Krish Jagarlamudi: శీలావతి.. బాధితురాలు.. నేరస్తురాలు.. ఒక లెజెండ్
ABN , Publish Date - Aug 31 , 2025 | 11:02 AM
నా సినిమాల్లో ‘గమ్యం’ ఒక వ్యక్తి కథ. ‘వేదం’ ఒక సమాజం కథ. ‘కృష్టం వందే జగద్గురుం’ అన్నం ముద్దలాంటి సమాజం మెతుకులుగా విడిపోతుంటే తీసిన కథ. అన్ని యుద్ధాలనూ ఆపివేయటానికి ఒక యుద్ధం చాలని ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ చెబుతుంది.
‘గమ్యం, కంచె, కృష్ణం వందే జగద్గురుం, గౌతమిపుత్ర శాతకర్ణి’ వంటి విజయవంతమైన చిత్రాల ద్వారా తెలుగువారికి దర్శకుడు క్రిష్ జాగర్లమూడి సుపరిచితుడు. తాజాగా ఆయన తీసిన ‘ఘాటి’ సినిమా వచ్చే వారం విడుదల కానుంది. ఆంధ్రా- ఒడిశా సరిహద్దులో జరిగే గంజాయి రవాణా ఇతివృత్తంగా రూపొందించిన ఈ సినిమాలో అనుష్కా ప్రధానమైన పాత్ర పోషిస్తున్నారు. దర్శకుడిగా తన ప్రస్థానం గురించి.. ‘ఘాటి’ గురించి ‘నవ్య’కు క్రిష్ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
‘ఘాటి’ వెనకున్న కథ..
‘ఘాటి’ అనేది సంస్కృతంలో ‘ఘట్ట’ అనే పదం నుంచి పుట్టింది. ‘ఘాటి’ అనే కొండల్లో ఉండే లోతైన దారి అని అర్ధం. ఆంధ్రా- ఒడిశా సరిహద్దుల్లోని కొండల్లో జరిగే కథ ఇది. ఈ కొండల అంచుల్లో చాలా గ్రామాలు ఉంటాయి. ఇక్కడ ‘శీలావతి’ అనే ప్రత్యేకమైన గంజాయి లభ్యమవుతుంది. దీనికి ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. ఏటా వేల కోట్ల రూపాయల గంజాయి ఇక్కడ నుంచి అనేక ప్రాంతాలకు సరఫరా అవుతుంది. ఈ గ్రామాల్లో నివసించేవారే దీన్ని సరఫరా చేస్తారు. వీరి పూర్వీకులు బ్రిటిష్ వారి సమయంలో కొండల్లో రోడ్లు వేసేవారు. ఎంత ఎత్తయిన కొండనైనా సునాయాసంగా ఎక్కగలుగుతారు. వీరికి ఆ కొండల ఆనుపానులన్నీ తెలుసు. వీరిని ‘ఘాటీలు’ అని కూడా పిలుస్తారు. ఒక్కొక్క ఘాటి 100 నుంచి 150 కేజీల గంజాయిని భుజం మీద మోస్తారు. ఈ నేపథ్యంలోని కథ కాబట్టి దీనికి ‘ఘాటి’ అని పేరు పెట్టాం.
కథకు మూలం..
కొవిడ్‌కు ముందు రచయిత చింతకింద శ్రీనివాసరావుగారు నాకు ఈ కథ చెప్పారు. నాకు చాలా నచ్చింది. ఎందుకంటే గంజాయి ఒక సామాజిక సమస్య. మీరు గమనిస్తే నా సినిమాల ఇతివృత్తాలన్నీ ఆయా కాలాల పరిస్థితులపై ఆధారపడి ఉంటాయి. గంజాయి అనేది ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న పెద్ద సమస్య కాబట్టి దీనిపై సినిమా తీయాలనుకున్నా. అంతే కాకుండా స్వీటీ (అనుష్కా)తో నేను ఒక సినిమా చేయాల్సి ఉంది. అప్పుడప్పుడు తను... ‘సరోజ 2 చేద్దామా’ అని సరదాగా అడుగుతూ ఉండేది. ఈ కథ విన్నప్పుడు దానిలో శీలావతి పాత్రకు అనుష్కా అతికినట్లు సరిపోతుందనిపించింది. మేము యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై రెండు సినిమాలు తీయాలనుకున్నాం. రాజీవ్‌రెడ్డి గారికి, మా నాన్న జాగర్లమూడి సాయిబాబాగారికి ఈ కథ చెప్పినప్పుడు- వారిద్దరికీ కథ బాగా నచ్చింది. దాంతో స్ర్కిప్ట్‌వర్క్ ప్రారంభించాను.
