Chiranjeevi Promise: అప్పుడు జోక్యం చేసుకుంటా
ABN , Publish Date - Aug 06 , 2025 | 02:39 AM
టాలీవుడ్ నిర్మాతలు మెగాస్టార్ చిరంజీవిని మంగళవారం కలిశారు. ప్రస్తుతం పరిశ్రమలో నెలకొన్న పరిస్థితులను..
టాలీవుడ్ నిర్మాతలు మెగాస్టార్ చిరంజీవిని మంగళవారం కలిశారు. ప్రస్తుతం పరిశ్రమలో నెలకొన్న పరిస్థితులను.. ఫెడరేషన్ సభ్యులు షూటింగ్‌లను బంద్ చేయడం వల్ల తలెత్తిన సమస్యలను వివరించారు. ఈ సమావేశంలో నిర్మాతలు చిరంజీవితో చర్చించిన విషయాలను, ఆయన స్పందనను మీడియాతో సి.కల్యాణ్ పంచుకున్నారు. ‘‘నిర్మాతలమందరం కలసి ప్రస్తుతం పరిశ్రమలో తలెత్తిన సమస్యను చిరంజీవికి వివరించాం. ‘ఈ విధంగా షూటింగ్స్ ఆగిపోవడం బాధాకరం. నిర్మాతల వెర్షన్‌ను విన్నాను. ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యుల వాదనలు కూడా విని తెలుసుకుంటాను. మరో రెండు మూడు రోజుల్లో పరిస్థితులు సద్దుమణుగుతాయేమో చూస్తాను. అప్పటికీ ఏ మార్పూ లేకుంటే నేను కలుగజేసుకుంటా’ అని చిరంజీవి చెప్పారు’ అని సి.కల్యాణ్ పేర్కొన్నారు.
ఐటీ ఉద్యోగుల కంటే వారికే వేతనాలెక్కువ: ప్రసన్నకుమార్
ఫిల్మ్ ఫెడరేషన్ వేతన పెంపుపై నిర్మాతల మండలి సెక్రటరీ ప్రసన్నకుమార్ స్పందించారు. ‘ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులతో మూవీ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు చర్చించారు. ఛాంబర్‌తోనే ‘మా’ ముందుకు వెళ్తుందని తెలిపారు. పేద సినీ కార్మికులకు మేం ఎప్పుడూ అండగా ఉంటాము. ఐటీ ఉద్యోగుల కన్నా యూనియన్ కార్మికులకు జీతాలెక్కువ. మా కార్మికులతోనే పనిచేయాలి అని యూనియన్ వాళ్లు చెప్పడం తప్పు’ అని ప్రసన్నకుమార్ అన్నారు.
సినీ కార్మికుడు రోజుకు 15 గంటలు పనిచేస్తాడు: వల్లభనేని అనిల్
‘యూనియన్ సభ్యులు కానివారితోనూ ఇకపై టాలీవుడ్ నిర్మాతలు పనిచేయించుకోవచ్చు’ అని ఫిల్మ్ ఛాంబర్ తీసుకున్న నిర్ణయంపై ఎంప్లాయిస్ ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ స్పందించారు. ‘సినీ కార్మికుల్లో స్కిల్ లేకుంటే అంతర్జాతీయ స్థాయి సినిమాలు వచ్చేవా? ఇప్పుడేమో కార్మికులు వద్దు, కొత్తవారిని తీసుకువస్తామంటున్నారు. వేతన పెంపును ముందునుంచి అడుగుతూనే ఉన్నాం. సడన్‌గా బంద్ అని ఎప్పుడూ అనలేదు. అయినా, మేము అడిగినంత ఇచ్చేందుకు కొందరు నిర్మాతలు ముందుకు వచ్చారు. బయటివారికంటే సినీ కార్మికులకు జీతాలెక్కువ అని అంటున్నారు. కానీ సినీ కార్మికుడు రోజుకు దాదాపు 15 గంటలు పనిచేస్తాడు. కార్మికుల వేతన సమస్యలపై చర్చిండానికి లేబర్ కమిషనర్ అదనపు కమిషనర్ గంగాధర్‌ను కలిశాం. ప్రొడ్యూసర్ కౌన్సిల్‌తో చర్చిస్తామని ఆయన తెలిపారు. రేపటితో సినిమా ఇండస్ట్రీలో నెలకొన్న సందిగ్ధతలు తొలగిపోతాయి అని ఆశిస్తున్నాం’ అని పేర్కొన్నారు.
కార్మికులకు జీతాలు పెంచాలి: కోమటిరెడ్డి వెంకటరెడ్డి
సినీ కార్మికుల వేతన పెంపు విషయంలో కార్మికులకు మద్దతు పలికారు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ‘కార్మికులకు జీతాలు పెంచాలి. ఢిల్లీ పర్యటన తర్వాత కార్మికులతో నేను మాట్లాడుతాను. ఈ అంశాలని దిల్‌రాజుకు అప్పగించాం. కార్మికుల డిమాండ్లపై చర్చించి నిర్ణయం తీసుకోవాలి’ అని పేర్కొన్నారు.