Shiva 4K - Chiranjeevi: చిరంజీవి శుభాకాంక్షలు.. ఆర్‌జీవీ క్షమాపణ
ABN , Publish Date - Nov 09 , 2025 | 01:51 PM
మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ క్షమాపణ తెలిపారు. వర్మ తొలి చిత్రం ‘శివ’ రీ రిలీజ్ నేపథ్యంలో శుభాకాంక్షలు చెబుతూ చిరంజీవి ఓ వీడియో విడుదల చేశారు.
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ (Rgv) క్షమాపణ తెలిపారు. వర్మ తొలి చిత్రం ‘శివ’ రీ రిలీజ్ (Shiva Re Release) నేపథ్యంలో శుభాకాంక్షలు చెబుతూ చిరంజీవి ఓ వీడియో విడుదల చేశారు. దానికి కృతజ్ఞతలు చెప్పిన వర్మ క్షమాపణలు కూడా కోరారు. ‘శివ’ చిత్రం ఎంతటి ప్రభావం చూపిందో చిరంజీవి ఆ వీడియోలో వెల్లడించారు. సంబంధిత వీడియోను రామ్‌గోపాల్ వర్మ ఎక్స్‌లో షేర్ చేశారు. ‘థాంక్స్ చిరంజీవి గారు. అలాగే అనుకోకుండా, ఎప్పుడైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉంటే ఈ సందర్భంగా క్షమాపణలు కోరుతున్నా. మీ విశాల హృదయంతో మా టీమ్‌ని విష్ చేసింనందుకు కృతజ్ఞతలు’ అని ట్వీట్ చేశారు. అయితే వర్మ చిరంజీవికి సారీ ఎందుకు చెప్పారన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. పలు సందర్భాల్లో పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేసి చిరంజీవిపై కూడా మాటలతూటాలు వదిలాడు వర్మ. అది కూడా ఓ కారణమని నెటిజన్లు భావిస్తున్నారు.
అయితే వీడియోలో చిరంజీవి ఏమన్నారంటే.. ‘శివ’ సినిమా చూసి ఆశ్చర్యపోయా. అది సినిమా కాదు ఓ విప్లవం, ఒక ట్రెండ్ సెట్టర్. తెలుగు సినిమాకి కొత్త నిర్వచనం ఇచ్చి, కొత్త వరవడికి నాంది పలికిన సినిమా. హీరో సైకిల్ చైన్ లాగే సీన్ ఎప్పటికీ మరిచిపోలేనిది. అదొక కల్ట్ షాట్‌గా నిలిచిపోయింది. నాగార్జున యాక్టింగ్ ఫెంటాస్టిక్, పాత్ర, అతని కళ్లల్లో తీవ్రత అద్భుతం. అమల, రఘువరన్.. ఇలా ప్రతి ఒక్కరూ తమ తమ పాత్రలకు ప్రాణం పోశారు. ఈ చిత్రాన్ని మరోస?రి ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తుండటం మంచి ప్రయత్నం. ఈ సినిమా విషయంలో రామ్‌గోపాల్ వర్మ విజన్ గురించి ముఖ్యంగా చెప్పుకోవాలి. కెమెరా యాంగిల్స్, లైట్స్ అండ్ సౌండ్స్ వావ్ అనిపించాయి. ఈ యువ దర్శకుడు తెలుగు సినిమా భవిష్యత్తు అని అప్పుడే నాకు అనిపించింది. హ్యాట్సాఫ్ రామ్‌గోపాల్ వర్మ. తెలుగు సినిమా ఉన్నంత కాలం శివ చిత్రం చిరంజీవిలా చిరస్మరణీయంగా ఉంటుంది. చిత్ర బృందానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు’ అని చిరంజీవి అన్నారు.
నాగార్జున, అమల జంటగా రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కించిన ఈ సినిమా 36 ఏళ్ల తర్వాత మళ్లీ వెండితెరపై సందడి చేయనుంది. ఈ నెల 14న ఈ చిత్రాన్ని 4కె, డాల్బీ అట్మాస్ వెర్షన్‌లో రిలీజ్ చేస్తున్నారు.