Chiranjeevi Exclusive: సురేఖ అన్న మాటకు.. ఉపాసనను అక్కడ వదిలేయ్‌ అన్నా...

ABN, Publish Date - May 17 , 2025 | 11:53 PM

ఇటీవల లండన్‌లోని మేడమ్‌ తుస్సాడ్స్‌ మ్యూజియంలో గ్లోబల్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తన అనుభూతులను మెగాస్టార్‌ చిరంజీవి ‘నవ్య’తో ప్రత్యేకంగా పంచుకున్నారు..

ఇటీవల లండన్‌లోని మేడమ్‌ తుస్సాడ్స్‌ (Madame tussauds) మ్యూజియంలో గ్లోబల్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ (Ram Charan) మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తన అనుభూతులను మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi)‘నవ్య’తో ప్రత్యేకంగా పంచుకున్నారు..

‘‘నేను 1983లో మోకాలి ఆపరేషన్‌ కోసం లండన్‌ వెళ్లాను. అప్పటికి ఇంకా చరణ్‌ పుట్టలేదు. ఆపరేషన్‌ జరిగే ముందు నేను, సురేఖ లండన్‌లో కొన్ని ఆసక్తికరమైన ప్రాంతాలు చూడాలనుకున్నాం. వాటిలో ‘మేడమ్‌ తుస్సాడ్స్‌ మ్యూజియం’ కూడా ఒకటి. ప్రపంచంలో లబ్ధప్రతిష్టులైనవారి మైనపు బొమ్మలను తొలిసారి నేను అక్కడ చూశాను. అవన్నీ జీవం ఉట్టిపడుతున్నాయి. సినీ రంగంలో నాకు అత్యంత ఇష్టమైన చార్లీ చాప్లిన్‌, నేను స్ఫూర్తిగా భావించే గాంధీజీ, అప్పటి భారత ప్రధాని ఇందిరా గాంధీ... ఇలా అనేకమంది విగ్రహాలను చూసినప్పుడు చరిత్ర నా కళ్లముందు వచ్చి నిలిచినట్లు అనిపించింది. వారెవ్వరినీ నేను ప్రత్యక్షంగా చూడలేదు. కానీ వారి మైనపు విగ్రహాలను చూస్తే కాలం వెనక్కి తిరిగి... ‘వారు నా ముందుకు వచ్చి నిలబడ్డారా?’ అనేటంత సజీవంగా ఉన్నాయి. గాంధీజీ, ఇందిరాగాంధీ, చార్లీ చాప్లిన్‌ల విగ్రహాల ముందు నేను, సురేఖ ఫోటోలు తీసుకున్నాం. ఆ సమయంలో నాకు గుర్తున్నంత వరకు తుస్సాడ్స్‌ మ్యూజియంలో భారతీయుల విగ్రహాలు గాంధీ, ఇందిరాగాంధీలవి మాత్రమే ఉండేవి. ‘వీరు చాలా అదృష్టవంతులు కదా! పూర్వజన్మ సుకృతం చేసుకోవటంవల్లే వాళ్లందరూ ఆ మ్యూజియంలో ఉన్నారు. మనల్ని బ్రిటిష్‌వారు 200 ఏళ్లు పాలించారు. తర్వాత వదిలేయాల్సి వచ్చింది.. వాస్తవానికి తమను వెళ్లగొట్టినందుకు బ్రిటిష్‌ వారికి గాంధీగారి మీద విపరీతమైన కోపం ఉండాలి. కానీ బ్రిటిష్‌ వారి రాజధానిలో ఆయన విగ్రహం పెట్టుకోక తప్పలేదు’ అనుకున్నాను. ఆయన విగ్రహం చూసి నాకు చాలా గర్వంగా కూడా అనిపించింది. ఆ మ్యూజియంను చూడటం మాకు మరపురాని అనుభవం. మన దేశానికి తిరిగి వచ్చిన తర్వాత స్నేహితులు, బంధువులు అందరూ ఆ ఫొటోలను చాలా ముచ్చటగా చూశారు. ఆ తర్వాత మేడమ్‌ తుస్సాడ్స్‌ మ్యూజియం బ్రాంచీలను హాలీవుడ్‌లో, దుబాయ్‌లో, సింగపూర్‌లో పెట్టారనే వార్తలు వింటూనే ఉన్నాను.

