Chiranjeevi: ఎఫ్ఎన్ సీసీలో ఘనంగా మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు
ABN , Publish Date - Aug 22 , 2025 | 06:47 PM
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) 70వ జన్మదిన వేడుకలు ఫిలింనగర్ కల్చరల్ (FNCC) సెంటర్ లో ఘనంగా జరిగాయి.
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) 70వ జన్మదిన వేడుకలు ఫిలింనగర్ కల్చరల్ (FNCC) సెంటర్ లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ప్రొడ్యూసర్స్ అశ్వనీదత్, ఎఫ్ ఎన్ సీసీ అధ్యక్షుడు కేఎస్ రామారావు, దర్శకుడు బి.గోపాల్, ఫిలింనగర్ హౌసింగ్ సొసైటీ సెక్రటరీ మరియు ఫిలింనగర్ కల్చర్ సెంటర్ కమిటీ మెంబర్ కాజా సూర్యనారాయణ, నిర్మాత డా. కె. వెంకటేశ్వరరావు, జెమినీ కిరణ్, ఏడిద రాజా, ఎఫ్ఎన్ సీసీ సెక్రటరీ తుమ్మల రంగారావు, ట్రెజరర్ శైలజ, కమిటీ మెంబర్స్ కాజా సూర్యనారాయణ, ఏడిద రాజా బాలరాజు, వరప్రసాద్ తో పాటు ఏడి ద శ్రీరామ్, సురేష్ కొండేటి, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పలు సూపర్ హిట్ చిత్రాల్లోని మెగాస్టార్ ఫొటోస్ తో కూడిన ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు. ఈ ఫొటోస్ స్కెచెస్ ను విజయవాడకు చెందిన ఆర్టిస్ట్ బాలకృష్ణ, ఆయన కుటుంబ సభ్యులు డిజైన్ చేశారు.
నిర్మాత అశ్వనీదత్ మాట్లాడుతూ 'చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు. చిరంజీవి గారి ఫొటోస్ తో కూడిన గ్యాలరీ చూస్తుంటే ఒళ్లు జలదరిస్తోంది. ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినందుకు ఎఫ్ఎన్ సీసీ వారిని అభినందిస్తున్నా' అన్నారు.
నిర్మాత కేఎస్ రామారావు మాట్లాడుతూ 'విజయవాడకు చెందిన ఆర్టిస్టు బాలకృష్ణ గారు, ఆయన కుటుంబ సభ్యులు కలిసి చిరంజీవి గారు నటించిన దాదాపు 160 సినిమాల్లోని స్కెచెస్ పెన్సిల్స్ తో వేశారు. అవన్నీ ఇక్కడ ఎగ్జిబిషన్ లో ప్రదర్శనలో ఉంచడం సంతోషంగా ఉంది. మెగాస్టార్ చిరంజీవి గారి ఇంట్లో ఈ స్కెచెస్ అన్నీ అమర్చితే బాగుంటుంది. ఈ కార్యక్రమానికి వచ్చిన అశ్వనీదత్ గారికి, బి గోపాల్ గారికి..మిగతా ఆహుతులు అందరికీ కృతజ్ఞతలు చెబుతున్నా' అన్నారు.
దర్శకుడు బి.గోపాల్ మాట్లాడుతూ 'చిరంజీవి బ్రహ్మాండంగా ఉండాలి, మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటున్నా. ఈ రోజు కేఎస్ రామారావు గారు, ఇతర సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చిరంజీవి గారి ఫొటో ఎగ్జిబిషన్ చాలా బాగుంది. ఈ ఫొటోస్ గీసిన బాలకృష్ణ గారు, ఆయన కూతురు సాయి శ్రీకి నా శుభాకాంక్షలు చెబుతున్నా' అన్నారు.
నిర్మాత డా.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ - ఎఫ్ఎన్ సీసీ ఆధ్వర్యంలో మెగాస్టార్ చిరంజీవి గారి ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం హ్యాపీగా ఉంది. చిరంజీవి గారి కుటుంబ సభ్యుడిగా ఈ ఫొటోస్ చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని మా కేఎస్ రామారావు గారు, ఇతర కమిటీ సభ్యులు ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతలు చెబుతున్నా. ఆర్టిస్ట్ బాలకృష్ణ గారు, ఆయన కూతురు ఎంతో కష్టపడి ఇన్ని ఫొటోస్ స్కెచ్ లు గీశారు. వారికి నా అభినందనలు తెలియజేస్తున్నా' అన్నారు.