Megastar Chiranjeevi: అలా చూస్తుంటే హీరోలా ఫీలయ్యేవాడిని
ABN , Publish Date - Jan 06 , 2025 | 08:40 AM
"కొన్ని సమావేశాలకు మొక్కుబడిగా వెళ్తాం. కానీ, ఇలాంటి చోటకి వచ్చినప్పుడు నా కుటుంబ సభ్యులతో ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. ప్రతి ఒక్కరిలోనూ నాపై, తెలుగుపై, దేశంపై ఉన్న అభిమానం కనిపిస్తోంది. ఇలాంటి కార్యక్రమలు నిర్వహించాలంటే ధైర్యం కావాలి. మీ అందరినీ ఉత్సాహపరిచేందుకే ఇక్కడకు వచ్చా’’ అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు
"కొన్ని సమావేశాలకు మొక్కుబడిగా వెళ్తాం. కానీ, ఇలాంటి చోటకి వచ్చినప్పుడు నా కుటుంబ సభ్యులతో ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. ప్రతి ఒక్కరిలోనూ నాపై, తెలుగుపై, దేశంపై ఉన్న అభిమానం కనిపిస్తోంది. ఇలాంటి కార్యక్రమలు నిర్వహించాలంటే ధైర్యం కావాలి. మీ అందరినీ ఉత్సాహపరిచేందుకే ఇక్కడకు వచ్చా’’ అని మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) అన్నారు. అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్(ఆప్త) ఆధ్వర్యంలో హైటెక్స్‌లో నిర్వహించిన ‘క్యాటలిస్ట్ గ్లోబల్ బిజినెస్ కాన్ఫరెన్స్-2025’కు (APTA's Global Business Conference Katalyst) ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ వేదికపై అలనాటి సంగతులు గుర్తు చేసుకున్నారు. అన్నారు. తన ఫొటోలు పట్టుకుని అవకాశాల కోసం ఏ సినిమా ఆఫీసు చుట్టూ తిరగలేదని, నటనా శిక్షణ పూర్తికాకముందే ఛాన్స్‌లు వచ్చాయని చెప్పారు. ఆయన మాట్లాడుతూ ‘ఈ వాతావరణం ఎంతో ఉత్సాహాన్ని ఇస్తోంది. మిమ్మల్ని చూస్తుంటే ‘ఆప్త’ సభ్యులు కాదు నా ఆప్తులు అనిపిస్తోంది. యువ ఆంత్రపెన్యూర్ల గురించి మీరు మాట్లాడినప్పుడు.. ‘దానికి స్పెల్లింగ్ కూడా తెలియదు, ఏం మాట్లాడాలి’ అని అనుకున్నా. మరోవైపు, నేను అభివృద్థిలోకి రావడానికి ఈ ఆంత్రపెన్యూర్‌షిప్ గురించి నిపుణులు చెప్పే అంశాలు స్వతహాగా నేర్చుకున్నానేమో అనిపించింది. వాటివల్లే ఈ స్థాయికి వచ్చానేమో. ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చుకుని ఎలా ఎదుగుతూ వచ్చానో మీతో పంచుకుంటున్నా. మీ బిజినెస్ మైండ్‌కు తగ్గట్టు దాన్ని అన్వయించుకోవచ్చు’’ (Chiranjeevi Memories)
‘‘ఇప్పటి వరకూ ఎక్కడా పంచుకోని కొన్ని విషయాలు చెబుతా. 8వ తరగతి చదివే సమయంలోనే ఏదో సాధించాలని ఉండేది. ఆటపై మనసు పడింది. ఓ సారి బ్యాడ్మింటన్ ఆడుతుంటే కంటికి గాయమైంది. తర్వాత ఆ గేమ్ ఆడలేదు. వాలీబాల్ ఆడుతుంటే చేతి వేళ్లు వంగిపోయాయి. దాంతో ఆ ఆటంటే భయమేసింది. క్రికెట్ ఆడే సమయంలో చేతి బొటన వేలు వాచిపోయింది. ఆటలు మనకు సెట్ కాదు అనుకుని ఎన్‌సీసీలో చేరా. బీకాం చదివే రోజుల్లో పెటీ ఆఫీసర్, క్యాడెట్ కెప్టెన్, సీనియర్ క్యాడెట్ కెప్టెన్ అయ్యా. నాటి ప్రధాని ఇందిరాగాంధీ, రాష్ట్రపతి ముందు సైన్యంతో కలిసి కవాతు చేస్తూ ఇది కదా మనకు కావాల్సింది అనుకున్నా. ఎన్‌సీసీలో ఏదో సాధించిన నాకు.. తర్వాత ఏం చేయాలో అర్థంకాలేదు. సబ్ లెఫ్టినెంట్‌గానో, లెఫ్టినెంట్‌గానో కాదు ఇంకేదో చేయాలని నిర్ణయించుకున్నా. కాలేజీ రోజుల్లో ప్రదర్శించిన ‘రాజీనామా’ నాటకానికిగానూ నాకు అవార్డు వచ్చింది. ఆ తర్వాత అందరూ నన్ను ప్రత్యేకించి చూస్తుంటే హీరోలా ఫీలయ్యేవాడిని. ముఖ్యంగా అందమైన అమ్మాయిలు చూస్తుంటే ఇంకా ఖుషీగా అనిపించేది (నవ్వుతూ). ప్రోత్సాహంగా ఉండేది. నటనే కెరీర్ అయితే ఎలా ఉంటుందనే ఆలోచన అప్పుడే పుట్టింది. సినిమాలని చూడడంపై దృష్టి పెట్టా. డిగ్రీ తర్వాత ఏంటని నాన్నతో చర్చ జరిగినప్పుడు మద్రాసు వెళ్లి నటుడిని అవుతానని చెప్పా. సినిమాపై మక్కువ ఉన్న నాన్న.. వెళ్లొచ్చుగానీ ఎవరూ తెలియని చోటికి వెళ్లి రాణించగలవా? అన్నారు. రాణిస్తానని నమ్మకంగా చెప్పా. నేరుగా ఇండస్ట్రీలో అవకాశాలు రావని గ్రహించి.. నటనలో శిక్షణ తీసుకున్నా. ట్రైనింగ్ పూర్తికాక ముందే నా ప్రతిభను గుర్తించిన కొందరు నిర్మాతలు అవకాశం ఇచ్చారు. ఫొటోలతో నేను ఏ సినిమా ఆఫీసు చుట్టూ తిరగలేదు’’ అని అన్నారు.