AM Rathnam: ఆలోచన కలిగించే విజయవంతమైన సినిమా

ABN , Publish Date - Jul 19 , 2025 | 05:15 PM

ఖుషి, బంగారం చిత్రాల తర్వాత పవన్‌కల్యాణ్‌తో చేస్తున్న చిత్రమిది. మా కలయికలో ఇది మూడో సినిమానే కావచ్చు.. కానీ మా ఇద్దరి మధ్య 25 ఏళ్ల అనుబంధం ఉంది.

'ఖుషి, బంగారం చిత్రాల తర్వాత పవన్‌కల్యాణ్‌తో చేస్తున్న చిత్రమిది. మా కలయికలో ఇది మూడో సినిమానే కావచ్చు.. కానీ మా ఇద్దరి మధ్య 25 ఏళ్ల అనుబంధం ఉంది. నటుడిగా కంటే మంచి ఆశయాలున్న వ్యక్తిగా ఆయనంటే నాకెంతో ఇష్టం. నేనున్నా ఆయనకు ఎంతో గౌరవం. 90 శాతం సక్సెస్‌ రేటున్న నిర్మాతగా చెబుతున్న ఈ చిత్రం ప్రేక్షకుల్ని అలరిస్తుంది’’ అని నిర్మాత ఎ.ఎం.రత్నం అన్నారు. పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘హరిహర వీరమల్లు’. నిధీ అగర్వాల్‌ కథానాయిక. కొంత భాగం క్రిష్‌ దర్శకత్వం వహించగా, మిగతా భాగాన్ని జ్యోతికృష్ణ తెరకెక్కించారు. ఈ నెల 24న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత ఎ.ఎం.రత్నం మీడియాతో మాట్లాడారు. ఆ విషయాలు..


17వ శతాబ్దం నేపథ్యంలో జరిగే కథ ఇది. బయట ప్రచారం జరుగుతున్నట్టుగా ఇది నిజ జీవిత కథ కాదు. ఓ కల్పిత పాత్రను తీసుకొని, దాని చుట్టూ కథ అల్లుకోవడం జరిగింది. హరి హర వీరమల్లు పేరు పెట్టడానికి కారణం ఏంటంటే.. హరి హర అంటే విష్ణువు, శివుడు కలయిక. అలాగే వీరుడిని సూచించేలా వీరమల్లు అని పెట్టాము. 

సెట్స్- గ్రాఫిక్స్ తో ముడిపడిన కథ
 నేను 'భారతీయుడు' సహా ఎన్నో భారీ చిత్రాలను నిర్మించాను. అయితే నా సినీ జీవితంలో ఇంత సుదీర్ఘ ప్రయాణం చేసిన సినిమా ఇదే. దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అయితే ఇది పవన్ కళ్యాణ్ గారు డేట్స్ ఇచ్చినంత మాత్రాన వెంటనే పూర్తి చేయగలిగే సాధారణ చిత్రం కాదు. అత్యంత భారీ చిత్రం. సెట్స్, గ్రాఫిక్స్ తో ముడిపడిన చారిత్రక కథ. అందుకే ఆలస్యమైంది. బాగా ఆలస్యమవవడంతో సినిమా ఎలా ఉంటుందోననే అనుమానాలు కొందరు వ్యక్తం చేశారు. అయితే ట్రైలర్ తో అందరి అనుమానాలు పటాపంచలు అయ్యాయి. మొదట రెండు భాగాలని అనుకోలేదు. సినిమా అనేది వినోదంతో పాటు, సందేశాన్ని అందించాలనేది నా భావన. నేను రూపొందించిన ఎక్కువ శాతం సినిమాలు అలాగే ఉంటాయి. వీరమల్లు అనేది చారిత్రక నేపథ్యమున్న కథ. ఇలాంటి గొప్ప కథలో సందేశం ఉంటే.. ఎక్కువ మందికి చేరువ అవుతుందని భావించాము. అలా చర్చల్లో కథ స్పాన్ పెరిగింది. నేను నిర్మించిన సినిమాల్లో 90 శాతానికి పైగా విజయం సాధించాయి. ఆ అనుభవంతో చెప్తున్నాను.. హరి హర వీరమల్లు ఘన విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది.  జూలై 24 తెల్లవారుజాము నుంచి షోలు వేయాలని మేము భావించాము. కానీ అభిమానులు ముందురోజు రాత్రి నుంచే షోలు వేయాలని కోరుతున్నారు. వారి కోరిక మేరకు జూలై 23 రాత్రి నుంచి షోలు వేసే ఆలోచనలో ఉన్నాము.



