Mrunal Thakur: నా హద్దులు నాకున్నాయి.. కుటంబ విలువలే ముఖ్యం
ABN , Publish Date - Dec 28 , 2025 | 04:11 PM
నటిగా మృణాల్ ఠాకూర్ వెలుగుల వెనుక ఒక సాధారణ అమ్మాయి అసాధారణ పోరాటం ఉంది. కేవలం ఒక నటిగా మాత్రమే కాకుండా తనకంటూ కొన్ని విలువలను ఏర్పరచుకున్న ఒక వ్యక్తిత్వం ఉంది.
వరుస విజయాలు.. పాన్ ఇండియా ఇమేజ్.. కుప్పలు తెప్పలుగా వచ్చిపడుతున్న అవకాశాలతో మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) కెరీర్ జెట్ స్పీడ్‌తో దూసుకుపోతోంది. అయితే, ఈ వెలుగుల వెనుక ఒక సాధారణ అమ్మాయి అసాధారణ పోరాటం ఉంది. కేవలం ఒక నటిగా మాత్రమే కాకుండా తనకంటూ కొన్ని విలువలను ఏర్పరచుకున్న ఒక వ్యక్తిత్వం ఉంది. మృణాల్ తాజా ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణంపై ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
నేను బాలీవుడ్‌లో ఉన్నానా? సౌత్‌లో ఉన్నానా? అని ఆలోచించను. నా దృష్టిలో అది ఒక భాషా వ్యత్యాసం మాత్రమే. పని పట్ల నిబద్ధత ఉంటే ఎక్కడికైనా వెళ్లొచ్చు’’ అంటారు మృణాల్. నిజానికి దక్షిణాది సినిమాల్లో నటించాలనేది ఆమె ప్లానింగ్‌లో లేదట. కానీ, ఒక వరంలా వచ్చిన అవకాశాన్ని ఆమె రెండు చేతులా అందిపుచ్చుకున్నారు. షూటింగ్ సెట్స్‌లో ఉండటమే తనకు దక్కే అతిపెద్ద గౌరవమని భావించే ఈ నటికి పని తప్ప మరో లోకం లేదు.
2026 ప్రయోగాల సంవత్సరం
మృణాల్ కెరీర్‌లో 2026 కీలకంగా మారబోతోంది. ఇప్పటి వరకు క్లాసిక్, ఎమోషనల్ రోల్స్‌లో చూసిన మనం త్వరలో ఆమెను యాక్షన్ అవతార్‌లో చూడబోతున్నాం. ‘డెకాయిట్’ వంటి యాక్షన్ థ్రిల్లర్, ‘హై జవానీతో ఇష్క్ హోనా హై’ వంటి రొమాంటిక్ కామెడీలతో తనలోని వైవిధ్యాన్ని చాటుకోవడానికి ఆమె సిద్ధమవుతున్నారు. ‘‘ప్రస్తుతం నేను ఒక అడుగు తర్వాత మరో అడుగు వేస్తూ ఎదుగుతున్నాను. నా ప్రయాణం ఇప్పుడిప్పుడే ఊపందుకుంటోంది’’ అంటారు మృణాల్.
తిరస్కరణల నుంచి సీతమ్మ వరకు
మృణాల్ బుల్లితెరపై నటిస్తున్నప్పుడు ‘సినిమాలకు పనికిరావు’ అన్న ఎత్తిపొడుపుల నుంచి నేడు ‘సీతమ్మ’గా ఇంటింటికీ పరిచయం కావడం వరకు ఆమె ప్రయాణం స్ఫూర్తిదాయకం. ఐదు ఆడిషన్లలో తిరస్కారానికి గురైనా కుంగిపోకుండా ‘రిజెక్షన్ అనేది మనల్ని మరో గొప్ప మార్గంవైపు నడిపిస్తుంది’’ అని నమ్మారు. అందుకే ‘సీతారామం’ కోసం తెలుగు నేర్చుకుని, ఆ పాత్రలో జీవించారు. తెలుగు ప్రేక్షకులు నేటికీ తనను ఒక పరాయి నటిగా కాకుండా ‘సీతగారూ’ అని పిలుస్తుంటే ఎంతో ఆనందంగా ఉందంటారు మృణాల్.
నో చెప్పే ధైర్యం
గ్లామర్ ప్రపంచంలో ఉంటూనే తనకంటూ కొన్ని గీతలు గీసుకున్నారు మృణాల్. తల్లిదండ్రులు ఇబ్బంది పడతారని ముద్దు సీన్ల కారణంగా కొన్ని పెద్ద సినిమాలను వదులుకున్నారు. ‘‘దీనివల్ల నా కెరీర్ నెమ్మదించినా పర్లేదు. కుటుంబ విలువలే నాకు ముఖ్యం’’ అని నిక్కచ్చిగా చెప్పే మృణాల్ అంటే పరిశ్రమలో ఎందరికో ఇష్టం.
అదొక జ్ఞాపకాల మ్యూజియం
చాలామంది నటీనటుల్లా సోషల్ మీడియా కోసం మృణాల్‌కు ప్రత్యేకంగా ఒక టీం ఉండదు. తన ఫొటోలు తనే పోస్ట్ చేస్తారు. ‘‘ఇతరుల కోసం నేను పోస్ట్ చేయను. నా కోసం నేను చేసుకుంటాను. నా ఇన్‌స్టాగ్రామ్ పేజీ నా జ్ఞాపకాల మ్యూజియం లాంటిది’’ అని చెప్పడం ఆమె నిజాయితీకి నిదర్శనం. మొటిమలు ఉన్న ముఖాన్ని చూపించడానికి కూడా ఆమె వెనుకాడరు. పర్ఫెక్షన్ అనేది ఒక అబద్ధమని, సహజంగా ఉండటమే నిజమైన అందమని మృణాల్ నమ్మకం. స్టార్‌డమ్ అనేది శాశ్వతం కాదని, ఈ రోజు మనం ఉన్న పొజిషన్ రేపు మరొకరికి దక్కుతుందని మృణాల్‌కు తెలుసు. అందుకే ఆమె ఎప్పుడూ వినయంగా ఉంటారు. సినిమా టెక్నికల్ విషయాలను నేర్చుకుంటూ ఒక నిరంతర విద్యార్థిలా సాగిపోతున్న ఆమె ప్రయాణం ఎందరికో ఆదర్శం.