క్వీన్‌ ఎలిజబెత్‌ తరువాత చరణే...

ఒక రోజు చరణ్‌ వచ్చి– తుస్సాడ్స్‌లో తన బొమ్మ పెట్టాలనే ప్రతిపాదన వచ్చిందని చెప్పాడు. నాకు 1983 నాటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి. నా బొమ్మే ఆ మ్యూజియంలో పెడుతున్నారన్నంత ఆనందం కలిగింది. సురేఖలో కనిపించిన సంతోషాన్ని వర్ణించలేను. ‘‘అప్పుడు మనం ఫోటోలు తీయించుకున్నాం గుర్తుందా? ఆ సమయంలో చరణ్‌ నీ కడుపులో కూడా పడలేదు. అప్పుడు మనకు ఒక పిల్లాడు పుడతాడని, వాడికి 35 ఏళ్లు వచ్చే సరికి తుస్సాడ్స్‌లో విగ్రహం పెడతారని అనుకున్నామా? ఇదంతా అద్భుతమనిపిస్తోంది. ఈసారి మనం అక్కడకు వెళ్లి చరణ్‌తో ఫొటో తీయించుకుందాం’’ అని తనతో అన్నాను. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి. 1983 తర్వాత బాలీవుడ్‌, టాలీవుడ్‌కు చెందిన కొందరు నటుల విగ్రహాలు దుబాయ్‌లో, సింగపూర్‌లలో పెట్టారు. వారిలో చరణ్‌ సహనటులు కూడా కొందరున్నారు. కానీ చరణ్‌ విగ్రహం విషయంలో ఒక ప్రత్యేకత ఉంది. చరణ్‌ దగ్గరకు విగ్రహ ప్రతిపాదన వచ్చినప్పుడు– తన కుక్క అయిన రైమ్‌ విగ్రహం కూడా ఉండాలని ఒక షరతు పెట్టాడు. ఇప్పటిదాకా క్వీన్‌ ఎలిజిబిత్‌తో పాటు ఆవిడ పెంపుడు కుక్క విగ్రహం మాత్రమే పెట్టారు. అంటే తుస్సాడ్స్‌లో ఈ తరహా విగ్రహం పెట్టడం ఈ మ్యూజియం చరిత్రలో ఇది రెండోసారి. వాస్తవానికి ఇలా విగ్రహం పెట్టాలంటే మామూలు కన్నా ఎక్కువ ఖర్చు అవుతుంది. దానికి కూడా వారు అంగీకరించారు. సందర్భం వచ్చింది కాబట్టి ఇక్కడో విషయం చెప్పాలి. తుస్సాడ్స్‌ మ్యూజియంలో విగ్రహాలకు జీవం ఉండదు కానీ ఆ బొమ్మలకు అమర్చేవన్నీ నిజమైనవే అయి ఉంటాయి. ఉదాహరణకు రైమ్‌ మైనపు విగ్రహంపై బొచ్చు అంతా నిజమైనదే! ఒకో వెంట్రుక తీసుకొని దాన్ని ఆ విగ్రహానికి జాగ్రత్తగా అమర్చారు.