STILL_9.jpgపవన్ ఆలోచన విధానం చూసి ఆశ్చర్యపోయా..
ఖుషి, బంగారం తర్వాత పవన్ కళ్యాణ్ గారితో చేసిన మూడో చిత్రమిది. పేరుకి మూడు సినిమాలే కానీ.. మా మధ్య 25 సంవత్సరాల అనుబంధం ఉంది. పవన్ కళ్యాణ్ గారిని దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా.. ఓ నటుడిగా కంటే కూడా మంచి ఆశయాలున్న మనిషిగా ఆయన నాకు ఎక్కువ ఇష్టం. సమాజం గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటారు. ఖుషి సమయంలో ఆయన ఆలోచన విధానం చూసి ఆశ్చర్యపోయాను. అది ప్రేమ కథా చిత్రం అయినప్పటికీ.. ఓ సన్నివేశంలో రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, లాలా లజపత్ రాయ్ వంటి గొప్ప వ్యక్తుల పేర్లు చెప్పారు. అలాగే ఒక పాటలో దేశభక్తిని చాటుకున్నారు. సినిమాల్లో చూపించే ఇలాంటి విషయాలు ఎందరికో స్ఫూర్తిని కలిగిస్తాయి. హరి హర వీరమల్లు కూడా విజయవంతమైన చిత్రంగా నిలవడమే కాకుండా, ప్రేక్షకుల్లో ఆలోచన కలిగిస్తుంది.

ఒత్తిడి ఉంది.. కానీ.. 

పవన్ కళ్యాణ్ నాయకుడిగా ఎదిగారు. ఆయన సినిమా వస్తుందంటే దేశ వ్యాప్తంగా దృష్టి ఉంటుంది. 
కాబట్టి ఒత్తిడి ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఆ ఒత్తిడిని మేము బాధ్యతగా భావించి, మరింత శ్రద్ధగా సినిమాని రూపొందించాము. పవన్ కళ్యాణ్ గారి గౌరవానికి తగ్గట్టుగా సినిమా ఉంటుంది. అలాగే పవన్ గారి అభిమానులతో పాటు, దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను.. ఈ సినిమా మెప్పిస్తుందనే నమ్మకం ఉంది. 

HHVM.jpg

ఆయన సహకారం లేకుండా ఎలా సాధ్యం.. 

పవన్ కళ్యాణ్ గారి సహకారం లేకుండా ఇంత భారీ చిత్రాన్ని రూపొందించడం సాధ్యం కాదు. పవన్ గారంటే నాకెంత ఇష్టమో.. అలాగే నేనంటే కూడా ఆయనకి ఇష్టం. మేకర్ గా నన్ను గౌరవిస్తారు. పవన్ గారు పూర్తి సహకారం అందించారు కాబట్టే.. ఈ సినిమా ఇంత గొప్పగా తీయగలిగాము. అలాగే టీం అందరూ ఎంతో సహకరించారు. అందరం కలిసి ఎంతో కష్టపడి ఈ సినిమాని పూర్తి చేశాము.

పవన్ ప్రశంసించారు.. 
మా అబ్బాయి అని చెప్పడం కాదు కానీ, జ్యోతికృష్ణ దర్శకత్వ ప్రతిభ చూసి ఆశ్చర్యపోయాను. మేమందరం చూడని ఓ కొత్త కోణంలో ఈ కథని చూశాడు. మన చరిత్రను ముడిపెడుతూ ఈ తరానికి చేరువయ్యేలా.. ఇండియన్ జోన్స్ తరహాలో సినిమాని గొప్పగా మలిచాడు. సాంకేతికంగా కూడా ఎంతో ఉన్నతంగా ఆలోచించాడు. జ్యోతి కృష్ణ పనితీరు చూసి పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రశంసించారు.

Updated Date - Jul 19 , 2025 | 05:17 PM