Anil Sunkara: కథ వెనుకబడింది.. ఎందుకంటే
ABN , Publish Date - Sep 07 , 2025 | 08:51 AM
నాకు నచ్చిన కంటెంట్‌ను నమ్మి ఇకపై సినిమాలు తీస్తా. ఇతరుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసుకోవాలి. కానీ కంటెంట్‌ను మనం పూర్తిగా నమ్మాలి.
సినీ రంగంలో ఎత్తుపల్లాలు సర్వసామాన్యం. వాటిని తట్టుకొని నిలబడిన వారే ఈ రంగంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోగలుగుతారు. అలాంటి ప్రయత్నం చేస్తున్న నిర్మాతే అనిల్ సుంకర(Anil Sunkara). ‘ఏ-టీవీ’ ద్వారా వినోద రంగంలోకి అడుగుపెట్టిన అనిల్.. ఆ తర్వాత ‘14 రీల్స్’ పతాకంపై అనేక విజయవంతమైన సినిమాలను నిర్మించారు. తాజాగా ఒక వినూత్నమైన రియాలిటీ షోతో, కొత్త చిత్రాలతో సెకండ్ ఇన్నింగ్ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఆయన ‘నవ్య’తో తన అనుభవాలు పంచుకున్నారు.
మూడేళ్ల తర్వాత మళ్లీ రియాల్టీ షో ద్వారా సినీ నిర్మాణంలోకి ప్రవేశిస్తున్నారు కదా... ఎలా అనిపిస్తోంది?
బయట వాళ్లు ఏదేదో అనుకోవచ్చు. కానీ నేను ఇండస్ట్రీకి దూరంగా జరగలేదు. నాకు సినీ నిర్మాణంతో పాటు అనేక ఇతర వ్యాపారాలు ఉన్నాయి. సినీ నిర్మాణం అనేది వాటిలో పది శాతం మాత్రమే! అయితే గత మూడేళ్లుగా అన్నీ మందకొడిగా సాగాయి. దీనితో ఒడుదొడుకులు ఏర్పడ్డాయి. కానీ నేను 25 ఏళ్ల నుంచి వ్యాపారాలు చేస్తున్నాను. ఇలాంటి ఒడుదొడుకులు సహజమే!
‘భోళాశంకర్’ మీరు అనుకున్నట్లు విజయం సాధించలేదు కదా! ఆ సమయంలో మీరు ఎలా ఫీలయ్యారు?
‘కర్ణుడి చావుకు కారణాలు కోటి’ అంటారు.. అలా ‘భోళాశంకర్’ పరాజయానికి అనేక కారణాలు ఉన్నాయి. నా ఉద్దేశంలో ఈ సినిమా కొవిడ్‌కు ముందు విడుదలయితే మంచి విజయాన్ని సాధించేది. ఇది అజిత్ నటించిన ఒక తమిళ్ సినిమా. తమిళ్‌లో అది పెద్ద హిట్. అజిత్ సినీ జీవితంలో అతి ఎక్కువ కలెక్షన్లు సంపాదించింది. అందుకే ఈ సినిమాను ఎంపిక చేసుకున్నాం. కానీ కొవిడ్ వల్ల ఆ తమిళ సినిమాను ఓటీటీలలో అందరూ చూసేశారు. దానివల్ల కొంత ఆసక్తి తగ్గింది. ఇలా చెప్పుకుంటూపోతే అనేక కారణాలున్నాయి..
ఆ సినిమా పరాజయం తర్వాత మెగాస్టార్ చిరంజీవిని కలిసారా? మీ సహనిర్మాతల రియాక్షన్ ఏమిటి?