అందుకే అనుష్క...
ఈ కథలో శీలావతి ఒక అద్భుతమైన పాత్ర. తను చల్లగా వీచే కొండగాలి లాంటిది. కానీ అవసరమైనప్పుడు తానే కొండగా మారుతుంది. ఒక అందమైన జీవితాన్ని జీవించే శీలావతి... ముందు బాధితురాలిగా మారుతుంది. ఆ తర్వాత తానే ఒక నేరస్తురాలు అవుతుంది. ఆ నేరస్తురాలు ఒక లెజెండ్‌గా మారుతుంది. ఈ పరిణామక్రమానికి అనుష్కా మాత్రమే న్యాయం చేయగలదనిపించింది. వాస్తవ జీవితంలో కూడా ఆమె మృదు స్వభావి. మంచి మనిషి. అదే సమయంలో అవసరమైనప్పుడు చాలా దృఢంగా కూడా ఉంటుంది. అందుకే ఆమెను ఎంచుకొన్నాను.
ఎవరూ చూడని, చెప్పని ప్రపంచం
నేను స్వతహాగా కథకుడిని. మనుషుల కథను చెప్పటం నాకు ఇష్టం. ‘వీరమల్లు’ అయిన తర్వాత ‘ఘాటి’ తీద్దామనుకున్నాను. కానీ షెడ్యూల్స్ మారిపోవటంవల్ల ‘వీరమల్లు’ పూర్తి చేయలేకపోయాను. ‘ఘాటి’ కథ అప్పటికే నా దగ్గర ఉంది. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. నా ప్రతి సినిమాలోనూ పాత్రలు కొత్తగా ఉంటాయి. ప్రతి పాత్రకూ ఒక జర్నీ ఉంటుంది. దానిని పట్టుకుంటే అద్భుతమైన పాత్ర ఆవిష్కృతమవుతుంది. ‘ఘాటి’ విషయానికి వస్తే... అదొక ప్రపంచం. ఇప్పటిదాకా ఎవరూ చూడని, చెప్పని ప్రపంచం. దీనిలో శీలావతిగా అనుష్కా, దేశిరాజుగా విక్రమ్ ప్రభు, విశ్వదీప్ అనే పోలీస్ అధికారిగా జగపతిబాబు కనిపిస్తారు. కుందుల నాయుడు, కుష్టాల నాయుడు అనే ప్రతికూల పాత్రలు ఉంటాయి. ఈ పాత్రలన్నింటిలోనూ పొరలు పొరలుగా కోణాలుంటాయి. ఇవన్నీ ఒక దాని తర్వాత ఒకటి బయటకు వస్తుంటే చాలా ఎక్సైటింగ్‌గా అనిపిస్తుంది.
నిజమైన లొకేషన్లే ఇష్టం
నా ఉద్దేశంలో వీఎఫ్ఎక్స్ అంటే సినిమాకు మేకప్ వేయటం. నేను అవసరమైనప్పుడే వీఎఫ్ఎక్స్‌లు ఉపయోగిస్తాను. ఈ సినిమాలో చాలా తక్కువ వాడాం. వీలైనంత వరకు నిజమైన లొకేషన్లలోనే షూటింగ్ చేయటానికి ఇష్టపడతా! ‘కంచె, గౌతమిపుత్ర శాతకర్ణి’ వంటి సినిమాల్లో కూడా యుద్ధాలకు నిజమైన లొకేషన్లే వాడాను.
