకుని వచ్చారు. ఈ ప్రాజెక్టు ఎంతో అద్భుతంగా ఉండబోతుంది" అన్నారు. 


కేఎల్ దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ "మన ఉద్దేశం మంచిదైతే కచ్చితంగా ఆ కార్యక్రమం విజయవంతం అవుతుంది. అదే దిశగా ఆరోజు చాంబర్లో జరిగిన మీటింగ్ లో ఉన్న సమస్యలని పోయే విధంగా మాట్లాడుకున్నాము. రాబోయే 3-4 సంవత్సరాలలో అనుకున్నది కచ్చితంగా సాధిస్తాం" అన్నారు.

.ఈ కార్యక్రమంలో భరతభూషణ్, దామోదర్ ప్రసాద్, ప్రసన్నకుమార్, అనుపమ రెడ్డి, C. కళ్యాణ్, చదలవాడ శ్రీనివాసరావు, తమ్మారెడ్డి భరద్వాజ్, వీర శంకర్, మాదాల రవి, భరద్వాజ్, అమ్మిరాజు, రాజీవ్ కనకాల, దొర, ప్రవీణ్ కుమార్ యాదవ్, లలిత, మహా నంద రెడ్డి, అలహరి, ప్రసాద్ రావు, రామకృష్ణ ప్రసాద్, రఘు బత్తుల, దీప్తి వాజపేయి, అనిత నిమ్మగడ్డ, అలాగే సినిమా యూనియన్ నాయకులు, ఆర్టిస్ట్ లు, 24 ఫ్రేమ్స్ కు సంబంధించి వారు, చిత్రపురి కాలనీ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - May 13 , 2025 | 03:24 PM