Blood Donation Camp: అందుకే దేనికీ స్పందించను
ABN , Publish Date - Aug 07 , 2025 | 05:47 AM
‘మనల్ని ఎవరైనా మాటలు అంటే మన మంచే వారికి సమాధానం చెబుతుంది. అందుకే నేను దేనికీ స్పందించను. మంచి చేసుకుంటూ వెళ్తాను. నాలాగా మంచి చేసే నా తమ్ముళ్లకు సాయంగా ఉంటాను...
‘మనల్ని ఎవరైనా మాటలు అంటే మన మంచే వారికి సమాధానం చెబుతుంది. అందుకే నేను దేనికీ స్పందించను. మంచి చేసుకుంటూ వెళ్తాను. నాలాగా మంచి చేసే నా తమ్ముళ్లకు సాయంగా ఉంటాను’ అని అన్నారు మెగాస్టార్ చిరంజీవి. 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఫీనిక్స్ ఫౌండేషన్, చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హీరో తేజా సజ్జా, హీరోయిన్ సంయుక్త అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ ‘నేను కొన్ని రోజులుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నాను. ఈ మధ్య ఓ నాయకుడు నన్ను అకారణంగా మాటలు అన్నాడు. ఆ తర్వాత ఆయన ఓ ప్రాంతానికి వెళ్తే.. అక్కడ ఓ మహిళ ఆయనకు ఎదురు తిరిగింది. ‘చిరంజీవి అన్నని మాటలు అనాలని మీకు ఎందుకు అనిపించింది’ అంటూ భావోద్వేగానికి గురైంది. ఆ వీడియో చూసి ఆమె గురించి వివరాలు కనుక్కున్నాను. ఒకప్పుడు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా ఆమె బిడ్డ ప్రాణాలు నిలిచాయని, అందుకే నేనంటే ఆమెకు గౌరవమని తెలిపింది. ఆ మాటలు విని నా హృదయం ఉప్పొంగింది. ఇలాంటి కార్యక్రమాలు ఎవరు చేసినా, ఎప్పుడు చేసినా నన్ను పిలవండి. నేను మీకు అందుబాటులో ఉంటాను’ అని అన్నారు. కార్యక్రమంలో ఫీనిక్స్ గ్రూప్ చైర్మన్ సురేశ్ చుక్కపల్లి తదితరులు మాట్లాడారు.