అంతఃచక్షువులతో చూసి
నాకు రాయటం చాలా ఇష్టం. ఏదైనా కథ రాసేటప్పుడు కలిగే తృప్తి భిన్నంగా ఉంటుంది. కొన్నిసార్లు ఎంత ప్రయత్నించినా ఏమీ రాయలేం. కష్టపడి.. కష్టపడి రాయాల్సి వస్తుంది. ఇలా ఈ రాసే ప్రక్రియ పూర్తయ్యేలోగా... మొత్తం సినిమాను ముందుగానే చూసేస్తాం. దర్శకుడు అంతఃచక్షువులతో చూసి ప్రేక్షకులకు బాహ్యచక్షువులతో చూపిస్తాడు.
నా చూట్టు ఉన్న పరిస్థితులను గమనిస్తూ..
నేను మానవ జాతిని ప్రేమిస్తాను. ఈ ప్రకృతిలో మనిషి ఒక అద్భుతం. మానవ సమాజం ఒక అద్భుతం. ఇలాంటి మనిషి కథ చెప్పటం నాకు ఇష్టం. సమాజం పతనావస్థకు వెళ్లిపోయిందనుకున్న ప్రతిసారీ... ఆ సమాజం మరింత బలమైన పునాదులతో పైకి వెళ్తూ ఉంటుంది. మానవ పరిణామక్రమంలో దీనిని మన స్పష్టంగా చూడవచ్చు. వృత్తిపరంగా నేను దర్శకుడిని కాబట్టి నా చుట్టూ ఉన్న పరిస్థితులను గమనిస్తూ ఉంటా. వాటిలో కొన్ని నాకు తెలియకుండా మెదడులో పూసలుగా చేరిపోతాయి. అవసరమైనప్పుడు ఈ పూసలన్నీ దండగా మారి బయటకు వస్తాయి. కథలో కూర్చుంటాయి.
ఎవరూ ఎవరికీ పోటీ కాదు..
సుమారు 17 సంవత్సరాల క్రితం నేను సినీ రంగంలోకి ప్రవేశించా. నాకు నచ్చిన కథలను చెప్పటానికి ‘సినిమా’ అనే మాధ్యమాన్ని ఎంచుకున్నా. నేను చెప్పే కథలకు కావాల్సిన నటీనటులను, బడ్జెట్‌ను ఎంచుకొని- అందరికీ నచ్చేటట్లు కథ చెప్పటానికి ప్రయత్నిస్తున్నా. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి. నా ఉద్దేశంలో ఇక్కడ ఎవరూ ఎవరికీ పోటీ కాదు. ఒక్కొక్కరిదీ ఒకో శైలి. ఒక జర్నీ. చలం... రావిశాస్త్రి, శ్రీపాద సుబ్రమణ్యశాస్త్రి, విశ్వనాథ... ఈ రచయితల్లో ఎవరు గొప్ప అని అడిగితే ఎలా చెప్పగలం?
నా సినిమాల్లో ‘గమ్యం’ ఒక వ్యక్తి కథ. ‘వేదం’ ఒక సమాజం కథ. ‘కృష్టం వందే జగద్గురుం’ అన్నం ముద్దలాంటి సమాజం మెతుకులుగా విడిపోతుంటే తీసిన కథ. అన్ని యుద్ధాలనూ ఆపివేయటానికి ఒక యుద్ధం చాలని ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ చెబుతుంది.
‘ఘాటి’లో దేశరాజు పాత్రకు విక్రమ్ ప్రభునే కావాలనుకున్నా. తన కళ్లలో ఒక బాధ కనిపిస్తుంది. అదే సమయంలో ఒక శక్తి కూడా ఉంటుంది. ఈ పాత్రకు డబ్బింగ్ కూడా ఆయనే చెప్పారు.
గంజాయి అనేది సామాజిక సమస్య. చిన్న పిల్లలు ఈ భూతం బారిన పడుతున్నారు. జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.