Mrunal Thakur: ఊహించని ఆ సంఘటన నన్ను ఎంతో బాధించింది

ABN , Publish Date - Jun 01 , 2025 | 10:40 AM

‘సీతారామం’లో సీతగా, ‘హాయ్‌ నాన్న’లో యష్నగా, ‘ఫ్యామిలీస్టార్‌’లో ఇందూగా తెలుగు ప్రేక్షకుల హృదయాలు కొల్లగొట్టింది మృణాల్‌ ఠాకూర్‌.

‘సీతారామం’(Sitaramam)లో సీతగా, ‘హాయ్‌ నాన్న’లో (Hi Nanna) యష్నగా, ‘ఫ్యామిలీస్టార్‌’లో ఇందూగా తెలుగు ప్రేక్షకుల హృదయాలు కొల్లగొట్టింది మృణాల్‌ ఠాకూర్‌ (mrunal Thakur). ప్రస్తుతం తెలుగులో ‘డెకాయిట్‌’తో పాటు, బాలీవుడ్‌లోనూ వరుస చిత్రాలతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ తన గురించి పంచుకున్న తాజా కబుర్లివి...

వాటిపైనే పెట్టుబడి

నేను ఈవెంట్ల కోసం వేసుకునే డ్రెస్సులన్నీ ఫ్యాషన్‌ డిజైనర్లు ఇచ్చేవే. నిజానికి దుస్తుల కోసం నేను ఎక్కువ డబ్బులు ఖర్చు చేయను. ఇప్పటివరకు నేను కొన్నవాటిల్లో ఖరీదైన డ్రెస్‌ ధర రూ. 2 వేలు మాత్రమే అంటే నమ్ముతారా? లక్షలు పోసి దుస్తులు కొని, వాటిని బీరువాలో దాచుకోవడం వల్ల ఉపయోగమేమీ ఉండదు. బ్రాండెడ్‌ దుస్తుల మోజులో పడి డబ్బులు వృథా చేయడం నాకు అస్సలు నచ్చదు. అందుకే ఇళ్లు, భూమిపై పెట్టుబడి పెడతా.

అవమానంగా ఫీలయ్యా...

ఇటీవల నేనొక అవార్డు ఫంక్షన్‌కి హాజరయ్యా. అక్కడకి అడుగుపెట్టానో లేదో.. మీడియా వాళ్లంతా చుట్టిముట్టి, ప్రశ్నలు సంధించారు. అన్నింటికీ ఓపిగ్గా సమాధానాలిస్తున్నా. ఇంతలో జాన్వీ కపూర్‌ అక్కడకు వచ్చింది. అంతే... నన్ను వదిలేసి అంతా జాన్వీ దగ్గరకు పరుగెత్తారు. ఊహించని ఆ సంఘటన నన్ను ఎంతో బాధించింది. అవమానంగా ఫీలయ్యా. పరిశ్రమలో వారసత్వానికి ఉన్న ప్రాధాన్యత నాలా కష్టపడి పైకొచ్చిన వాళ్లకు ఉండదనిపించింది.


Mrunal.jpg

వాళ్లతో పనిచేయాలనుంది

ఇప్పటికే తెలుగు, హిందీ, మరాఠీ భాషల్లో నటించాను. తమిళ, మలయాళ, ఇంగ్లీషు, స్పానిష్‌ చిత్రాల్లో కూడా నటించి నన్ను నేను సరికొత్తగా ఆవిష్కరించుకోవాలని అనుకుంటున్నా. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడానికి నన్ను ప్రేరేపించిన దర్శకులందరితోనూ కలిసి పనిచేయాలనుంది. సంజయ్‌లీలా భనాల్సీ, ఇంతియాజ్‌ అలీ, అనురాగ్‌ కశ్యప్‌ వంటి నా అభిమాన దర్శకుల సినిమాల్లో నటించే అవకాశం కోసం ఎదురుచూస్తున్నా.

]మొట్టమొదటి అమ్మాయిని...

నాకు కార్లు అంటే పిచ్చి. చిన్నప్పుడు మా బంధువుల కారు చూడగానే, ఎక్కి కూర్చోవాలని అత్యుత్సాహం చూపా. అందుకు మా అమ్మ ఒప్పుకోలేదు. అనుమతి లేకుండా వేరే వాళ్ల కారు ఎక్కితే, వాళ్లు తప్పుగా భావిస్తారని నాకు సర్ది చెప్పింది. ఆ క్షణమే నిర్ణయించుకున్నా.. నా కష్టార్జితంతో కొన్న కారే ఎక్కాలని. మా ఫ్యామిలీలో మెర్సిడెస్‌ కొన్న మొట్టమొదటి అమ్మాయిని నేనే అని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది.

ఆమే స్ఫూర్తి

నటి విద్యాబాలన్‌ నాకు స్ఫూర్తి. సినిమాల్లో ఆమె పాత్రల ఎంపిక నన్ను అడుగడుగునా ప్రేరేపిస్తుంది. సవాలుతో కూడిన పాత్రల్ని ఎంచుకున్నప్పుడే ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోతాం. ఆమె అలాంటి ఛాలెంజింగ్‌ పాత్రల్నే ఎంచుకుంటారు. నా గ్రాఫ్‌ కూడా అలాగే దూసుకెళ్లాలని ఆశిస్తున్నా. ఆమెతో కలిసి స్ర్కీన్‌ షేర్‌ చేసుకునే అవకాశం కోసం ఎదురుచూస్తున్నా.

Mrunal-2.jpg

అందుకే బ్రేకప్‌ గురించి చెప్పా

గతంలో చాలామంది నటీనటులు వ్యక్తిగత విషయాల గురించి చెప్పడానికి సంకోచించేవారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారాయి. ఇప్పుడు తారలు రిలేషన్‌షిప్‌ గురించి ఓపెన్‌గా మాట్లాడుతున్నారు. నేనూ ఇంతకుముందు నా ప్రేమ, బ్రేకప్‌ గురించి చాలా సందర్భాల్లో బయటపెట్టాను. ఎందుకంటే... వాటిని అందరితో పంచుకుంటేనే, మన నుంచి ఇతరులు ఏదో ఒకటి నేర్చుకుంటారు. అందుకే ధైర్యంగా చెప్పేశా.

సాదాసీదాగా జీవిస్తే...

ఒక సెలబ్రిటీగా ఉంటే ఈ ప్రపంచం నిన్ను ప్రేమిస్తుంది. నీ వర్క్‌తో సమాజంలో మార్పు తీసుకురావచ్చు. ఇక ఇబ్బందులు గురించి చెప్పాలంటే.. కుటుంబానికి దూరంగా వేర్వేరు ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంటుంది. అవసరమైనప్పుడు కుటుంబసభ్యుల పక్కన ఉండలేం. కొన్నిసార్లు నాకు కూడా సాధారణ జీవితాన్ని గడపాలనిపిస్తుంది. ఇరవై ఏళ్లకే పెళ్లి చేసుకుని, పిల్లల్ని కనేసి, భర్తతో కలసి చక్కగా వారానికోసారి రెస్టారెంట్‌కి వెళ్లి, జీవితాన్ని సరదాగా గడిపేయొచ్చు కదా అని అప్పుడప్పుడు అనిపిస్తుంది.

Updated Date - Jun 01 , 2025 | 10:45 AM