చరణ్‌కు ఎలాంటి ఫీలింగ్‌ ఉందో ఇంకా తెలీదు

ఈ విగ్రహం ఆవిష్కరణకు లండన్‌కు రమ్మని ఆహ్వానం వచ్చినప్పుడు ‘పుత్రోత్సాహము తండ్రికి... పుత్రుడు జన్మించినపుడె పుట్టదు, జనులా పుత్రుని గనుగొని పొగడగ పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ’ అనే పద్యం గుర్తుకొచ్చింది. చాలా గర్వంగా అనిపించింది. ఇక విగ్రహాన్ని చూసినప్పుడు ఎందుకో తెలియదు కానీ నా కళ్లు చెమర్చాయి. కొడుకులు లబ్ధప్రతిష్టులు అయినప్పుడు బహుశా గర్వంతో తండ్రులకు అలాంటి భావనే కలుగుతుందేమో! సురేఖ తన కొడుకు విగ్రహాన్ని మురిపెంగా చూసుకుంటూ ఉండిపోయింది. వచ్చేటప్పుడు... ‘‘అచ్చంగా చరణ్‌లాగే ఉన్నాడు. మనం వెళ్లిపోతే వాడు ఒంటరిగా ఉండిపోతున్నాడండి. వాడి ఆలనాపాలన ఎవరు చూసుకుంటారు?’’ అంది. ‘‘ఉపాసనను అక్కడ వదిలి వచ్చేయ్‌’’ అని సరదాగా నవ్వుతూ అన్నాను కానీ కొడుకు విగ్రహాన్ని చూసినా తల్లికి అంత ప్రేమ కలుగుతుందా? అనిపించింది. నా జీవితంలో నేను సాధించిన విజయాల్లో అక్కడ చరణ్‌ విగ్రహం పెట్టడం కూడా ఒకటని కచ్చితంగా చెప్పగలను. ఇక ఈ విగ్రహాన్ని చూసి క్లింకారకు ఇద్దరు నాన్నలు ఎలా ఉన్నారో అర్థం కాలేదు. మేము ఎంత ఆపినా వినకుండా విగ్రహాంవైపు వెళ్లిపోయింది. రైమ్‌కు తనలాంటిదే మరొక జీవి వచ్చిందనుకొని– విగ్రహాన్ని నాకడం మొదలుపెట్టింది. మొత్తంగా చూస్తే– ఉత్సుకత అంతా ఉపాసనది, క్లింకారది. ఎమోషనల్‌ జర్నీ అంతా సురేఖది. ఇక చరణ్‌కు ఎలాంటి ఫీలింగ్‌ ఉందో మాకు ఇంకా తెలీదు. సాధారణంగా ఏ విషయంపైనైనా తన ఎక్సైట్‌మెంట్‌ బయటకు కనిపించదు. బహుశా తనకు నా పోలికే వచ్చిందనుకుంటా! గతంలో నా ఫ్రెండ్స్‌– ‘‘మీ సినిమా సూపర్‌ హిట్‌ అయింది. మీకు ఉత్సాహంగా ఉండదా? హుషారు ఉండదా?’’ అని అడుగుతూ ఉండేవారు. ‘‘నాది ప్రసవ వేదన లాంటిది. కష్టపడి అలసిపోతాం కదా! అప్పుడు వచ్చే విజయం ఆనందంగానే ఉంటుంది. కానీ అది అలసట వల్ల బయటకు కనిపించదు’’ అనేవాడిని. చరణ్‌కు కూడా అదే వచ్చిందనుకుంటా! చివరగా... ఈ విగ్రహం గురించి ఆలోచిస్తున్నప్పుడు ‘అది శాశ్వతంగా ఉండిపోతుంది కదా.. భవిష్యత్‌ తరాల వారికి కూడా చరణ్‌ విగ్రహం ద్వారానే నా జ్ఞాపకాలు అందుతాయి కదా! ఎంతైనా వాడు నాకు ఒక ఎక్స్‌టెన్షన్‌ కదా’

అనిపిస్తోంది.

ఆ జ్ఞాపకాలను వెలికి తీసేవి విగ్రహాలే!

‘గత తరంవారు ఏం సాధించారు?’ అనే విషయాన్ని చెప్పటానికి, స్ఫూర్తి పొందటానికి విగ్రహాలు అవసరం. కొన్నిసార్లు కాల ప్రవాహంలో, చరిత్రలో కొందరు మరుగున పడిపోతూ ఉంటారు. అలాంటివారి జ్ఞాపకాలను వెలికి తీసేవి విగ్రహాలే! ప్రస్తుతతరం వారు వెనక్కి తిరిగి చూసుకోవటానికి, భవిష్యత్‌ తరంవారు తమ వారసత్వం గురించి తెలుసుకోవటానికి విగ్రహాల అవసరం ఉందనేది నా అభిప్రాయం!

Updated Date - May 18 , 2025 | 12:00 AM