Chiranjeevi: పరిశ్రమ మనిషిగా ఇక్కడికి వచ్చాను.. గ్లోబల్ సమ్మిట్ లో చిరంజీవి
ABN , Publish Date - Dec 09 , 2025 | 10:04 PM
యువతను ఎంటర్టైన్మెంట్ వైపు మళ్ళిస్తే వ్యసనాలకు దూరం అయ్యే అవకాశం ఉందని మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తెలిపారు.
Chiranjeevi: యువతను ఎంటర్టైన్మెంట్ వైపు మళ్ళిస్తే వ్యసనాలకు దూరం అయ్యే అవకాశం ఉందని మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆధ్వర్యంలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఈవెంట్ ఘనంగా జరిగిన విషయం తెల్సిందే. ఈ ఈవెంట్ కి ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, అల్లు అరవింద్, సురేష్ బాబు, దిల్ రాజు, నటులు జెనీలియా, అక్కినేని అమల, పలువురు టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు.
ఇక ఈ సమ్మిట్ లో చిరంజీవి మాట్లాడుతూ.. ' తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కి రావడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. గ్లోబల్ సమ్మిట్ కి ఎలాగైనా రావాలని, రేవంత్ రెడ్డి నా దగ్గరికి మంత్రులు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబును పంపించారు. అప్పుడు నేను ఏ పొజిషన్ లో ఉన్నానో తెలుసా.. అన్నపూర్ణ స్టూడియోలో ఎవరో ఒక అమ్మాయితో డ్యాన్స్ చేస్తూ ఉన్నాను. నాకే ఏదోలా అనిపించింది. ఇదొక గొప్ప సమ్మిట్.. తెలంగాణ రైజింగ్ అనేది ఒక కొత్త ఇనిషియేటివ్. చాలా ఆనందంతో ఇక్కడికి వచ్చాను. హైదరాబాద్ ను గ్లోబల్ ఫిలింహబ్ గా చేయాలని సీఎం రేవంత్ రెడ్డి రెండేళ్ల కిందటే చెప్పారు. ఈ సమ్మిట్ చూసిన తర్వాత సీఎం అనుకున్నది సాధిస్తారనే నమ్మకం వచ్చింది.
చిరంజీవిని ఒక్కడినే ఇక్కడ కూర్చోబెట్టారని ఎవరు అనుకోవద్దు. సినిమా సొసైటీ తెలిసిన వ్యక్తిగా నన్ను ఆహ్వానించారు. పరిశ్రమ మనిషిగా ఇక్కడికి వచ్చాను. అన్ని రకాల సెక్టార్లను ఫ్యూచర్ సిటీకి ఆహ్వానించడం రేవంత్ రెడ్డి ఒక్కడికే సాధ్యమైంది. తెలంగాణలో అన్ని వనరులు ఉన్నాయి. స్కిల్ డెవలప్మెంట్ చేస్తే సినిమా రంగంలో చాలామంది పనిచేయడానికి ముందుకు వస్తారు.
ప్రపంచానికి హైదరాబాద్ ని సినిమా హబ్ గా మార్చేందుకు మేమంతా రేవంత్ రెడ్డి వెంట ఉంటాం. యువతను ఎంటర్టైన్మెంట్ వైపు మళ్ళిస్తే వ్యసనాలకు దూరం అయ్యే అవకాశం ఉంది. మౌలిక వసతులు కల్పిస్తే సినిమా ఇండస్ట్రీ గ్లోబల్ హబ్ గా మారుతుంది. ప్రపంచం మొత్తం హైదరాబాద్ వైపు చూసేలా మేము సహకరిస్తాం. కొరియా , జపాన్ ప్రభుత్వాలు మూవీ యానిమేషన్ విషయంలో చొరవ చూపించాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా ఆ పని చేస్తోంది. దానికి చాలా సంతోషంగా ఉంది' అని చెప్పుకొచ్చారు.