Raju Weds Rambai: ఆ ప్రేమ కథ చిత్రాల తరహాలో నిలిచిపోతుంది
ABN , Publish Date - Nov 17 , 2025 | 06:29 PM
అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా 'రాజు వెడ్స్ రాంబాయి'. డా.నాగేశ్వరరావు పూజారి సమర్పణలో డోలాముఖి సుబల్టర్న్ ఫిలింస్, మాన్ సూన్స్ టేల్స్ బ్యానర్స్ పై వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మిస్తున్నారు.
అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా 'రాజు వెడ్స్ రాంబాయి'. డా.నాగేశ్వరరావు పూజారి సమర్పణలో డోలాముఖి సుబల్టర్న్ ఫిలింస్, మాన్ సూన్స్ టేల్స్ బ్యానర్స్ పై వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మిస్తున్నారు. సాయిలు కంపాటి దర్శకత్వం వహిస్తున్నారు. నవంబర్ 21న వంశీ నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై వంశీ నందిపాటి, బన్నీ వాస్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నారు. (Raju Weds Rambai)
ఈ సందర్భంగా నిర్మాతలు వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి మాట్లాడుతూ 'ఖమ్మం, వరంగల్ జిల్లాల మధ్య జరిగిన ఓ వాస్తవ ఘటన ఆధారంగా దర్శకుడు సాయిలు ఈ సినిమాకు స్క్రిప్ట్ చేశారు. వినగానే నన్ను కలచివేసింది. పరువు హత్య, ఇంకొన్ని విధాలుగా పరువు హత్య ఘటనలు జరగడం చూశాం. కానీ ఇలాంటి దుర్మార్గం ఏ ప్రేమకథలోనూ జరగలేదు అనిపించింది. ఇది వాస్తవ ఘటన నేపథ్యంగా సాగే సినిమా అయినా దర్శకుడు మెయిన్ స్ట్రీమ్ అప్పీల్ ఉండేలా స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాడు. ఈ కథ గురించి ఈటివి విన్ కి చెప్పా. తర్వాత వంశీ నందిపాటి, బన్నీవాస్ మా మూవీతో అసోసియేట్ అయ్యారు.
ఈ సినిమా ట్రైలర్ లో అమ్మాయిపై హీరో చేయి చేసుకోవడం చూపించాం. వాస్తవ ఘటన ఆధారంగా సినిమా చేసినా, మూవీలో డ్రామా లేకుంటే ప్రేక్షకులకు సినిమాటిక్ ఫీల్ కలగదు. ఈ మూవీలో విషాధకరమైన ముగింపు ఉండదు. ఒక మంచి ఫీల్ తో థియేటర్స్ నుంచి ఆడియెన్స్ బయటకు వస్తారు. ఈ సినిమా చూసి కొందరైనా అమ్మాయిల తండ్రులు ఆమె ప్రేమ విషయంలో పాజిటివ్ గా ఆలోచిస్తారని నమ్ముతున్నాం. ఈ సినిమాలో ఎక్కడా ఈ ఘటన జరిగిన ఊరు పేరు, బాధితులైన ఆ వ్యక్తుల పేర్లు చెప్పడం లేదు.
హీరోగా అఖిల్ త్వరగానే దొరికాడు కానీ అమ్మాయి విషయంలో చాలా సెర్చ్ చేయాల్సివచ్చింది. ఇది లోకల్, రూటెడ్ స్టోరీ కాబట్టి తెలుగు అమ్మాయినే తీసుకోవాలి అనుకున్నాం. ఒక రోజు తేజస్వినీ ప్రొఫైల్ చూసి వెంటనే ఓకే చేశాం. చైతన్యను సెలెక్ట్ చేశాక తెలిసింది హీరో సిద్ధు జొన్నలగడ్డ బ్రదర్ అని. బేబి, 7జీ బృందావన్ కాలనీ, సైరత్, ప్రేమిస్తేలా 'రాజు వెడ్స్ రాంబాయి' ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది. కథ కోసం నిర్మాతగా మారాను. నిర్మాత కష్టాలు ఏంటో అప్పుడే తెలిసింది.
నేను చదివిన నవలల్లో అంటరాని వసంతం, రచయిత కేశవరెడ్డి రచనల్ని సిరీస్ లా చేస్తే బాగుంటుందనే ఆలోచన ఉంది. యూవీ సంస్థలో నా దర్శకత్వంలో మూవీ ఉంటుంది. హీరో ఎవరు అనేది వాళ్లు అనౌన్స్ చేస్తారు.
నిర్మాత రాహుల్ మోపిదేవి మాట్లాడుతూ
ఓ ప్రేమ జంట జీవితంలో జరిగిన వాస్తవ ఘటన 15 ఏళ్లుగా అక్కడే సమాధి చేయబడింది. ఆ ఘటన గురించి అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. మా డైరెక్టర్ సాయిలు అదే ప్రాంతానికి చెందినవాడు కాబట్టి, ఆ ఘటన గురించి తెలుసుకుని, ఆ నేపథ్యంతోనే మంచి డ్రామా యాడ్ చేసి అందరూ థియేట్రికల్ గా చూసేలా 'రాజు వెడ్స్ రాంబాయి' సినిమాను రూపొందించాడు. ఘటన జరిగిన ప్రాంతంలోనే సినిమా షూటింగ్ జరిపాం. రాజు క్యారెక్టర్ చేసిన అఖిల్ వరంగల్ అబ్బాయి తనకు తెలంగాణ యాస ప్రాబ్లమ్ కాదు, తేజస్వినీ ఏపీ అమ్మాయి, కానీ తెలంగాణ యాసలో డైలాగ్స్ పర్పెక్ట్ గా చెప్పింది' అన్నారు