సినిమా విడుదలకు ఒక రోజు ముందు చిరంజీవి గారితో మాట్లాడాను. ‘‘మీరు బాగా అలసిపోయారు. ఒక నాలుగైదు రోజులు విశ్రాంతి తీసుకోండి. అప్పుడు అన్నీ చూసుకుందాం’’ అన్నారు. సినిమా పరాజయం తర్వాత కూడా ఆయన ఇచ్చిన మద్దతు మరచిపోలేనిది. నా దగ్గర నుంచి ఒక్క పైసా కూడా తీసుకోలేదు. ఇక సహ నిర్మాతల విషయానికి వస్తే అందరూ నాకు మద్దతుగా నిలిచారు. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే- మేమందరం ఒకరికొకరు అండగా ఉంటాం. ‘భోళాశంకర్’ విడుదలకు ముందు రోజు ఇండస్ట్రీలో అనేకమంది నిర్మాతలు మా ఆఫీసుకు వచ్చారు. అలాగే నేను కూడా ఏదైనా సినిమా విడుదల ఉంటే వాళ్ల ఆఫీసుకు వెళ్తా. ఎందుకంటే- ఒక సినిమా హిట్ అయితే ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది. మిగిలిన వాళ్ల సినిమాలు హిట్ అవుతాయి. ఇక... సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తూ ఉంటాయి. వాటిలో నిజం ఉండదు.
సినిమాతో కాకుండా రియాలిటీ షోతో మళ్లీ జర్నీ ఎందుకు మొదలుపెడుతున్నారు?
ఈ రియాలిటీ షోను కొవిడ్‌కు ముందు నుంచి డిజైన్ చేస్తున్నాము. ఇప్పుడు మంచి సమయం అనిపించింది. అంతకన్నా వేరే కారణం లేదు. ఈ షోను ప్రారంభిస్తున్నామని చెప్పగానే అనూహ్యమైన స్పందన వచ్చింది. అంత స్పందన వస్తుందని నేను అనుకోలేదు. చిత్ర నిర్మాణానికి దూరంగా ఉన్నా.
మీరు పరిశ్రమను గమనిస్తూనే ఉన్నారు కదా! ఈ మూడేళ్లలో ఏదైనా మార్పు వచ్చిందా?
ప్రతి ఏడాది పరిశ్రమ మారుతూనే ఉంటుంది. ఇది చాలా సహజం. ఇప్పుడు వీఎ్‌ఫఎక్స్‌లు ప్రవేశించాయి. కొత్త ప్రపంచాల నేపథ్యంలో సినిమాలు వస్తున్నాయి. భిన్నమైన కథలు సినిమాలు తీయాలనుకొనేవారికి ఇదొక మంచి సమయం.
మీరు మంచి సమయం అంటున్నారు.. కానీ భారీ సినిమాలు దెబ్బతింటున్నాయి. ప్రేక్షకులు థియేటర్లకు రావటం లేదని అనేకమంది చెబుతున్నారు...
దీన్ని మనం రెండు కోణాల నుంచి చూడాలి. ఒకటి- తెలుగు సినిమా పరిశ్రమ ప్రారంభం అయిన దగ్గర నుంచి సినిమాల సక్సెస్ రేట్ ఐదు నుంచి పదిశాతం మాత్రమే! అంటే వంద సినిమాలు విడుదలయితే- వాటిలో విజయం సాధించేవి పది సినిమాలు మాత్రమే! మిగిలినవన్నీ యావరేజ్‌గా వెళ్తాయి. ఇక రెండో కోణం నుంచి చూస్తే భారీ బడ్జెట్ సినిమాలు పరాజయం చెందటానికి అనేక కారణాలున్నాయి. ‘బాహుబలి’ విజయం తర్వాత అనేకమంది నిర్మాతలకు అనేక కొత్త మార్కెట్లు అందుబాటులోకి వచ్చాయి. ఓటీటీల ద్వారా అదనపు ఆదాయం లభించటం మొదలైంది. ఇలాంటి అంశాల వల్ల సినిమా బడ్జెట్లు పెరిగిపోయాయి. ఒకప్పుడు దర్శకుడు కథను ఎంపిక చేసుకొని - ఆ తర్వాత నటీనటులను ఎంపిక చేసుకొనేవాడు. నిర్మాత డబ్బులు పెట్టేవాడు. కానీ ఒక దశలో హీరో, దర్శకుడి కాంబినేషన్ కుదిరితే చాలనుకున్నాం. కథ వెనకబడిపోయింది. నేను ఎవరినీ విమర్శించటం లేదు. ఇలా చేసిన వారిలో నేను కూడా ఉన్నాను. ఎప్పుడైతే కథ సరిగ్గా కుదరదో అప్పుడు ప్రేక్షకుడు దాన్ని ఆదరించడు. చాలా సినిమాలకు జరిగింది ఇదే!
