Vishwambhara: చిరుతో మౌనిరాయ్ చిందులు
ABN , Publish Date - Jul 25 , 2025 | 06:59 PM
టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ 'విశ్వంభర'. ఆరు నెలల కిందే సినీ అభిమానుల ముందుకు రావాల్సి ఉన్నా అనుకోని కారణాలతో ఆలస్యమైంది. సరైన అప్డేట్స్ లేక ఆందోళనగా ఉన్న మెగా ఫ్యాన్స్ కు ఇప్పుడు అదిరిపోయే న్యూస్ ఒకటి బయటకు వచ్చింది.
టాలీవుడ్ మోస్ట్ అవెయిటెడ్ మూవీల్లో ఇప్పుడు 'విశ్వంభర' (Vishwambhara) కూడా ఒకటి. లెజెండరీ యాక్టర్ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు వశిష్ఠ (Vassishta) కాంబినేషన్లో తెరకెక్కిస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. పైగా ఫాంటసీ చిత్రం కావడంతో మెగా ఫ్యాన్స్ ఓ రేంజ్ లో అంచనాలు పెట్టుకున్నారు. స్టోరీ విషయంలో రకరకాల వార్తలు వినిపిస్తున్న తరుణంలో వశిష్ఠ ఆ రూమర్లకు చెక్ పెట్టి అభిమానుల్లో సంతోషాన్ని నింపాడు. బ్రహ్మాదేవుడు ఉండే సత్యలోకాన్ని ఆడియెన్స్ కు పరిచయం చేయబోతున్నట్లు తెలిపి, ప్రాజెక్ట్ పై హైప్ క్రియేట్ చేశాడు. ఈ క్రేజీ అప్ డేట్ తో ఆనందంలో మునిగి తేలుతున్న అభిమానులకు మరో అదిరిపోయే న్యూస్ పూనకాలు తెప్పిస్తోంది.
మొన్నటి వరకు అనిల్ రావిపూడి సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్న చిరంజీవి కేరళ నుండి వచ్చి రాగానే, 'విశ్వంభర' సెట్ లో అడుగుపెట్టారు. హైదరాబాద్ లో వేసిన భారీ సెట్ లో చిరు, బాలీవుడ్ బ్యూటీ మౌనిరాయ్ (Mouni Roy) పై మేకర్స్ స్పెషల్ సాంగ్ ను షూట్ చేశారు. నాలుగు రోజుల పాటు ఈ పాట షూట్ జరిగింది. ఇదో రీమేక్ సాంగ్ అనే ప్రచారం ఆ మధ్య వరకూ సాగింది. అయితే ఇది ఫ్రెష్ సాంగ్ అని తెలుస్తోంది. హిందీ బెల్డ్ లో నాగినిగా మౌనీరాయ్ కు మంచి గుర్తింపు ఉంది. ఇక చిరంజీవి కెరీర్ ప్రారంభంలోనే 'పున్నమి నాగు' మూవీ చేశారు. అంతే కాకుండా 'ఖైదీ'తో నాగిని డాన్స్ తో అదర గొట్టారు. ఇప్పుడు 'విశ్వంభర' సాంగ్ కోసం చిరు, మౌని రాయ్ జత కట్టడంతో నాగిని బ్యూటీతో పున్నమి నాగు స్టెప్పులు ఎలా ఉంటాయోనని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ పాటను వందమంది డాన్సర్ల పై గణేష్ ఆచార్య (Ganesh Acharya) కొరియోగ్రాఫ్ చేశారు. ఈ సినిమాకు ఎం. ఎం. కీరవాణి సంగీతం అందిస్తుండగా, ఇప్పుడు చిత్రీకరించిన ప్రత్యేక గీతానికి భీమ్స్ సిసిరోలియో హై-ఎనర్జీ డ్యాన్ నంబర్ ను కంపోజ్ చేశారు. దీనిని కాసర్ల శ్యామ్ రాశారు. ఈ పాట గురించి నిర్మాతలు మాట్లాడుతూ, 'చిరంజీవి డ్యాన్స్ ఫ్లోర్‌లో తన సిగ్నేచర్ గ్రేస్ తో అదరగొట్టారు. మంచి డ్యాన్సర్ అయిన మౌని రాయ్ తనదైన స్పార్క్ ని యాడ్ చేశారు. గ్రాండ్ స్కేల్ లో ఉన్న ఈ పాట విజువల్ వండర్ గా ఉండబోతోంది' అని తెలిపారు.
భారీ బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్ (UV Creations) పతాకంపై విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్న 'విశ్వంభర' మూవీ నిజానికి ఈ యేడాది సంక్రాంతికి విడుదల కావాల్సింది. అయితే గ్రాఫిక్స్ వర్క్ వల్ల ఆలస్యమైంది. దీంతో సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. సినిమా కథ విషయానికి వస్తే ఇందులో చిరంజీవి ఒక ధీరోదాత్తమైన పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, రామ రామ సాంగ్ ప్రాజెక్టుపై హైప్ క్రియేట్ చేశాయి.