ఒక సినిమా పరాజయానికి ఇదే కారణమా?
ఇదే కాదు. ఇంకా అనేక కారణాలుంటాయి. ఉదాహరణకు సినీ నిర్మాణంలో జరిగే వృథా. అది రకరకాలుగా ఉంటుంది. దానివల్ల బడ్జెట్ విపరీతంగా పెరిగిపోతుంది. కాస్ట్ రికవరీ కాదు. ఒక ఉదాహరణ చెబుతాను. నేను తీసిన ఒక సినిమాలో క్లైమాక్స్‌లో ఒక ఊరేగింపు సీను ఉంటుంది. దాన్ని నాలుగు రోజులు తీయాలన్నారు. రోజుకు 30 లక్షల బడ్జెట్ ఇచ్చారు. మొదటి రోజు షూటింగ్ పూర్తయింది. రెండో రోజు షూటింగ్‌కు వెళ్లాను. అక్కడ చాలామంది ఖాళీగా కూర్చుని ఉన్నారు. ‘వీళ్లందరు ఖాళీగా ఎందుకున్నారు?’’ అని అడిగితే వాళ్ల షూటింగ్ కాలేదన్నారు. ఇక్కడ సమస్య ఏమిటంటే- వీళ్లందరికీ మొదటి రోజు నుంచి లెక్కపెట్టి వేతనాలు ఇవ్వాలి. ఇలాంటి వృథా వల్ల నిర్మాతకు తడిసి మోపెడు అవుతోంది. వాటిని తగ్గించుకుంటే నిర్మాణ వ్యయం నియంత్రణలోకి వస్తుంది.
అది సాధ్యమవుతుందా? కార్మికులకు వేతనాలు పెంచటానికి నిర్మాతలు అంగీకరించారు కదా...
ఈ మధ్య నిర్మాతలలో కూడా అవగాహన బాగా పెరిగింది. ఈ ఖర్చులన్నీ నియంత్రణలోకి వస్తాయనే నమ్మకం నాకుంది. అంతేకాకుండా ఏఐ వల్ల సమీప భవిష్యత్తులో అనేక మార్పులు వస్తాయి. ఉదాహరణకు ఏఐ పూర్తిగా అభివృద్ధి చెందితే సెట్స్ వల్ల అయ్యే అదనపు ఖర్చులు ఉండవు. ఇలాంటి మార్పులు చాలా వస్తాయి.
నాకు నచ్చిన కంటెంట్‌ను నమ్మి ఇకపై సినిమాలు తీస్తా. ఇతరుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసుకోవాలి. కానీ కంటెంట్‌ను మనం పూర్తిగా నమ్మాలి. ఇతరులు అభిప్రాయాల మీదనే ఆధారపడకూడదనేది నా అభిప్రాయం. అంతేకాదు... ప్రేక్షకుల అభిరుచులు మారిపోతున్నాయి. దానికి తగ్గట్టుగా మనం కూడా మారాలి. ప్రేక్షకుల అభిరుచికి తగినట్లు మన కంటెంట్ ఉంటేనే విజయం సాధిస్తాం.
ఓటీటీ వల్ల మంచే జరిగింది. అనేక భాషల్లో సినిమాలను చూసే అవకాశం ప్రేక్షకులకు లభించింది. దీనివల్ల వారి అభిరుచులు మారాయి. దానికి తగ్గట్టుగా పరిశ్రమ కూడా మారాల్సిన అవసరం ఏర్పడింది. ఈ కోణం నుంచి చూస్తే ఓటీటీ మంచి మార్పే తీసుకు వచ్చింది.